Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. మన రాజకీయ నాయకులేమో దాన్ని కొద్దిగా మార్చి మునుగోడులో ఓటు రాబట్టుకునేందుకు కాదేదీ అనర్హం... వచ్చిన ప్రతి అవకాశమూ గొప్పవరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలే వినాయక చవితి పండుగొచ్చే. పోరగాండ్లు ఎప్పటి లెక్క గల్లీల్లో ఆ ఇల్లు... ఈ ఇల్లు తిరిగినా చందాలు అంతంతే వసూలాయే. చెయ్యిపొంట తలా ఇంత ఏసుకుని ఏదో కానిచ్చేదమనుకున్నారు. కానీ, నడుమంత్రపు సిరిలెక్క ఈసారి అదృష్టం తన్నుకొచ్చింది. పదిరోజుల పాటు మునుగోడులో వినాయకుల చుట్టే నాయకులు రాజకీయం తిప్పేశారు. ఓటు పట్టాలంటే... యువతను దరిచేర్చుకోవాల్సిందే అన్నదాన్ని గ్రహించిన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విగ్రహాల చుట్టూ తిరిగేశారు. గతంలో ఇది చేస్తాం... అది చేస్తాం... అని హామీలిచ్చిన రాజగోపాల్రెడ్డి గవన్నీ పక్కనబెట్టేసి పోరగాల్లను వలలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడ్డడు. పోయినసారి పైసలకు భయపడి ఖర్చుపెట్టకపోయినా దగ్గరకొచ్చి ఓడిపోయిన ఈసారి ఎట్టాగైనా గెలవాలనే కసితో కూసుకుంట్ల కూడా గదే పోరగాండ్లను తన దిక్కు తిప్పుకునేందుకు ఊరూరా తిరిగాడు. తమ అనుచరులనూ పురమాయించారు. 'పక్కనోడు ఐదువేలిచ్చిండా? పదివేలిచ్చిండా? ఎంతిచ్చిండు? ముందే ఆరా తీశారు. ఆరకంగా వినాయకులను అడ్డుపెట్టుకుని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ ఒలకబోసి ఓట్లు పట్టాలనుకున్నారు. ఈ క్రమంలో అభివృద్ధి, ప్రజాసమస్యలు, హామీలు గీమీలు అన్నీ పక్కకపోయే. అంతా పైసామే పరమాత్మ.
- అచ్చిన ప్రశాంత్