Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు...' అంటూ ఓ ప్రఖ్యాత జ్యువెలరీ సంస్థ ప్రకటన ప్రతీ రోజూ టీవీల్లో వస్తుండటం పరిపాటిగా మారింది. ఆ యాడ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కొత్త బంగారు నగలు కొనేటప్పుడు తూకం, తరుగు, పాత వాటికి ధర చెల్లింపుల విషయంలో తమ సంస్థ ఎక్కడా రాజీపడబోదని చెప్పటానికి దాని యజమానే స్వయంగా రూపొందించి జనం మీదికి వదిలిన ప్రకటన అది. జనంలో ఆ ప్రకటన విస్తృత ప్రచారం పొందిన తర్వాత కుటుంబాలు, కార్యాలయాల్లోనూ డబ్బు గురించి మాట్లాడేటప్పుడు... 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు...' అని ఒకళ్ల మీద ఒకళ్లు సెటైర్లు వేసుకోవటం మామూలైపోయింది. కానీ దేశంలోని కొందరి విషయంలో మాత్రం ఈ యాడ్‌ను రివర్స్‌గా మార్చి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఘనత వహించిన మోడీ సర్కార్... వారికి అప్పనంగా ప్రజల సొమ్మును అప్పజెప్పుతున్నది కాబట్టి. రైల్వేలు, విమానాలు, ఓడ రేవులు, బ్యాంకులు, ఎల్ఐసీ, తపాలా... ఆఖరుకు సైన్యంలోని వివిధ విభాగాలను కూడా ప్రయివేటీకరిస్తున్నారు. తద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను బహు బాగా కాపాడుతున్నారు. అందుకే అంబానీ, ఆదానీ లాంటి మహానుభావుల దగ్గర... 'డబ్బులు ఊరికే రావు...' అంటే వారు మనల్ని చూసి ఫక్కున నవ్వుతారు. లేదు.. లేదు... 'మోడీ సర్కారు పుణ్యం వల్ల మాకు డబ్బులు ఊరికే ఉరికురికి వస్తున్నాయి...' అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు. అందుకే వారి దగ్గర ఈ ప్రకటన గురించి అస్సలు మాట్లాడొద్దు...
-బి.వి.యన్.పద్మరాజు