Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగల్లో వినాయక చవితిది ఓ ప్రత్యేక స్థానం. వివిధ అలంకారాల్లో, ఆకారాల్లో వాడవాడల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మరి ఆ బొమ్మల తయారీ వెనుక, రంగుల కలబోత వెనుక ఎన్ని చేతులు పనిచేస్తాయి? ఎంత కష్టం ఉంటుంది?
'వినాయక చవితి పండుగకి ఐదునెలల ముందు నుంచే బొమ్మల పని మొదలవుతుంది' అంటున్న లక్ష్మి పిల్లలు బడి ముఖం ఎరిగిందే లేదు! చింపిరిజుట్టుతో సరైన తిండిలేక రోడ్లవెంట తిరుగుతుంటారు. బొమ్మల కోసం వచ్చేవారి దగ్గర చేయి చాచి అడగడం కనిపిస్తుంటుంది. దీని గురించి మాట్లాడు తూ 'బిడ్డలకి సమయానికి వండిపెట్టడం మాట అటుంచి, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసినా సీజన్ తరువాత రెండు పూటలా తిండి దొరకడం చాలా కష్టం' అని వాపోతుంది లక్ష్మి.
లక్ష్మి లాంటి ఎన్నో కుటుంబాలు బొమ్మలు తయారీ చేస్తూ జీవనం సాగించడం శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కనబడుతుంటుంది. ''మా లాగా మా పిల్లలు బతకడం నాకు ఇష్టం లేదు. పిల్లలను బడికి పంపించాలని ఆశగా ఉన్నా మా పరిస్థితులు అనుకూలించడం లేదు. బొమ్మల పని ఉన్నప్పుడు ఫరవాలేదు. ఆ తరువాత ఏ పనీ లేక దుర్భరజీవితం అనుభవిస్తాం. హైవే పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో తాత్కాలికంగా టెంట్లు వేసుకుని ఉంటున్నాంగానీ, ఇక్కడినుంచి ఖాళీ చేయమని రోజూ ఎవరో ఒకరు వస్తుంటారు. ఎప్పుడు వెళ్లిపొమ్మంటారోనని భయంభయంగా ఉంటుంది. సీజన్లో సంపాదించిన డబ్బుతోనే తిండి, బట్ట, బొమ్మలకు పెట్టుబడి చూసుకోవాలి. మా కష్టం పోను మిగిలేది చాలా తక్కువే' అంటుంది లక్ష్మి. బొమ్మల తయారీలో వీరి బతుకులు బాగుపడతాయా? దశాబ్దాలు గడుస్తున్నా మారని ఎన్నో జీవితాలకు ఈ బొమ్మల తయారీదార్లు మినహాయింపు కాదు. అందుకే పండుగ అంటే పిండివంటలు, కొత్తబట్టలు, బొమ్మలు, భజనలు, ఉత్సవాలే కాదు ఎన్నో ఆకలి బతుకులు కూడా!
- జ్యోతిర్మయి