Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోయిన ఆదివారం సాయంకాలం ఒంగోలులో ఓ సాహిత్య సమావేశం చూసుకొని పరుగు పరుగున పదిగంటల బస్సెక్కాను. కండక్టరుకు సెల్లులోని టికెట్ చూపించి సీట్లో కూచొని ఇక హాయిగా పడుకోవచ్చునని అనుకున్నా. ముందు సీటులోని ప్రయాణికుడు సీరియస్సుగా ఏదో చూస్తున్నాడు. ఇంతలో అబ్బా అన్నాడు. ఏమైందబ్బా అని ముందుకు వంగి చూశాను, పాకిస్థాన్ బల్లేబాజ్ ఫోరు కొట్టాడు. ఇంకో యువకుడు బస్సెక్కి అటూ ఇటూ చూస్తున్నాడు, ఎవరి సెల్లులో మ్యాచ్ కనిపిస్తుందా అని... ముందు సీటతని సెల్లులో తానూ మొహం పెట్టాడు. ఒక్కో పరుగూ వాళ్ళు అంటే పాకిస్థాను టీము తీస్తుంటే కుర్రాడి మొహంలో రంగులు మారుతున్నాయి. ఆ మొహాన్ని చూసి చెప్పొచ్చు అక్కడ కొట్టింది ఒకటా, రెండా లేక నాలుగు పరుగులా అని. నేను ఆ కుర్రాడిని చూడడం, తానూ నన్ను చూడడం జరుగుతోంది. మ్యాచు మీద ఆసక్తే లేదు అసలు ఇతను భారతీయుడేనా, అయినచో దేశభక్తుడా దేశ ద్రోహా అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు. నేనూ అలాగే అనుకోవచ్చు కదా ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు ఇంట్లో అమ్మా నాన్న పెట్టింది తిని, ఓ జీన్స్ ప్యాంటు, ఓ టీ షర్టు వేసుకొని, చేతిలో ఓ యాండ్రాయిడ్ ఫోను పెట్టుకునే ఈ కుర్రాడు ఓ కుర్రాడేనా, మహా కవి శ్రీశ్రీ చెప్పినట్టు పేర్లకీ, పకీర్లకు, పుకార్లకీ తప్ప ఇతను దేనికీ పనికిరాడు అని. కాని అలా అనుకోలేదు. అతడలా ఎందుకు మారాడు, అతనొక్కడే కాదు కోట్లలో ఉన్న యువత ఇలా ఎందుకయ్యారు, అవుతున్నారు అన్నదే నా ఆలోచన.
మరుసటిరోజు పొద్దున్నే పాలు తేవడానికి పోతే అక్కడా ఇదే టాపిక్. అర్షదీప్ సింగు చాలా ఈజీ క్యాచు వదిలేశాడట. అందుకే మ్యాచు పోయిందట. ఏమంత కష్టమైన క్యాచ్ కానేకాదట. పేపరు వార్తల్లో తనని దేశద్రోహి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ''మనకు అలా కనిపిస్తుంది కాని అది ఈజీ క్యాచో కాదో బయటినుండి ఎలా తెలుస్తుంది'' అని అతనికి సపోర్టు చేస్తూ నాతో పాటు పాలు తీసుకుంటున్న ఇంకొక వ్యక్తి మాటలు. మొత్తం మీద దీన్ని మరచిపోవాలంటే అదే పాకిస్థానుపై మరో మ్యాచు గెలిస్తే కాని సరిపోదనీ, ఆ మచ్చ పోదనీ తెలుస్తూనే ఉంది. అది ఓ ఆట, గెలుపు ఓటమి సహజం అనుకుంటే ఇలాంటి అతి అభిమానం, అతి దేశ భక్తి అదుపులో ఉంటాయి. ఎల్ఐసీ లాంటి సంస్థల్ని ప్రయి వేటుపరం చేస్తున్నప్పుడు లేని దేశ భక్తి ఒక క్యాచ్ మిస్ చేస్తే వస్తుందా అని మనం ఒక ప్రశ్న వేస్తే వచ్చే సమాధా నాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
ఓసారి వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండు మధ్య అరవై ఓవర్ల మ్యాచు అదీ వరల్డు కప్పు మ్యాచు జరుగుతోంది. ఫైనల్ కూడా ఉండొచ్చు. కౌంటీ మ్యాచులు, ఐదురోజుల మ్యాచులు ఆడుతున్న రోజులవి. ఓ ఇంగ్లీషు బ్యాట్స్‌మన్ పరుగులు తక్కువ చేస్తూ బంతులు మింగేస్తున్నాడు. ఓ ఫోరు కొడదామని ప్రయత్నిస్తే అది కాస్తా వెస్ట్ ఇండీస్ కెప్టెన్ లాయిడ్ చేతిలో పడింది, చాలా సులభమైన క్యాచు, ఇక పెవిలియనుకు దారిపడదామను కున్నాడు. అనూహ్యంగా ఆ క్యాచును వదిలేశాడు లాయిడ్. నిర్ణీత అరవై ఓవర్లలో కొట్టవలసినన్ని పరుగులు కొట్టలేక ఇంగ్లాండు ఓడిపోయింది. ఆ క్యాచు పట్టి ఉంటే ఎక్కువ పరుగులు చక చకా చేసే ఇంకో బ్యాట్స్‌మన్ వచ్చేవాడేమో? మ్యాచు ఫలితం మరోలా ఉండేదేమో? అందుకే నాయకుడన్నవాడు వచ్చిన అన్ని క్యాచులూ పట్టడు. అవసరాన్ని చూసి పడతాడు.
