Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా వాడి నవ్వులను ఎవరూ ఎత్తుకెళ్ల లేదు
మా వాళ్ళ మానాలను ఎవరూ చెరచలేదు
సారీ కంప్లైంట్ ఇవ్వలేను
మీరు మనుషులు కాదని తెలియక
మీ నీళ్ళ తావుకాడికొచ్చిన
మా బుజ్జిగాడిది తప్పే
మీ పులుల వేట ఇంకా ఆగలేదని
తెలియదు వాడికి
సారీ కంప్లైంట్ ఇవ్వలేను
మేక తోలు కప్పుకొని తిరుగుతున్న
తోడేళ్ళ మధ్య బతుకుతున్నామని
తెలుసుకోలేని మా వాళ్ళది తప్పే
చెరచినోల్లకి, చంపినోల్లకి
రామ రాజ్యంలో సన్మానాలు జరుగుతాయని
తెలియదు వాళ్ళకి
చెరచబడితే, చంపబడితే
అగ్గిల దూకి పరీక్షల నిలబడాలే కానీ
కోర్టు మెట్ల కాడ కాదని తెలుసుకోలేకపోవడం
మా వాళ్ళ తప్పే
శిక్షలేసుట్ల తేడాలుంటాయని తెలిపిన
మనువు వారసుల ఏలుబడిలో ఉన్నామని
తెలియదు వాళ్ళకి
సారీ కంప్లైంట్ ఇవ్వలేను
వాడి నవ్వులను వాడే దాసుకున్నాడు
వాళ్ళ మానాలనూ వాళ్ళే చెరుపుకున్నారు
వారికి వారే కాలి బూడిదై
రాతిరాకాశపు నలుపై మీ కుట్రలపై
నిత్యం నిరసనగా నిలపడి ఉన్నారు
సారీ కంప్లైంట్ ఇవ్వలేను
సారీ కంప్లైంట్ ఇవ్వలేను... ఇవ్వలేను
(ఇంద్ర కుమార్ మేఘవాల్,
బిల్కిస్ బానో సంఘటనలకు నిరసనగా....)
-వి.దిలీప్, సెల్:8464030808