Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్యాయం ఎక్కడున్న వ్యతిరేకించాడు. మంచి ఎక్కడున్న స్వాగతించాడు. అణచివేతలకు ఎదురు తిరిగాడు. పాలకుల రాక్షసత్వాన్ని, పెత్తందారి స్వభావాన్ని ఎదురించాడు. ప్రజా ఉద్యమాలలో, రాజకీయ ఉద్యమాలలో, సాహిత్య ఉద్యమాలలో, భాషా ఉద్యమాలలో, సంస్కృతిక ఉద్యమాల్లో తన ధిక్కారాపు స్వరంతో అనేక అంశాలపై పోరాటం చేసిన వాడు కాళోజీ. కాళోజీ జీవితాంతం ప్రజా స్వామ్యవాదిగా ఉన్నాడు. ''నీ అభిప్రాయాల్ని నీవు స్వేచ్ఛగా ప్రకటించే హక్కు నీకు లేనప్పుడు ప్రాణాల్ని సైతం లెక్కచయకపోరాడాల''ని చెప్పిన మేధావి కాళోజీ. రజాకార్ల నెదిరించిన కాళోజీ జైలు జీవితం గడిపాడు. నిరంకుశ నిజాం రాజును ధిక్కరించాడు.
దాశరథి అన్నట్లుగా తెలంగాణ ఆధునిక సాహత్య ముఖద్వారం కాళోజీ. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ. నాడు నిజాం నవాబును ప్రతిఘటించిన కాళోజీ కలం ఓ రాజా కవితలో... ''రాణి వాసములోన రంజిల్లు రాజా/ రైతు భాధలు తీర్చి రక్షింపలేవా/ పట్టణపు సోగసుకై పాటుపడు రాజా / పల్లె కందము గూర్చు ప్రతిభయే లేదా/ పోషించు వాడవని పూజించు జనుల / పీఠమెక్కిన దాది పీడించుటేనా'' అని ప్రశ్నించిన తీరు నేటిపాలకుల పని తీరుకూ అద్దంపట్టినట్లుగానే ఉంటుంది. కాళోజీ కవిత్వం వ్యక్తిత్వం వేరు వేరు కాదు. కాళోజీ ప్రజలకు, సమాజానికి, కొన్ని విలువలకు కట్టబడిన కవి. కాళోజీ కవిత్వానికి అవార్డులు ప్రకటించడం కష్టం. ఎందుకంటే కాళోజీ అక్షరాలు అన్నీ విమర్శించే కొరడాలే. అతడు అవార్డుల కోసం రివార్డులకోసం ఏనాడూ ఆశించలేదు. అందుకే ''దోపిడీ చేసే ప్రాంతేతరులను ప్రాంతం దాకా తన్ని తరుముతం... ప్రాంతంవాడే దోపిడీ చేస్తే / ప్రాణలతో పాతర వేస్తం'' అని నినదించగలిగాడు. అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు.
భాషనుపయోగించే విషయంలో కాళోజీకి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దృష్టిలో భాష రెండు రకరకాలుగా ఉంటుంది. ఒకటి ''బడి పలుకుల భాష'', రెండవది జనం నిత్య వ్యవహారాలలో వాడే ''పలుకు బడుల భాష''. ఏ భాషకైనా జీవధాతువు మాండలికమేనంటాడు.
కాళోజీ నారాయణరావు 9.9.1914న కర్నాటక ప్రాంతంలోని భిజాపురు జిల్లాలో ఉన్న రట్టహాళ్లి అనే గ్రామంలో జన్మంచాడు. 13.11.2002న మరణించాడు. బతుకంతా తెలంగాణగా, ప్రజల ఉద్యమంగా బతికిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. కాళోజీది తిరుగుబాటు కవిత్వం. సమాజ గొడవను తన గొడవగా చేసుకొని ''నా గొడవ'' పేరుతో కవిత్వాలను రాసి వాటిని సంపుటాలుగా వెలువ రించాడు. తెలంగాణ శ్రామిక జన భాషా సంస్కృతులకు పట్టం కట్టాలి అన్నది ఆయన కల. ఆయన స్మృతిలో నేడు ''తెలంగాణ భాషా దినోత్సవం'' జరుపుకోవడం సంతోషించదగినదే. కానీ ఈ ఉత్సవాలు చిత్తశుద్ధితో ఆయన కల నిజం చేస్తున్నాయా..?
- ఎనుబోతుల వెంకటేష్
సెల్:9573318401