Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలక మీద గీసిన పదం లెక్క
పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క
ఎంత సక్కంగుంటవే
నా బాసమ్మ... ఓ యాసమ్మ
జమ్మి చెట్టు కొమ్మా...
అక్షరాల రెమ్మా నువ్వు మాకు
బంగారానివే... సింగారానివే
బుడిగ జంగాల కథలలో
బాగోతపు వ్యథలతో
జానపదమై వర్థిల్లిన
పాటల పూదోట
నా తెలంగాణ భాష
యాదగిరి యాది నా యాస
ఓరుగల్లునూ... గుండెజల్లునూ
అలుముకున్న స్మృతి
శాతవాహన సప్తశతి
నా తెలంగాణ సంస్కృతి
ఏములవాడ రాజన్న
పాల్కురికి సోమన్న
బమ్మెర పోతన్న
దీవించిన భాష మనది
కొమరం భీముడు ఎత్తిన
పిడికిలైంది నా భాష
సుద్దాల హనుమంతు గొంతెత్తిన
పాటైంది నా భాష
కాళోజీ కలం గీతై
దాశరథీ కలల రాతై
కన్నీటి చెలమల్ని
కవ్వించుకుంది నా భాష
మనసెరిగిన మాండలికమై
కన్నతల్లోలే అదుముకుంది
సొంత చెల్లోలే అలుముకుంది
నా తెలంగాణ మాట
తంగేడుపూల బాట
యవారాలూ కువారాలూ
బొంకిచ్చుడు బొర్లేసుడు
తెల్వనిది నా భాష
అలాయి బలాయి లిచ్చే
ఆత్మీయత నా యాస
పలుకు పలుకు తేనెలొలుకు
పంచభక్ష్య పరమాన్నం
ఆపతీ సంపతీల
సోపతి కట్టిన నా భాష
తెలంగాణ తల్లి మెడలో
గొలుసుకట్టు నా యాస
పదహారణాల సొక్కమైన
బాస నీకు దండమే...!
తెలంగాణ గళంలోన చిక్కనైన
యాసనీకు దండమే...!!
-డాక్టర్ కటుకోఝ్వల రమేష్
సెల్:9949083327
(నేడు తెలంగాణ భాషా దినోత్సవం)