Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం డెబ్బై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ తరుణంలో భారతదేశం 1947లో ఎలా ఉన్నదీ, గడచిన డెబ్భై ఐదేండ్లలో అది ఎలా, ఏమి మారిందీ, వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఎలా ఉండాలో ఆలోచించవలసి ఉంటుంది.
మనకు స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో సామ్రాజ్యవాద బ్రిటన్ భారతదేశాన్ని పేద దేశంగా మార్చి వెళ్ళిపోయింది. దేశ వ్యాప్తంగా ఫ్యూడలిజం(భూస్వామ్య విధానం) ఆధిపత్యంలో ఉంది. నాడు ఫ్యూడలిజం యొక్క అత్యంత నీచమైన రూపంగా కుల వ్యవస్థ ఉంది. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఉనికిలో ఉంటుందనీ, ఫ్యూడలిజం, దానికి అనుబంధంగా ఉండే కుల వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని మనందరం విశ్వసించాం. మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా మార్చాలని ప్రయత్నం చేశారు. భారతదేశం సార్వభౌమాధికార, సామ్యవాద (సోషలిస్ట్), లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉంటుందని మన రాజ్యాంగంలోని ప్రవేశిక తెలియచేస్తుంది.
దేశంలో పౌరులందరికీ సమానమైన అవకాశాలను సమకూర్చడమే ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్రం అనంతరం భారతదేశం, మానవ వనరుల అభివృద్ధిలో, పేదరిక నిర్మూలనలో, ఆనంద సూచికలో చాలా వెనుకబడి ఉంది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారడం, పేదలు పేదలు గానే మిగిలిపోవడం లేదా అంచులకు నట్టివేయబడడంగా మన దేశాభివృద్ధి ఉంది.
స్వాతంత్య్రం అనంతరం భారతదేశం ఫ్యూడలిజం, కుల వ్యవస్థలను నిర్మూలించాల్సి ఉంది. నాడు భూసంస్కరణలు, వ్యవసాయిక సంబంధాలలో విప్లవం లాంటివి అవసరమైన అంశాలుగా ఉన్నాయి. కానీ అవి జరుగలేదు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు అభివృద్ధికి అవసరమైన ముడి పదా ర్థాలు లభ్యమయ్యే మనకున్న అనేక సార వంత మైన భూము లను సేకరించ వచ్చు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ పర్య వేక్షణలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాల వృద్ధి జరుగ లేదు.
స్త్రీల పట్ల వివక్ష తను ప్రదర్శిస్తూ, స్త్రీలను ద్వేషించే ధోరణులను ప్రోత్సా హించే సాంప్రదాయ వైఖరులు, అమానవీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడే చట్టాలను సృష్టించడం ద్వారా ప్రభుత్వం ఉజ్వలమైన భవిష్యత్తు గల దేశంగా తయారు చేయవచ్చు. మతం పేరుతో అమానవీయ ఆచార, సంప్రదాయాలు కొనసాగడానికి అనుమతించకూడదు. ఉదాహరణకు, మతం యొక్క మద్దతు ఉన్నప్పటికీ అమానవీయ ఆచారం అనే కారణంగా బ్రిటిష్ వారు సతీసహగమనాన్ని రద్దు చేశారు. అయినా, జవహర్ లాల్ నెహ్రూ లాంటి నాయకులు ఊహించిన శాస్త్రీయ విలువలపై ఆధారపడి దేశం యొక్క అభివృద్ధికి మనం దిశానిర్దేశం చేయలేక పోయాం. ఇప్పుడు స్వయం ప్రకటిత మెజారిటీ మతం ఆజ్ఞాపిస్తే, దేశంలో మిగిలిన వారు అనుసరించే పరిస్థితికి చేరుకున్నాం. భారతదేశం ప్రస్తుతం అప్రజాస్వామిక, అలౌకిక మార్గంలో నడుస్తుంది.
ఏ ప్రజాస్వామిక దేశం కూడా విస్మరించలేని ఒక ఆదర్శం లౌకికవాదం. భారతదేశంలో ప్రధానంగా ఐదు లేదా ఆరు మతాలు, దాదాపు 6000 కులాలు, సుమారు 1600 భాషలు ఉన్నాయి. ఒకవేళ 'ఏకత్వం'తో కూడిన ఈ 'భిన్నత్వాన్ని' మనం అంగీకరించకుంటే, ఒక దేశంగా మనం వైఫల్యం చెందడం ఖాయం. నేటి మన భారతదేశంలో, భిన్నత్వం అనేది కేవలం మన రాజ్యాంగంలో మాత్రమే ఉంది, అమలులో లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఓట్లు, అధికారం కోసం కుల, మతాలను ఉపయోగించుకోవడం సర్వసాధారణమైపోయింది. భారతదేశం ఒక విభజన దేశంగా మారుతుంది.
