Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రైతాంగ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నైజాం నిరంకుశ పాలనకు, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటం అది. ఈ పోరాట ప్రాముఖ్యత నేటి తరం తెలుసుకోకుండా పాలక పార్టీలన్నీ విమోచన నాటకాన్ని తెరమీదకు తెస్తున్నాయి.
నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరి చేస్తూ, దారుణ దోపిడీకి గురవుతున్న సమయంలో ఆంధ్రమహాసభ ఏర్పాటు జరిగింది. మొదట భాషోద్యమం కోసం సంఘం కృషి చేసింది. 1940లో మితవాద నాయకత్వం నుండి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టింది. వెట్టి చాకిరి రద్దు, కౌలు తగ్గింపు, దున్నే వానికే భూమిపై హక్కుల డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ప్రజల పెద్దఎత్తున సంఘటిత పడ్డారు. ''నీ బాంచన్ దొర'' అన్న పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ కలిగించిన చైతన్యంతో జమీందార్ల, దేశ్ ముఖ్ల, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించసాగారు. ఎట్టిచాకిరిని వ్యతిరేకించారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. జమీందార్ల, దేశ్ ముఖ్ల గుండెల్లో వణుకు పుట్టింది. ఆంధ్ర మహాసభ ప్రతిగ్రామానికి విస్తరించింది. సభలు సమావేశాలతో మారుమోగింది. జనగామ తాలూక కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ వినుసూరి రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్ ముఖ్, జమీందార్ల దాడులకు సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజా రజాకార్లు ప్రజలపై పాశివిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీన పర్చుకుని వేలాది గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్ ముఖ్లు, జాగీర్ధార్లు, పట్టణాలకు పారిపోయారు.
నిజాం నిరంకుశ ప్రభుత్వం రైతాంగ పోరాట ప్రాంతంలో ప్రతి నాలుగు మైల్లకు మిలటరీ క్యాంపు పెట్టి గ్రామాలపై దాడులు సాగించింది. తీవ్ర చిత్ర హింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పచ్చి బాలింతలను కూడా వదిలిపెట్టలేదు. ఇనుప పట్కార్లతో స్త్రీల రొమ్ముల పట్టి లాగటం, తల్లుల ఎదుటే పిల్లలను చంపటం జరిగింది. ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాట విస్తరణను నిజాం ప్రభుత్వం ఆపలేక పోయింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని అడ్డుకునే శక్తి నిజాం నిరంకుశ ప్రభుత్వ కోల్పోయింది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాంకే కాదు, నెహ్రు ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్ట్టించింది. దాని ప్రభావం దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించటం అత్యంత ప్రమాదకరని నెహ్రూ ప్రభుత్వం భావించింది. నైజాం ప్రభుత్వం రైతాంగ పోరాటాన్ని అణచలేదని గ్రహించి, ఆ బాధ్యత చేపట్టేందుకు నైజాం రాజ్యాన్ని 17.9.1950లో భారత యూనియన్‌లో కలిపి నైజాం నవాబును, జమీందారీ, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికి రైతాంగ ఉద్యమంపై సైనిక దాడి ప్రారంబించింది .పెద్ద ఎత్తున మిలటరీ దింపి రైతాంగ పోరాటంపై విరుచుకు పడింది. కాన్సెట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్ర హింసలకు గురి చేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నాలుగు వేల మంది కమ్యూనిస్టు ముద్దు బిడ్డలను, మరో రెండు వేల మంది ప్రజలను నెహ్రు ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. వేలాది మందిపై కేసులు బనాయించ బడ్డాయి. తెలంగాణ పోలీసు రాజ్రంగా మారింది.
నెహ్రు ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి, మూడువేల గ్రామ స్వరాజ్యాలను సాధించిన ఈ మహత్తర పోరాటాం 1951 అక్టోబర్ 31న విరమించబడింది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసిందీ కమ్యూనిస్టు పార్టీనే. అందువలన ఆ పోరాట వారసులు కమ్యూనిస్టులే. ఇప్పుడు విద్రోహ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వ్యతిరేక పార్టీ అయిన జీజేపీలు కూడా సెప్టెంబర్17ని విమోచన దినోత్సవంగా జరుపుతా మంటూ పోటీ పడుతున్నాయి. మోడీ ప్రభుత్వ ఆద్వర్యాన పెరేడ్ గ్రౌండ్లో విమోచన దినం నిర్వహిస్తామని ప్రకటించింది. జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేసీఅర్ ప్రభుత్వం ప్రకటించింది. నాటి సాయుధ పోరాటాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి పోటీ పడుతున్నాయి. దీన్ని దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గ్రహించాలి.
- బొల్లిముంత సాంబశివరావు,
సెల్: 9885983526