అసలు క్రికెట్ అనగానే బెర్నార్డు షా అన్న మాటలు గుర్తుకు వస్తాయి. పదకొండు మంది మూర్ఖులు ఆడే ఆటని పదకొండు వేల మూర్ఖులు చూసేదే క్రికెట్ అన్నాడాయన. ఆయనతో ఏకీభవించినా లేకున్నా ఆ సంఖ్య కొన్ని వేల రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు దాని చుట్టూ వ్యాపారం, బెట్టింగులు, అధికారం, రాజకీయాలు అల్లుకు పోయినాయి. ఇప్పుడు మూర్ఖులు కాదు తెలివిమంతులు ఆ ఆటను నమ్ముకుని బతికిపోతున్నారు. రైతు పంట నీట మునిగే దృశ్యాలు, క్రికెట్ మైదానం తడవకుండా ప్లాస్టిక్ గుడ్డ జాగ్రత్తగా కప్పే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అన్నం పెట్టే రైతన్నకంటే కూల్ డ్రింకు ఇచ్చి చిప్సు, బిర్యానీ పెట్టే క్రికెట్ క్రీడ నేడు ముఖ్యమైపోయింది.
ఇక రాజకీయ క్యాచులూ ఉంటాయి. వాటిని ఒడిసి పట్టుకునే నేర్పు క్రికెటర్లకంటే ఎక్కువుండాలి. ఇక పెద్ద పార్టీ అయినా రాష్ట్రంలో చిన్న పార్టీ అంటే హాంకాంగు క్రికెట్ టీం లాంటిది ఉప ఎన్నికల్లో గెలిచినట్టు ఒక్కోసారి బాగా ఆడొచ్చు. అంతమాత్రం చేత అది ఫైనల్‌కు వెళ్ళినట్టు కాదు. మాటల యుద్ధంలో ముఖ్య మంత్రి, మంత్రులు పట్టుకునేలా క్యాచులు ఇస్తారు. చిన్నా చితకా క్యాచులు అన్నీ పట్టుకుంటూ కూచుంటే ఆట సాగదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే తమ క్యాచులు కూడా ఇవ్వకుండా చూసుకోవాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రజల్ని విడదీసేలా మాట్లాడేవాళ్ళ క్యాచు పట్టుకోవాలి. అదను చూసి క్యాచు పట్టేలా రెడీగా ఉండాలి. ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలి, చిక్కులు సృష్టించి తమ అధికార బంతిని గాల్లోకి కొట్టినప్పుడు నక్కలా పొంచి ఉండి ఎలా క్యాచు పట్టాలి అని చూసే వాళ్ళ గురించి జాగ్రత్త పడాలి. ఒక్కో ప్రభుత్వ రంగాన్ని సింపుల్ క్యాచులాగా అందరూ చూస్తుండగానే తమకు కావలసిన వారి చేతుల్లోకి క్యాచు రూపంలో బహుమతిగా ఇస్తూ బ్యాటింగు చేస్తున్న ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టేలా బంతులు విసరాలి.
ఇప్పుడంటే తటస్థ అంపైర్లు వచ్చారు కాని అంతకు ముందు ఏ దేశ అంపైర్లు ఆ దేశంలో మ్యాచులు జరిగేటప్పుడు ఉండేవాళ్ళు. ఒక్క ఇండియా, వెస్ట్ ఇండీసు, ఇంకొన్ని దేశాల అంపయిర్లు తప్ప తక్కిన వాళ్ళు తమ దేశ ఆటగాళ్ళకు, జట్లకు అనుకూలంగా నిర్ణయాలు చేసేవాళ్ళు. ప్యాడుకు బంతి తాకగానే ఎల్బీడబ్ల్యూ కోసం తమ బౌలర్ అరవగానే అంపైర్ చేయి గాల్లోకి లేచేది. బ్యాటుకు బాలు తాకినా తాకకున్నా క్యాచు పట్టి ఫీల్డర్ అరవగానే చేయి గాల్లోకి లేవడం చాలా మామూలు విషయం. ఆ కాలంలో బిషన్ సింఫ్‌ు బేడీ మన జట్టు నాయకుడుగా ఉన్నప్పుడు ఓ పాకిస్థాన్ నాయకుడు నాకు ఓ గవాస్కర్, ఓ కపిల్ దేవ్‌ను ఇస్తే ప్రపంచంలో ఏ జట్టుమీదనైనా గెలుస్తాను అన్నాడట. వెంటనే బేడీ నాకు జట్టులో సభ్యులెవరినైనా ఇవ్వండి ఇద్దరు పాకిస్థాను అంపైర్లనివ్వండి చాలు ఏ జట్టుమీదనైనా గెలుస్తాను అన్నాడట. అచ్చు అలాంటి అంపైర్లనే ఇప్పుడు రాజకీయాల్లో వాడుతున్నారు. ప్రభుత్వాలను పడగొట్టేపనిలో వాళ్ళను వాడుతున్నారు.
ప్రజలు అన్ని మ్యాచులనూ చూస్తున్నారు. అన్ని జట్లనూ చూస్తున్నారు. ఏ క్యాచు ఎప్పుడు పట్టాలో ఇప్పుడు వాళ్ళకు బాగా తెలిసింది. అదను చూసి అది ఎంత కష్టమైన క్యాచైనా ఇట్టే పట్టేస్తారు. ఒక్క క్యాచే కాదు స్టంపు చేస్తారు, వికెట్టుకు గురి చూసి బంతి వేస్తారు, లేదా రన్ అవుట్ గురి చూసి మరీ చేస్తారు. బంతి వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అన్ని రకాల మెళకువలు చూపిస్తారు. ఒకసారి మోసపోయినోళ్ళు కదా...
- జె. రఘుబాబు
సెల్:9849753298