Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీన దినోత్సవ సందర్భంగా ఈనెల 10 నుంచి 17 వరకు వారోత్సవాలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ప్రధాన కార్యదర్శితో సహా నలుగురు పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సందర్భంగా జరిగే సభలలో పాల్గొననున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విశిష్టతను తెలంగాణ ప్రజల ముందుంచడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమాయత్త మవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఏడాది పాటు వజ్రోత్సవ వేడుకలకు పిలుపునిచ్చింది. ఆశ్చర్యకరంగా ఎంఐఎం నాయకత్వం కూడా ఇదే వైఖరి తీసుకున్నది. తిరంగ యాత్రకు పిలుపు ఇచ్చింది. కాంగ్రెసు కూడా, సహజంగానే విలీనోత్సవాలు నిర్వహిస్తామన్నది. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు బీజేపీ మాత్రం వక్రమార్గం వదలలేదు. విమోచన దినోత్సవం పేరుతో విచ్ఛిన్నకర ఎత్తుగడలతోనే ముందుకు పోతున్నది.
కాలం గడుస్తున్నా కొద్దీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటగాథ మరింత ప్రాధాన్యతను సంతరించు కుంటున్నది. ఐదేండ్ల సుదీర్ఘ రైతాంగ పోరాటం, దేశంలో భూమి సమస్యను ఎజెండా మీదకు తెచ్చింది. మాతృభాష, భిన్న సాంస్కృతిక విలువల ప్రాధాన్యతనూ ముందుకు తెచ్చింది. ఒకవైపు జమీందారీ వ్యతిరేక పోరాటం సాగిస్తూనే, జాతీయ స్రవంతి వైపు తెలంగాణ ప్రజలు అడుగులు వేసారు. బ్రిటిష్ ఇండియాలో జరుగుతున్న జాతీయోద్యమ ప్రభావంతో తెలంగాణలో కూడా తమ బిడ్డలకు 'స్వరాజ్యం' లాంటి పేర్లు పెట్టుకోవటమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రమహాసభలో చురుకుగా పాల్గొంటూ నాయకత్వ స్థాయికి ఎదిగిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి అనేక మంది సరిహద్దు ఆంధ్ర ప్రాంతంలో స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రకమిటీ ఆదేశం మేరకు తెలంగాణ రైతాంగ పోరాటం నిర్మించే బాధ్యతలు పుచ్చలపల్లి సుందరయ్య స్వీకరించారు. కేంద్ర నాయకత్వంతో సమన్వయంతోనే ఇక్కడ సాయుధపోరాటం సాగింది. అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం తెలంగాణ గ్రామాలకు తరలివచ్చారు. దళాలకు షెల్టర్లు ఏర్పాటు చేయటం, ఆర్థిక సహాయాన్ని అందించటంలో ఆంధ్ర ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలు గొప్ప కృషి చేసారు. ఈ క్రమంలో పోలీసు నిర్బంధాన్ని సైతం ఎదుర్కొన్నారు. చిత్రహింసలు భరించారు. ఉత్తర భారతదేశంలో సైన్యాధికారిగా పనిచేస్తున్న ఆనాటి యోధుడు మేజర్ జైపాల్ సింగ్ కూడా తరలివచ్చి, తెలంగాణ సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ఉద్యమం తొలినుంచీ చివరి వరకు ఎప్పుడూ ఒంటరిగా లేదు. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టుపార్టీ కూడా ఆనాడు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనం కావాలని డిమాండ్ చేసింది.