మన రాజ్యాంగంలో ఊహించిన భారతదేశం భిన్నమైనది.100వ స్వాతంత్య్రదినోత్సవం దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న భయంకరమైన పరిస్థితి ఇది. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా పేద ప్రజలు ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన మహిళలు ఉన్నారు. శ్రామిక శక్తిలో భారతీయ మహిళలు కేవలం 23శాతంగా ఉన్నారు, దానిలో కూడా వారు అసమాన వేతనాల వివక్షతను ఎదుర్కొంటున్నారు. మిగిలిన మహిళలంతా ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మహిళలకు కల్పించిన 33శాతం రిజర్వేషన్లు, క్షేత్ర స్థాయిలో ఉన్న రాజకీయ సంస్థల్లోకి ప్రవేశించడం, వారి సమస్యలపై గొంతెత్తి చాటేందుకు ఉపయోగపడ్డాయి. జనాభాలో 50శాతంగా ఉన్న మహిళలు, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రాతినిధ్యం ద్వారా అధికార పదవులను చేపట్టాలి. అభివృద్ధి సూచికలలో భారతదేశం కన్నా వెనుకబడి ఉన్న దేశాల్లోని ప్రభుత్వాలు, రాజకీయ సంస్థల్లో మహిళలు మనకంటే మెరుగైన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు.
ఒక ప్రజాస్వామిక దేశానికి అనివార్యంగా ఉండాల్సిన లక్ష్యం సోషలిజం. ప్రతీ పౌరుడు ఎటువంటి వివక్షతను ఎదుర్కొనకుండా పని చేసే అవకాశాన్ని కల్పించి, దేశ నిర్మాణానికి అవకాశం కల్పిస్తుంది సోషలిజం. లింగ, సామాజిక హౌదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ సమానంగా చూసే వ్యవస్థే సోషలిస్టు వ్యవస్థ. ఈ వ్యవస్థ ఉనికిలో కొనసాగాలంటే, ప్రభుత్వం ప్రగతిశీలమైన చట్టాలను తీసుకొని రావాలి, కార్యనిర్వహక శాఖ ఈ చట్టాలను అమలు చెయ్యాలి, న్యాయ వ్యవస్థ వాటికి మద్దతుగా నిలవాలి.ఇది భారతదేశంలో వాస్తవ రూపం దాల్చాలి.
నేను వామపక్ష రాజకీయాలకు, కేరళలో అనేక పర్యాయాలు అధికారం చేపట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)కు చెందిన వ్యక్తిని. ఒక రాష్ట్రాన్ని పాలించడానికి ఎన్నుకోబడిన పార్టీ, సమాఖ్య రాజ్యాంగానికి లోబడి కొంత మేరకు మాత్రమే ప్రజలకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. అయినప్పటీకీ, రాష్ట్రంలో భూమి, విద్య, వైద్యానికి సంబంధించిన సంస్కరణల కారణంగానే కేరళ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి, కేరళలో జీవన ప్రమాణాలు (వాస్తవ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ) అనేక ఇతర రాష్ట్రాల కంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్నాయి. ఇలాంటి పరిణామాలను కొనసాగించాలంటే, దేశం మొత్తం సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా పని చేయాల్సి ఉంటుంది, లేకుంటే అనేక మంది ప్రజలు పేదరికం లోకి నెట్టబడతారు.
వందవ స్వాతంత్య్ర దినోత్స వాన్ని మనం ముందు ఊహిస్తే, లింగ వివక్షత లేని, కులపరమైన శ్రేణీగత వ్యవస్థ అంతమై, లౌకికవాదం ఉనికిలో ఉండే భారతదేశంగా ఉంటుంది. అది దేశంలోని భిన్నత్వాన్ని చూసి గర్వపడే పౌరులను సృష్టించగలగాలి. ప్రజలు కులం, మతం లేదా భాష లాంటి అంశాల ఆధారంగా విభజింప బడకూడదు. సంస్కృతిని పెంపొందించడానికి భాష చాలా ముఖ్యమైనది, కానీ ప్రతీ భాషకు సమానమైన గౌరవం ఇవ్వాలి. ప్రజలు వారి వారి మత విశ్వాసాలను ఆచరించవచ్చు కానీ వారు ఇతర మతాలను అగౌరవ పరచకూడదు. కాలానికి అనుగుణంగా మారేందుకు వారు సిద్ధంగా ఉండాలి.
భారతదేశ వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భావప్రకటనా స్వేచ్ఛను హరించని, మతపరమైన తీవ్రవాదులకు భయపడకుండా ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించడానికి అనుమతించే భారతదేశం ఉంటుందని ఆశిస్తున్నాను.
భారతదేశం, తన వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పేదలకు స్వంత భూమిని కలిగి ఉండే విధంగా, ఉచిత విద్య, విద్యుత్తు, తాగునీరు, మంచి ఉద్యోగం, మంచి వేతనాలు, సరసమైన మార్కెట్లను భారతదేశం అందుబాటులోకి తెచ్చే స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఏ విధమైన లింగ వివక్షతను ఎదుర్కొనకుండా చదువుల్లో రాణించే పిల్లలను కలిగి ఉండే భారతదేశాన్ని కోరుకుంటున్నాను. స్త్రీ, పురుషులిరువురూ పరస్పర గౌరవ భావంతో కలిసిమెలసి ఉండే విధంగా, ఏ విధమైన లైంగిక దాడికి గురి కానటువంటి మహిళలు ఉండే భారతదేశాన్ని కోరుకుంటున్నాను. ఎలాంటి మత ఘర్షణలు జరుగటువంటి భారతదేశాన్ని కోరుకుంటున్నాను. చివరగా, మన రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా లౌకిక, సోషలిస్టు, ప్రజాస్వామిక భారతదేశాన్ని నేను కోరుకుంటున్నాను.
- కె.కె. శైలజ
అనువాదం: బోడపట్ల రవీందర్
9848412451