Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్లను ఉసిగొల్పుతున్న తీరు చూసిన వారికి, తెలంగాణ గవర్నర్ తమిళిసై బహిరంగ యుద్ధ ప్రకటన ఏమీ ఆశ్చర్యం కలిగించదు. ఈ విషయంలో బీజేపీ తీరు చాలా దారుణమనడానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలైన తమిళిసై నియామకమే నిదర్శనం. వచ్చిన నాటి నుంచి రాజ్‌భవన్ ఒక సమాంతర అధికార కేంద్రమన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వచ్చీరాగానే అధికారులను పిలిపించుకుని ఆదేశాలివ్వడానికి ప్రయత్నించారు. సహజ శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్లో ఆమె పట్ల చాలా గౌరవంగానే వ్యవహరిస్తూ వచ్చారు. వృత్తిరీత్యా వైద్యురాలు గనక ఆరోగ్యరంగంలో అదీ కరోనా కాలంలో సమీక్షలు జరిపి బహిరంగ వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. మీడియాతో తన వ్యక్తిత్వం, తన పద్ధతులు వీటి గురించి చాలాసార్లు చెబుతుండేవారు. మొదటి ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ వ్యాస రచయిత ఇతర రాష్ట్రాలలో బీజేపీ గవర్నర్లు సృష్టించిన వివాదాల గురించి చెబితే గవర్నర్‌గా నా పాత్ర కంటే ఎక్కువ చేయను తక్కువ చేయను అంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే ఆమెను పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా నియమించడం, అక్కడ ప్రభుత్వం కూల్చివేత తర్వాత బీజేపీతో కూడిన మిశ్రమ సర్కారును ప్రతిష్టించడం జరిగాయి. తెలంగాణ గవర్నర్‌గా ఉండి కూడా, తమిళనాడులో సమావేశాలు గోష్టులు నిర్వహించి తన రాజకీయ స్థానాన్ని పెంచుకోవడానికి తాపత్రయపడటం తెలిసిన విషయమే. ఈ అత్యుత్సాహ వైఖరిని ఉపయోగించుకుని బీజేపీయే గాక, కాంగ్రెస్ నాయకులు కూడా తరచూ రాష్ట్ర వ్యవహారాలలో ఆమె జోక్యాన్ని కోరడం పరిపాటి అయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్‌రెడ్డిని కేసీఆర్ శాసనమండలికి నామినేట్ చేయాలని ప్రతిపాదించారు. నిస్సందేహంగా ఇది రాజకీయ నిర్ణయమే. కాని ఇదే మొదటిసారి కాదు. తమిళిసై ఆ సిఫార్సుపై ఎటూ తేల్చకుండా చాలా సమయం తీసుకున్నారు. ఈలోగా మీడియాలో తన అనంగీకారం గురించి లీకులు ఇచ్చారు. తర్వాత తిరస్కరించారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ ఆమోదించవలసిందే గాని తిరస్కరించడం సాద్యం కాదు. మహా అయితే ఒకసారి పునఃపరిశీలనకు పంపొచ్చు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే తర్వాత కోర్టులో సవాలు చేయొచ్చు గాని, వీటో చేసే అధికారం గవర్నర్‌కు ఉండదు.
ఉప ఎన్నిక తర్వాత దాడి తీవ్రం
హుజూరాబాద్‌లో విజయం తర్వాత బీజేపీ దాడి పెరిగిన స్థాయిలోనే ఆమె కూడా దూరం పెంచుకుంటూవచ్చారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి వెళ్లకపోవడం ఇందులో మరో దశ. అయితే కొందరు మంత్రులు వెళ్లారు. ఈ సమయంలోనే సమ్మక్క సారక్క జాతరలో ఆమెను ఎవరూ స్వాగతించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దుమారం లేవదీయడంతో ఈ వివాదం కొత్తమలుపు తీసుకుంది. బడ్జెట్ సమావేశాల సంయుక్త సమావేశంలో ఆమె ప్రసంగం ఏర్పాటు చేయకపోవడం ఇందుకు పరాకాష్టగా