'విమోచనా? విలీనమా?' అన్న చర్చ నడుస్తున్నది. నిజానికి తెలంగాణ రైతాంగం పేద ప్రజలు భూస్వామ్య దోపిడీ నుంచీ, జమీందారీ అణచివేత నుంచీ విముక్తి కోరుకున్నారు. అందుకే వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మొదలైన పోరాటం భూపోరాటంగా మారింది. భూసంస్కరణలు అమలు చేస్తామని నెహ్రూ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ భూస్వామ్య విధానం రూపం మార్చుకుంటున్నదే తప్ప రద్దు కాలేదు. కాంగ్రెసు పాలకులే కాదు, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా భూస్వాముల భూములు ముట్టుకోడానికి సిద్ధపడలేదు. భూస్వామ్య దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలకు విమోచన జరగలేదు. నేటికీ ఆ పీడ విరగడ కాలేదు. పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. దున్నేవాడికే భూమి స్థానంలో బడా పారిశ్రామిక వేత్తలకు సంతర్పణ ముందుకొచ్చింది. రైతు వ్యవస్థకే ముప్పుతెచ్చింది. అడవుల మీద ఆదివాసీల హక్కులు నీరుగార్చుతున్నారు. బడా పెట్టుబడిదారులు పంజా విసురుతున్నారు. ఎప్పుడో... పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా అభివృద్ధి పేరుతో గుంజుకుంటున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. భూమి పంచటం, భూస్వామ్య విధానం రద్దు చేయటం ద్వారా ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది. అది జరగకపోవటంతో ఆర్థికాభివృద్ధి కుంటుబడుతున్నది. తరచుగా ఆర్థిక మాంద్యం, సంక్షోభం తలెత్తుతున్నాయి. అందుకే భూమి సమస్య నేటికీ కీలకమైనదిగానే ఉన్నది. ఇంతటి ప్రాధాన్యత గల్గిన సమస్య కాబట్టే చరిత్రలో ఆ పోరాటం అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సాయుధ రైతాంగ పోరాట క్రమంలోనే విలీనం సమస్య ముందుకొచ్చింది. సర్దార్ పటేల్ ఉక్కు మనిషి అనీ... ఆనాటి హౌమ్మంత్రిగా, సైన్యాన్ని పంపి నిజాం రాజును లొంగదీసుకున్నాడనీ... ఫలితంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందనీ బీజేపీ ప్రచారం చేస్తున్నది. కానీ, 'నెహ్రూ-పటేల్' ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించి, యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది చారిత్రక సత్యం. రైతాంగ సాయుధ పోరాట ధాటికి తట్టుకోలేక, నిజాం రాజు చెతులెత్తేసే పరిస్థితి రావటంతో పటేల్ సైన్యాలు రంగంలోకి దిగాయి. పటేల్ సైన్యాలు వచ్చి ఉండకపోతే నిజాం రాచరికం కుప్పగూలేది. తెలంగాణ కమ్యూనిస్టుల వశమయ్యేది. భూస్వామ్య వ్యవస్థ రద్దయ్యేది. దున్నేవాడికే భూమి దక్కేది. నిరంకుశ నిజాం రాజునూ, నరహంతక రజాకార్ నేత ఖాసీం రజ్వీనీ శిక్షించేవారు. పటేల్ సైన్యాలు రంగంలోకి దిగి తెలంగాణ కమ్యూనిస్టుల ఆధిపత్యంలోకి రాకుండా అడ్డుకున్నాయి. పేదలు దున్నుకుంటున్న భూములను మళ్ళీ భూస్వాములకు కట్టబెట్టాయి. షేర్వాణీలతో గ్రామాల నుంచి తరలి హైదరాబాద్‌లో నిజాం రక్షణలో తలదాచుకున్న భూస్వాములను ఖద్దరు బట్టలతో గ్రామాలకు పంపి, భద్రత కల్పించారు. కూలిపోతున్న నిజాం రాచరిక సౌధాన్ని తామే కూల్చినట్టు పటేల్ సైన్యాలు ప్రకటించుకున్నాయి. ఎర్రజెండా నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటమే జరిగివుండకపోతే హైదరాబాద్ రాజ్యం, 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో విలీనం అయ్యే ఘట్టమే చరిత్రలో ఉండేది కాదు. అందువల్ల హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం రైతాంగ పోరాటం విజయం. ఎర్రజెండా పోరాట ఫలితం. అందుకే... విలీనాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆనాడే ఆహ్వానించింది. తర్వాత 1951 దాకా కొనసాగిన పోరాటం, అప్పటికే పేదలు సాగుచేసుకుంటున్న భూముల మీద హక్కుల కోసమే! ఇదీ చరిత్ర. ఈ పోరాట ఛాయల్లో కూడాలేని ఆర్ఎస్ఎస్, దాని రాజకీయ విభాగమైన బీజేపీ ఇప్పుడు చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ సమాజాన్ని నిజాం