Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలీనం... విమోచనం... విద్రోహం!!
అన్నింటికీ... వజ్రోత్సవాలంటున్నారు!
ఈ దేశ దేహక్షేత్రంలో వేల నాగళ్ళు
దుఃఖవర్షంలో రాజధానిలో దుక్కి చేస్తున్నారు!!
ఈ ఏరువాక సాక్షిగా విప్లవ నారుమళ్ళేస్తున్నారు!
నిజాం పోలీసుల్ని... పటేల్ మిలట్రీని... దొరగుండాల్ని...
ఏక కాలంలో ఎదిరించి పోరాడిన విప్లవ పురిటిగడ్డ
వీర తెలంగాణ మాగాణంలో సామాన్యుడ సమాన్యుడై...
''దొరా! నీ కాల్మొక్కుతా!'' నీ బాంచన్ అన్న కంఠమే...
బందూక్ ఎత్తి! ''నీ గోరీ కడ్తాం కొడకో!'' అంటూ గర్జించింది!
పోరు శ్వాసతో గడీల్లో గడ్డి మొలిపించిన తెగువ
డభ్బై ఐదు వత్సరాల వజ్రోత్సవ వేళ... మారని ఎనభైశాతం బ్రతుకులు!!
పాలకులు మారినా... విధానాలవే...
ఆధిపత్య శక్తులు... ఆధిక్య పథ ఘట్టాలు...
అభివృద్ధి పంటకు కాషాయ తెగులు... మతం చీడ పీడలు...
కలుషిత రాజకీయ కళ్ళంలో కలుపు తీత తప్పదు!!
శ్రమజీవుల రక్తంతో సాగే సేద్యంలో... నాటే విత్తలోంచి...
మొలిచే కంకిలో పోరుఫలాలొస్తాయి...
విప్లవ రుతుగానం దేశం అంతా ధ్వనిస్తోంది!! రేపటి తరం
కార్పొరేట్ గద్దల్ని... చేను, మేని, తాకనివ్వదు
సామాన్యుడే సరికొత్త చరితకర్త అయ్యేచోట
విప్లవం ఓ నిత్య సహజాతం
(తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు సందర్భంగా...)
- తంగిరాల చక్రవర్తి,
సెల్: 9393804472