మారింది. రాజ్యాంగం 175వ అధికరణం ప్రకారం ప్రతిఏటా తొలి సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే గతసారి సమావేశాలు ప్రొరోగ్ కాలేదు గనక ఇది కొనసాగింపేనని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ విషయం ఆమెకు చెప్పారు కూడా. దానికి అంగీకరించి ఆమె సభలు నిర్వహించడానికి, ఫైనాన్స్ బిల్లు సమర్పణకు అనుమతిస్తూ సంతకం చేశారు. కాని మరోవైపున బీజేపీ నాయకులు ఇది రాజ్యాంగ ఉల్లంఘన, అవమానం అంటూ గగ్గోలు మొదలు పెట్టారు. గవర్నర్ హాజరైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవాల్సిందే. (కేరళలో ఆరిఫ్‌ఖాన్ అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శలు మూటకట్టుకున్న ఉదంతం ఇక్కడ గుర్తుచేయాలి) టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాయితీ పాటించలేదన్నది నిజమైనా, నిబంధనల ప్రకారం వ్యవహరించినప్పుడు ఎవరైనా ఎలా తప్పు పడతారు? దీని కొనసాగింపుగా యాదాద్రి పర్యటన పెట్టుకున్నారు. ఆమెకు ప్రొటోకోల్ మర్యాదలు జరగలేదని మీడియా కథనాలు రాసింది. గంటముందే తమకు చెప్పడం వల్ల చేయలేకపోయామని, యాదాద్రి దేవస్థానం చైర్మన్ ఆమెను స్వాగతించారని సంబంధిత మంత్రి చెబుతున్నారు. ఇటీవల వరదల సమయంలోనూ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లలేదని బీజేపీ నేతలు విమర్శిస్తుంటే తను పర్యటన పెట్టుకున్నారు. ఆయన పర్యటనకు సమాంతరంగా వెళ్లి తన ప్రోటోకోల్ పాటించలేదని ఆరోపణలు చేశారు. నిజంగానే అధికారులు ఆమెను కలుసుకోలేదు. తాము సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నామని కారణం చెప్పారు. ఏదైనా ఇవన్నీ మర్యాదలకు సంబంధించిన విషయాలే గాని ప్రజలకు సంబంధించిన అంశాలు కాదు.
కేంద్రానికి మీడియాకు బహిరంగ ఫిర్యాదులు
గవర్నర్ ముందుగా ప్రకటించి మరీ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు తనను అవమానిస్తున్నట్టు ఫిర్యాదు చేయడం అసాధారణ పరిణామం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వివాదాస్పుదులైన రామ్‌లాల్, కుముద్‌బెన్ జోషీ వంటివారు కూడా ఈ విధంగా బహిరంగ ఫిర్యాదు చేసిన ఉదాహరణలు లేవు. పైగా ఢిల్లీ ఫిర్యాదు తర్వాత ఆమె తీరు గమనిస్తే ప్రభుత్వంతో ఘర్షణ పెంచుకోవాలనీ, దాడి పెంచాలని కేంద్రం ఆదేశించినట్టు స్పష్టమవుతుంది. ఢిల్లీలోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అస్త్రాలు సంధించారు. కౌశిక్‌రెడ్డి నియామకం తప్పన్నారు. వద్దనుకున్నా అది అంతర్గతంగా తెలియజేయవలసిన విషయమే గాని బహిరంగ వివాదం చేయాల్సిన పనిలేదు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు స్వప్నదాస్గుప్తా రాజీనామా చేసి బెంగాల్లో బీజేపీ తరపున శాసనసభకు పోటీచేశారు. ఓడిపోయాక ఆయనను మళ్లీ నామినేట్ చేశారు. అలాంటి పార్టీ ఇతరులకు నీతులు చెప్పడమా? తను ఎక్కడకైనా రోడ్డు మార్గంలోనో రైలులోనో వెళ్లవలసిందేనంటూ హెలికాఫ్టర్ లేదా విమానం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు. గతంలోనూ గవర్నర్లు అన్ని మార్గాలలో ప్రయాణించారు గాని ప్రభుత్వ హెలికాఫ్టర్ ఇచ్చి తీరాలని నిబంధనలేమీ లేవు.