రాజునుంచి విముక్తి చేసింది కాంగ్రెసేనని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంటున్నది. ఇంతకంటే హాస్యాస్పదమైన వాదన మరొకటి లేదు. సంస్థానాలలో పోరాటం చేయవద్దనీ, బ్రిటిష్ ఇండియాలో మాత్రమే స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను సమీకరించాలనీ ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం, గాంధీ, అధికారికంగానే ప్రకటించారు. అందువల్ల ఇక్కడి రైతాంగ పోరాటానికీ కాంగ్రెస్ పార్టీకీ ఏమీ సంబంధం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకలాపాలే లేవు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, కొందరు ఔత్సాహికులు, కాంగ్రెస్ అనుచరులు కూడా విలీనం కావాలని కోరారు. ఇంతకు మించి కాంగ్రెస్ పాత్రలేకపోగా, కేంద్రంలో 'నెహ్రూ-పటేల్' నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం రాజుతో సంధిచేసుకున్న విషయం మరువజాలం. పైగా నిజాంను యుద్ధంలో ఓడించి లొంగదీసుకున్నామన్నవారు, అరెస్టు చేసి జైలులో పెట్టకుండా రాజ ప్రముఖ్ పేరుతో అందలమెక్కించి తెలంగాణ ప్రజల నెత్తిన ఎక్కించారెందుకు? ప్రజలను విముక్తి చేయటమంటే నరహంతకులను శిక్షించటమా లేక ప్రజలనెత్తిన ఎక్కించటమా? అందుకే వీరనారి ఐలమ్మ వర్థంతి, సెప్టెంబర్ 10 నుంచి విలీనదినం 17 వరకు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలకు కమ్యూనిస్టులు పిలుపునివ్వటం సరైంది.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. వజ్రోత్సవాలకు పిలుపునిచ్చింది. జాతీయోద్యమ కాలంలోనే జాతీయ భావం రూపుదిద్దుకున్నది. వివిధ భాషలూ, సంస్కృతుల ప్రజలు తమను తాము భారతీయులుగా కూడా పిలుచుకున్నారు. జాతీయ సమైక్యతకు పునాదులు పడ్డాయి. అలాంటి జాతీయ స్రవంతిలో తెలంగాణ విలీనం సమైక్యతా చిహ్నమే కదా! ఇందుకు భిన్నంగా, నాటి పోరాటాన్ని మత ఘర్షణగా చిత్రీకరించి, నాటి ప్రత్యేకతను ముస్లింల నుండి హిందువుల విమోచనగా వక్రభాష్యం చెప్పటం విచ్ఛిన్నకర పోకడ! ఆ ప్రయత్నం చేస్తున్న బీజేపీ చర్యలు జాతీయ సమైక్యతకు హానికరం. అందువల్ల జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపటం కూడా సమంజమే. ఎంఐఎం వైఖరిలో కూడా మార్పు రావటం ఆహ్వానించదగిన పరిణామం. నాటి పోరాటం వలసవాదులకు, భూస్వాములకు, నిజాం రాజు నిరంకుశత్వానికీ వ్యతిరేకంగా సాగిన పోరాటమని ఎంఐఎం నాయకత్వం ప్రకటించింది. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని స్వాగతించింది. తిరంగ ఉత్సవాలు జరుపాలని పిలుపునిచ్చింది. ఈ వైఖరి నిలకడగా కొనసాగాలి. రజాకార్లు పాకిస్థాన్ వెళ్ళిపోయారనీ, భారతీయులు ఇక్కడ ఉన్నారనీ ఎంఐఎం అధ్యక్షుడు ప్రకటించారు. ఇది కూడా ఆహ్వానించదగిందే.
బీజేపీ మాత్రం ఓట్ల వేటలో చిచ్చుపెట్టేందుకే ప్రయత్నిస్తున్నది. తెలంగాణ రైతాంగం మీద నిర్బంధం ప్రయోగించి, దోపిడీ సాగించింది హిందూ భూస్వాములు. బానిస చాకిరీ చేయించుకున్న భూస్వాములూ హిందువులే. వీరికి అండగా నిలిచింది ముస్లిం రాజు. రజాకార్ల అండ చూసుకుని, భూస్వాములు కిరాతక దాడులు చేసారు. భూస్వాములూ, నిజాం రాజూ కలిసి రైతాంగం శ్రమ దోచుకోడానికి, చిత్రహింసలు పెట్టడానికీ, వారికి మతం అడ్డురాలేదు. ఈ దోపిడీకీ, పీడనకూ వ్యతిరేకంగా పోరాడటానికి కూడా ప్రజల మధ్య మతం అడ్డుగోడ కాలేదు. ఎందుకంటే... సమస్య మతం కాదు. వెట్టిచాకిరీ, భూస్వామ్య దోపిడీ, పీడనా, రాచరికపు నిరంకుశత్వమే సమస్య. వాటి మీదనే ప్రజల తిరుగుబాటు. ఇంతటి మహౌద్యమానికి మతం రంగు పులిమి లబ్దిపొందాలని బీజేపీ ఎత్తుగడ! షబానా అజ్మీ, నసీరుద్దీన్‌షా, జావెద్ అఖ్తర్ లాంటి దేశం గర్వించదగిన ముద్దుబిడ్డలను 'తుక్డే తుక్డే గ్యాంగ్' అని నిందించగల్గిన బీజేపీ నాయకుల నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం? ఇప్పుడు కదలవల్సింది ప్రజలే! రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందీ ప్రజలే!
- ఎస్. వీరయ్య