Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించే బిల్లులకు గవర్నర్ తన సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు సంబంధించి గవర్నర్ ఖాన్ మాట్లాడుతూ ఆ బిల్లును తాను అధ్యయనం చేయాల్సివుందని చెప్పారు. తమిళనాడులో, గవర్నర్ ఆర్.ఎన్.రవి కూడా విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు ఇంకా సమ్మతి తెలియచేయలేదు. అసెంబ్లీ ఆమోదించిన ఇతర అనేక బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదముద్ర ఇవ్వలేదు. ఇటువంటి బిల్లులకు గవర్నర్లు సమ్మతి తెలియచేయకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. రాష్ట్రాలు, వాటి ఎన్నికైన ప్రభుత్వాల హక్కులపై ఇది మరొక రూపంలో దాడి చేయడమే.
కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవలే, కేరళ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పదవి కోసం గవర్నర్ సెర్చ్ కమిటీని నియమించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ సెర్చ్ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండాలి. యూనివర్సిటీ నామినీ, ఛాన్సలర్ నామినీ, యుజిసి నామినీ... ఈ ముగ్గురితో కమిటీ ఉండాలి. కానీ, ఇక్కడ గవర్నర్ యూనివర్సిటీ నామినీ లేకుండా ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
అంతకు ముందు, అప్పాయింట్మెంట్ ఉత్తర్వులపై సంతకాలు పెట్టిన అనంతరం కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను తిరిగి నియమించడాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అంతకంటే అధ్వాన్నమైన అంశమేమంటే, ప్రముఖ చరిత్రకారుడైన వైస్ ఛాన్సలర్‌ను క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో కేరళలో కూడా అదే జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లు వైస్ ఛాన్సలర్ల నియామకంలో, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నిర్వహణలో దారుణంగా జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు తమకిష్టమైన వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా నియమించు కునేందుకు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు నిబంధనలను నిర్దేశించేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న నీచపుటెత్తుగడల్లో భాగమే ఇదంతా.
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్ తీసుకునే ఇటువంటి ఏకపక్ష చర్యలను నిరోధించేందుకు గానూ కేరళ అసెంబ్లీ గతవారం విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లును ఆమోదించింది. ఆ చట్టానికి చేసిన సవరణతో, వైస్ ఛాన్సలర్ పదవికి పేర్లు ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ సంఖ్య ప్రస్తుతం ఉన్న మూడు నుండి ఐదుకి పెరిగింది. ఆ కమిటీలో అదనంగా చేరే ఇద్దరు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు వరుసగా నామినేట్ చేస్తారు.
తమిళనాడులో, ఈ ఏడాది ఏప్రిల్‌లో డిఎంకె ప్రభుత్వం రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. వైస్ ఛాన్సలర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ 13 విశ్వవిద్యాలయాల చట్టాలను సవరిస్తూ ఈ బిల్లులను తీసుకు వచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కూడా ఈ ఏడాది జూన్‌లో పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయ చట్టాలను సవరించింది. అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా ఉండేలా సవరణ తీసుకువచ్చింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో బీజేపీ ఎంఎల్ఎలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ ఇక్కడ గుర్తించాల్సిన మరో అంశం ఏమంటే, గుజరాత్లో, సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన మూడు పేర్ల జాబితా నుండే వైస్ ఛాన్సలర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించేందుకు యూనివర్సిటీ చట్టం అవకాశం కల్పించింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉండాలనేది ప్రజాస్వామ్య నిబంధనగా ఉంది. వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాలను గవర్నర్లకు కల్పించరాదని, రాజ్యాంగంలో దీనికి అవకాశం కల్పించలేదని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ మదన్ మోహన్ పంఛి కమిషన్ సిఫార్సు చేసింది.
కాంగ్రెస్ పార్టీ దాని అలవాటు ప్రకారం కేరళ అసెంబ్లీలో సవరణ బిల్లును వ్యతిరేకించింది. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని రాష్ట్ర ప్రభుత్వం తుడిచిపెడుతోందని విమర్శించింది. అదే కాంగ్రెస్, తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం వైస్ఛాన్సలర్లను నియమించేందుకు అధికారాలను కల్పించే బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వంతో ఉన్న ఘర్షణల దృష్ట్యా కేరళలో కాంగ్రెస్, గవర్నర్ ద్వారా బీజేపీ ఎజెండాను అమలు చేసేందుకు సుముఖంగా ఉంది.
ప్రభుత్వ యూనివర్సిటీల నిర్వహణలో కల్పించుకోవడమే కాదు, కేంద్ర ప్రభుత్వం తరపు ఏజెంట్లుగా కూడా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనలో, గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్ర అసెంబ్లీల అభీష్టాన్ని దెబ్బ కొట్టే సాధనాలుగా మారుతున్నారు. ఈ ఏడాది కేరళ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉన్న సమయంలో విధాన ప్రసంగంపై సంతకం చేయడానికి కూడా గవర్నర్ తిరస్కరించారు. చిట్టచివరకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటలు ముందుగా సంతకాలు జరిగాయి.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించే బిల్లులకు గవర్నర్ తన సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు సంబంధించి గవర్నర్ ఖాన్ మాట్లాడుతూ... ఆ బిల్లును తాను అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. తమిళనాడులో, గవర్నర్ ఆర్.ఎన్.రవి కూడా విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు ఇంకా సమ్మతి తెలియచేయలేదు. అసెంబ్లీ ఆమోదించిన ఇతర అనేక బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదముద్ర ఇవ్వలేదు. ఇటువంటి బిల్లులకు గవర్నర్లు సమ్మతి తెలియచేయకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. రాష్ట్రాలు, వాటి ఎన్నికైన ప్రభుత్వాల హక్కులపై ఇది మరొక రూపంలో దాడి చేయడమే.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం