Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశమే అమ్మకాలకు ప్రయోగశాలగా మారింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతున్నది. ఫలితంగా తరతాలుగా అణచివేయబడిన సామాజిక తరగతులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ప్రత్యేక వెసులుబాట్లు, హక్కుల అమలు ప్రశ్నార్థకంగా మారాయి. నూటికి 80శాతంగా ఉన్న దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని వెనక్కు తీసుకుంది. అయినా పరోక్షంగా కార్పొరేట్లకు అప్పగించే చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగం, వ్యవసాయ రంగం తరువాత దోపిడీకి అవకాశాలున్న భారతీయ అడవులపై కార్పొరేట్ల కన్నుపడింది. అడవుల్లో విస్తారంగా ఉన్న బొగ్గు, యురేనియం, అల్యూమినియం, ఇనుము, మాంగనీసు, రంగురాళ్ళు, రాగి వంటి ఖనిజసంపదను దోపిడీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం దారులు వేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం కిటికీలు తెరిచింది. నేడు బీజేపీ ప్రభుత్వం తలుపులనే తెరుస్తున్నది. అడవే జీవనాధారంగా బతుకుతున్న అడవి బిడ్డలకు ఎకరం, రెండెకరాల పోడు భూమిపై హక్కులు కల్పించమని అడిగితే, అడవి నాశనం అవుతుందని గగ్గోలు పెట్టిన కుహానా పర్యావరణ మేధావులు ఇప్పుడేమి సమాధానం చెపుతారు. అటవీ సంరక్షణ నియమాలు 2022 అమలైతే జరిగే పరిణామాలు ఏమిటి?
నూతన అటవీ నియమాలు - సమాజానికే పెనుముప్పు
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ 2022 జూన్ 28న ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అది పార్లమెంట్ ముందు ఆమోదానికి ఉంది. ''అటవీ సంరక్షణచట్టం 1980''ని అమలు చేయడానికి రూపొందించిన నియమ నిబంధనలే ''అటవీ సంరక్షణ నియమాలు 2022'' అని ప్రభుత్వం పేర్కొన్నది. అడవులు, అటవీ భూములను అటవీయేతర కార్యక్రమాలకోసం మళ్ళించడమే అటవీ సంరక్షణ నియమాలు - 2022 ప్రధాన ఉద్దేశం. అందుకు మూడు దశల్లో కమిటీలను నియమించాలని చెప్పింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్ చైర్మన్గా మరో ఆరుగురు సభ్యులతో అటవీ సలహా కమిటి (ఎఫ్ఎసి) ఏర్పాటవుతుంది. కేంద్రం సూచించే నోడల్ అధికారి చైర్మన్గా మరో ఇద్దరు సభ్యులతో ప్రాంతీయ ఎంపవర్డ్ కమిటి ఏర్పడుతుంది. ఈ రెండు కమిటీల్లో ఎక్స్పర్ట్ పేరుతో ఒక ప్రయివేటు వ్యక్తిని నాన్ అఫిషియో సభ్యునిగా కేంద్రం నామినేట్ చేస్తుంది. రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని అటవీ ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఐదుగురితో రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటి ఉంటుంది. దీనికి కూడా ఛైర్మన్గా నోడల్ అధికారిని కేంద్రమే నియమిస్తుంది. వీటిలో ఎక్కడా అడవుల్లో 90శాతం అంతర్భాగంగా ఉన్న గిరిజనుల హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ, రాష్ట్రగిరిజన సంక్షేమ శాఖ అధికారులకు చోటు లేకపోవడం గమనార్హం. కార్పొరేట్ల ప్రయోజనాల ముందు గిరిజనుల ప్రయోజనాలు ముఖ్యం కాదని చెప్పకనే చెపుతున్నది. పారిశ్రామిక అవసరాల కోసం అటవీ భూములు కావాలనుకునేవారు కేంద్రం రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని క్షేత్రస్థాయి పరిశీలన కోసం రీజినల్ ఎంపవర్డ్ కమిటి ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీలకు పంపుతారట. ఈ కమిటీ నాలుగు అంశాలపై పరిశీలన చేసి అటవీయేతర భూమిగా మార్చాలని ప్రతిపాదించింది. 1. రిజర్వేషన్ : అటవీ భూమిగా గుర్తించబడిన భూమిని చట్ట ప్రకారం అటవీయేతర భూమిగా మార్చడం 2. డైవర్షన్ : అటవీ భూమిని అటవీ యేతర కార్యక్రమాలకోసం లీజుకు ఇవ్వడం. 3. ల్యాండ్ బ్యాంక్ : అటవీ భూమికి బదులుగా సదరు ప్రయివేట్ సంస్థ నష్టపరిహారం చెల్లించి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడం, అయితే నష్టపరిహారం డబ్బులు రాష్ట్రం దుర్వినియోగం చేసే అకాశం ఉన్నందున్న వాటిని అటవీ నష్టపరిహార నిథిని ఏర్పాటు చేసి అందులో జమచేయమంటుంది. రాష్ట్రాలపై నమ్మకం లేదనే పేరుతో కేంద్రమే వాటిని లాగేసుకుంటుంది. 