ఒకవైపు తన తల్లి మరణిస్తే పరామర్శించలేదని చెప్పడం, కనీసం సోదరిగానైనా తన ఆహ్వానాన్ని మన్నించి ఉగాది వేడుకలకు రాలేదని సెంటిమెంటుతో మాట్లాడుతూనే మరోవైపు తను తల్చుకుంటే ఈ ప్రభుత్వం ఉండేదా అని ఆమె సవాలు చేయడం అన్నిటికన్నా తీవ్రమైన అంశం. తన ప్రసంగం లేకున్నా బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వడం గొప్ప ఔదార్యంగా ఆమె చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో గవర్నర్‌ది నామాకార్థపు పాత్ర తప్ప ప్రభుత్వ సిఫార్సును ఎలా తిరస్కరిస్తారు? రాజ్యాంగం ఆ అవకాశం ఇచ్చిందా? మహా అయితే పిలిచి మాట్లాడవచ్చు. తమిళిసై నేరుగా మీడియాకు ఈ విషయాలన్ని వెల్లడించిన తర్వాతనే అనుమతినిచ్చారు. అంతేగాని రాజ్యాంగ బద్దంగా అంతర్గత చర్చకు పరిమితం కాలేదు. బడ్జెట్ సమావేశాలకు అనుమతి నిరాకరించి, ఆరునెలలు వ్యవధి దాటేలా చేస్తే ప్రభుత్వం ఉండేదికాదన్న మాట బీజేపీ గవర్నర్ మనోగతాన్ని బహిర్గతపర్చింది. రాజ్‌భవన్‌లో దర్బార్లు జరిపి సమస్యలపై అక్కడికక్కడే ఉత్తర్వులిస్తానని చెప్పడం ఏ రాజ్యాంగ సూత్రం ప్రకారం చెల్లుతుంది? వివిధ విభాగాల సంస్థలను సందర్శించి విమర్శలకు బలం చేకూర్చడం ఆమె పని కాదు. క్రమంగా రాజ్‌భవన్‌లో ఎట్హొం వంటి లాంచన ప్రాయమైన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ వెళతారా లేదా అన్నది పెద్ద వార్తగా మారిపోయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భయాన్ ప్రమాణస్వీకారానికి హాజరైతే ఏదో దిగివచ్చినట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేశారు. దాంతో కేసీఆర్ ఈ సారి ఎట్‌హోంకు వెళ్లలేదు.
మూడేండ్ల వార్‌కు పరాకాష్ట
ఇక ఇప్పుడు మూడేండ్ల పదవీ కాలం ముగిశాక తమిళిసై మరింత సూటిగా తన అక్కసు వెళ్లగక్కారు. ఏ ప్రతిపక్షం కంటే తీవ్రమైన భాషలో దాడి చేశారు. మామూలు పౌరులకుండే హక్కులు కూడా ప్రథమ పౌరురాలినైన నాకు లేవా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఖచ్చితంగా కొన్ని పరిమితులు గవర్నర్‌కు ఉన్నాయి. వ్యక్తిగత హోదాలో చేయదల్చుకుంటే అప్పుడు ప్రభుత్వంపై ఫిర్యాదు అవసరమే ఉండదు. ప్రభుత్వం విఫలమైంది గనకే ప్రజలు సమస్యలతో తన దగ్గరకు వస్తున్నారని చెప్పడం రాజకీయ తిరుగుబాటు కాకమరేమవుతుంది? రాజ్‌భవన్ ఇటీవల కాలంలో బీజేపీ నేతలకు నిత్య సందర్శన కేంద్రంగా మారిపోయింది. వారు ఆమె తరపునే మాట్లాడుతున్నారు. మర్యాదల గురించి తెగ ఇదై పోతున్నారు. ఇదేకోవలో కొంతమంది మీడియా వ్యాఖ్యాతలు కూడా మర్యాదలు పాటించకపోవడాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఉనికినే ప్రశ్నించే ధోరణిని ఒకే గాట కట్టి మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆమెకు వంతపాడటం వింతగొల్పుతుంది. మిగతా తేడాలు ఎలా ఉన్నా సమాఖ్య పునాదులు కాపాడుకోవాలనే ఆలోచనైనా వారికి లేకపోవడం విచిత్రమే. తాము గౌరవం ఇస్తూనే ఉన్నామని గవర్నర్ ఏదో ఊహించుకుంటే ఏం చేయలేమని గతంలోనే కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇంకా సమాచార లోపాలు సమన్వయాలు ఉంటే సరిచేసుకోవచ్చు గాని ఆ పేరుతో అసలు ప్రభుత్వ మనుగడే తన దయాభిక్ష అన్నట్టు తమిళిసై మాట్లాడటం రాష్ట్ర ప్రజల రాజకీయ చైతన్యాన్ని పరిహసించడమే. కేరళ, తమిళనాడు, బెంగాల్ వంటి చోట్ల గవర్నర్ల నుంచి ఆమె స్ఫూర్తి పొందుతుండొచ్చు. మరీ ముఖ్యంగా బెంగాల్లో మమతా బెనర్జీ జగదీప్ ధంకర్ ఇద్దరూ పోట్లాడుకున్న తీరు దారుణంగా మారింది. ఆయనను అందుకు ప్రమోషన్‌గా ఉపరాష్ట్రపతిని చేశారు. బహుశా తమిళిసై కూడా మరింత పదోన్నతి ఆశిస్తున్నారేమో గాని తెలుగు ప్రజలకు ఇవన్నీ కొట్టిన పిండి. తెలంగాణ రాజకీయాలను పరోక్షంగా ప్రభావితం చేయాలనే దుర్నీతి చెల్లుబాటయ్యేది కాదు.
- తెలకపల్లి రవి