Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాచరికపు దొరల గడీల ముందు
వంగి వంగి నడుస్తున్న మట్టి మనుషుల్ని నిటారుగా నిలబెట్టింది, ఎవరు?
మూతి మీద మీసం మొలిచినా
నేరమైన ఈ నేలకు పౌరుషం నేర్పించింది, ఎవరు?
మొద్దుకు కట్టేసిన ఎద్దులా పని చేస్తున్న పాలేర్లకు పోరు పొద్దును
పరిచయం చేసింది, ఎవరు?
వెట్టి కుంపటిలో సల సల మరుగుతున్న
సకల కుల జనుల సంకెళ్లు తెంచి
చల్లని వెన్నెలను కురిపించింది, ఎవరు?
''ఎల్లిగాడు సన్ ఆఫ్ పుల్లిగాడు''
అంటూ.... దొర కొడుకులు
మన తాత ముత్తాలను పిలిచినప్పుడు
ఎల్లిగాడిని ఎల్లయ్యను చేసింది, ఎవరు?
పుల్లిగాడిని పుల్లయ్యను చేసింది, ఎవరు?
మన గుడిసె కొప్పులపై ఆత్మ గౌరవ జెండాలు ఎగరేసింది, ఎవరు?
మదమెక్కిన దొరతనం
మన బిడ్డల ఆడతనంపై దాడి చేస్తున్నప్పడు
మోదుగుపూల మొనలకు కత్తుల్ని కట్టింది, ఎవరు?
కత్తి కొక కండ చొప్పున
బలిసిన దొరల కండ కావరాల్ని
తెగ నరికింది, ఎవరు?
లక్షల ఎకరాల పల్లె భూస్వామ్యం
గోల్కొండ నగర అరాచక నిజాం రాజ్యం
ధన మాన ప్రాణాలను ధ్వంసం చేస్తున్న
ఖాసీం రజ్వీ ప్రైవేటు సైన్యం
తెలంగాణా గుండెల్ని చీల్చుతున్నప్పుడు
సకల కుల మత శ్రామికులను ఏకం చేసి
రాము రహీముల్ని సాయుధుల్ని చేసింది, ఎవరు?
తల్లి తెలంగాణకు విముక్తి కల్పించింది, ఎవరు?
చారెడు నేల కోసం చాకిరీ రద్దు కోసం
నాజీలను మించిన నరహంతక
నైజామును తరమడం కోసం
రక్షణ దళాలను నిర్మించింది, ఎవరు?
లక్షల ఎకరాలను పంచింది, ఎవరు?
ప్రజల కొరకు ప్రాణాలను
తృణప్రాయంగా అర్పించింది, ఎవరు?
సంగం పెట్టింది, ఎవరు?
గుతపలు పట్టింది, ఎవరు?
వడి వడిగా వడిశెలు విసిరింది, ఎవరు?
గురి చూసి మరీ గడీల గుండెలపై
కసి తీరా కాల్చింది, ఎవరు?
తమ ఊపిరి ఆగిపోతున్నా
తల్లి తెలంగాణకు స్వేచ్చా గాలుల్ని
అందించింది, ఎవరు?
ఎవరు?.... షేక్ బందగీ?
ఎవరు?.... మగ్దూం మొహియుద్దీన్?
ఎవరు?... షోయబుల్లా ఖాన్
ఎవరు?... ఐలమ్మ...
కమలమ్మ... స్వరాజ్యం?
ఎవరు?... కొమరయ్య... సుందరయ్య?
రావి.... చిర్రావూరి
ఎవరు?.... భీమిరెడ్డి... ఎల్లారెడ్డి
మంచికంటి... దేవులపల్లి?
ఎవరు?.... ఎవరు?.... ఎవరు?
తెలంగాణా గుట్టల్లో యేరులై పారి
ఎండిన నెత్తుటి చారలను అడుగు
పల్లెల పొలిమేర్లలో మొలిచిన
ఎర్రటి స్థూపాల మొక్కలను అడుగు.
పాత గోడలపై మందుపాతరలై
పేలుతున్న నినాదాలను అడుగు
రచ్చబండ అరుగుల కాడ
ఊరి మూల మలుపుల కాడ
నిలువెత్తు సాక్ష్యమై ఎగురుతున్న
ఎర్రటి జెండాలను అడుగు
ఎవరు?.... ఎవరు?... ఎవరు?
ఇంకెవరు... ఇంకెవరు... ఇంకెవరు
కమ్యూనిస్టులు... కమ్యూనిస్టులు
కమ్యూనిస్టులు... కమ్యూనిస్టులు
వీర తెలంగాణ సాయుధ
రైతాంగ పోరాట యోధులు
మన తెలంగాణా చెలకల్లొ
విరభూసిన ఎర్రటి మందారాలు
(తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా)
- బండారు రమేష్,
సెల్:9490098251