4. లైనియర్ ప్రాజెక్టు : అటవీ భూమిని సింగిల్ విండో విధానం లాగా సరళంగా మార్పు చేసి ప్రాజెక్టులు, రోడ్లు, పైప్లైన్లు, విద్యుత్ అవసరాల కోసం అటవీ భూములను అప్పగిస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం, అనుకూల ప్రతికూల అంశాలన్నీ పరిశీలించి నేరుగా కేంద్ర అటవీ సలహా కమిటీకి పంపాల్సి ఉంటుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న హక్కులు, అభ్యంతరాలు ఇక్కడ చెప్పడానికి లేదు. కేవలం సూత్రప్రాయంగా అంగీకరించాలని నియమాల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఇది ఫెడరల్ స్పూర్తికి భిన్నమైంది. అంతిమంగా అనుమతులు ఇవ్వాలల్సిన అథారిటీ కేంద్ర అటవీ సలహా కమిటీకి మాత్రమే ఉన్నది. కనిష్టంగా 40హెక్టార్లు (ఒక హెక్టారుకు 2.5 ఎకరాలు) గరిష్టంగా 1000 హెక్టార్లు, అవసరాన్ని బట్టి లిమిట్ పెట్టకూడదని చెప్పింది. అటవీ భూమిని పొందిన ప్రయివేట్ సంస్థ రెండు సంవత్సరాల లోపు కార్యక్రమాలు ప్రారంభించాలి. 20శాతం కన్నా తక్కువ సాంద్రత కలిగిన అటవీ ప్రాంతాలను ప్రయివేట్ వారికి అడవుల పెంపకానికి లీజుకు ఇవ్వాలని మరో నిబంధన ఉన్నది. అందుకు ప్రయివేట్ అడవులు అని పేరు పెట్టి అభివృద్ధి చేయాలని పేర్కొన్నది. ఇలా లక్షలాది ఎకరాల అటవీ భూములను ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెడుతూ, వాటిలో తరతరాలుగా జీవిస్తున్న గిరిజనులు, పేదల హక్కుల గురించి ఒక్క మాట కూడా ఈ నియమా ల్లో చెప్పలేదు. ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాల కారణంగా ఆ ప్రాంతంలో వన్యప్రాణుల అభివృద్ధి, పరిహార అడవి పెంపకం, భూమిలో మార్పుపై సదరు సంస్థ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పింది. అడవి బిడ్డల హక్కులు, రక్షణ బాధ్యత మాత్రం అటు కేంద్రానికీ ఇటు సంస్థకూ ఎవరికీ లేదట!
కాలరాయబడుతున్న గిరిజన హక్కులు
అటవీ సంరక్షణ నియమాలు 2022 అమల్లోకి వస్తే ప్రధానంగా అటవీ పోడు భూములపై గిరిజనులు, పేదలకు హక్కు కల్పించాలన్న అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006పై తీవ్ర ప్రభావం పడుతుంది. 2006 నుండి చట్టం పరిధిలో హక్కులు కావాలని దరఖాస్తు చేసుకున్న గిరిజనులు, పేదల సంఖ్య దేశంలో 25లక్షల మందికిపైగా ఉంది. చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉండి దరఖాస్తు చేసుకున్నవారిలో ఒక్కోక్కరికి 10ఎకరాల లోపు హక్కులు కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణలో 2021 డిసెంబర్ 8 నాటికి 3.45లక్షల మంది 13 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులుకావాలని దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కోట్లాది మంది గిరిజనులు, పేదలు అటవీ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులు, తునికాకు వంటి వాటిని సేకరిస్తున్నారు. అడవులపై కార్పొరేట్స్ ఆధిపత్యం పెరిగితే సేకరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగంలో ఐదు, ఆరు షెడ్యూల్ ప్రాంత హక్కులు పూర్తిగా కాలరాయబడ తాయి. ఎందుకంటే నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022లో ఎక్కడా వీటి అమలు ప్రస్థావన లేదు. పంచాయతీరాజ్ షెడ్యూల్ ప్రాంత విస్తరణ చట్టం (పెసా), భూ బదలాయింపు చట్టం (1/70) ప్రకారం అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు, పరిశ్రమ, ఖనిజ తవ్వకాలకు భూములను ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి వీలులేదు. అక్కడి గిరిజన గ్రామ సభల అనుమతితో కూడిన తీర్మా నాలు, అభిప్రాయాలు తప్పని సరిగా తీసుకోవాలి. విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలుతీర్పుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వాలను కూడా ఆ ప్రాంతంలో గిరిజనేతర సంస్థలుగానే పరిగణిం చాలని చెప్పింది. ఇష్టారాజ్యంగా భూములను ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వీలు లేదని కరాకండిగా తేల్చిచెప్పింది. కాని ఇందుకు భిన్నంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెస్తున్న నూతన అటవీ నియమాలు, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య. లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతాన్ని కార్పోరేట్లకు కట్టబెడితే రాజ్యాంగ హక్కులను ఎవరు అమలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి.
- ఆర్. శ్రీరాం నాయక్
సెల్ : 9440532410