Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా ఆగస్టు 31న ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి సంబంధించిన జీడీజీ గణాంకాలను ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి శోచనీయంగా ఉందని ఆ వివరాలు చెప్పకనే చెప్తున్నాయి (ప్రస్తుతం ఈ గణాంకాలను రూపొందించడానికి 2011-12 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.). తాజా గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్-జూన్ నాటి జీడీపీ వృద్ధి రేటుతో పోల్చితే ఈ ఏడాది 13.5శాతం పెరిగిందని ప్రకటించారు. పైకి చూస్తే 13.5శాతం వృద్ధి అనగానే చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అధికార ప్రతినిధులు దాన్నే చూపించి తమ ముఖాలకు నవ్వు పులుముకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని, కాస్తంత లోతుగా గనుక పరిశీలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి మరింతగా దిగబడిపోతోందని వెల్లడి అవుతోంది.
2020-21లో కరోనా కారణంగా, మరీ ముఖ్యంగా అప్పుడు చాలా రాక్షసంగా అమలు చేసిన లాక్డౌన్ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారిపోయింది. ఆ మరుసటి ఏడాది, అంటే, 2021-22లో కొంత కోలుకున్నా, అప్పటి దిగజారుడు స్థితి నుండి పూర్తిగా బైటపడలేదు. 2022-23లో మొదటి మూడు మాసాల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే మనం కోవిడ్-19 ప్రభావం నుండి పూర్తిగా కాకపోయినా, దాదాపుగా అంతకు పూర్వం ఉండిన స్థితికి కోలుకున్నాం అని అవి సూచిసున్నాయి. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థకు నిలదొక్కుకోగలిగిన శక్తి స్వతహాగా ఉన్నట్టు అనుకోవచ్చు. అందుచేత 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని ''సాధారణ'' సంవత్సరంగా, అంటే, కోవిడ్ ప్రభావాన్ని అధిగమించిన సంవత్సరంగా పరిగణించవచ్చు. అందుచేత 2022-23 సంవత్సరపు పరిస్థితిని 2021-22తో, 2020-2021తో పోల్చకుండా సాధారణ స్థితి ఉండిన 2019-20తో పోల్చిచూడాలి.
2019-20లో మొదటి మూడు మాసాల జీడీపీ రూ.35.85 లక్షల కోట్లు ఉంది. 2022-23 మొదటి మూడు మాసాల జీడీపీ రూ.36.85 లక్షల కోట్లు ఉంది. అంటే ఆ ఏడాది కన్నా ఇది కేవలం 2.8శాతం మాత్రమే ఎక్కువ. ఇది మన ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కొనసాగుతోందని సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారి ఉధృతం దాదాపు తగ్గిపోయింది కనుక ఈ మాంద్యానికి కోవిడ్ కారణం అని ఇప్పుడు చెప్పలేం. కొంతమంది అధికార ప్రతినిధులు 2019-20 నాటి స్థితి కన్నా కొంచెమే అయినప్పటికీ, ముందుకే అడుగేశాం కదా అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాని ఈ మూడేండ్లలో పెరిగిన జనాభాను, పెరిగిన పెట్టుబడి నిల్వలను కూడా మనం గమనించాలి. అప్పుడు మనం సంబరపడ వలసినది ఏమీ లేదని, సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని బోధపడుతుంది. కోవిడ్-పూర్వ కాలానికి, కోవిడ్-అనంతర (సాధారణ) కాలానికి మధ్య తలసరి జీడీపీ పడిపోయింది. మరోపక్క తలసరి పెట్టుబడి నిల్వలు మాత్రం పెరిగాయి.
పైగా మనం ఇంకో వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 2019-20 ఆర్థిక సంవత్సరం గురించి మనం అంత గొప్పగా చెప్పుకోలేం. ఆ ముందటి ఏడాది మొదటి మూడు మాసాలతో పోల్చితే, 2019-20 మొదటి మూడు మాసాల్లో జీడీపీ కేవలం 5శాతమే వృద్ధి కనపరిచింది.ఆ ముందటి ఏడాదిలోనైతే ఈ వృద్థి 8శాతం ఉంది. అప్పుడు అధికారులు ఆ స్థితి పట్ల ఆందోళన కనపరిచారు. అంటే 2019-20 లోనే మాంద్యం పొడచూపడం మొదలైంది. అది కాస్తా కోవిడ్ వలన మరింత తీవ్రమైంది. అప్పటికే మాంద్యంలో దిగబడుతున్న ఆర్థిక వ్యవస్థ మీద కోవిడ్ అదనపు ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దాంతో అన్ని ఆర్థిక దుష్పరిణామాలకూ ఆ కోవిడ్ మహమ్మారే కారణం అన్న పొరపాటు అభిప్రాయం ఏర్పడడానికి దారి తీసింది. ఆ మహమ్మారే గనుక రాకుండా ఉంటే, మన ఆర్థిక వ్యవస్థకు ఏ ఢోకా లేదన్న భావాన్ని కలిగించడానికి అది అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆ మహమ్మారి ప్రభావం నుండి బైట పడ్డాం. మన ఆర్థిక వ్యవస్థలో ఏ ఇబ్బందీ లేకపోయి ఉంటే, మామూలు వృద్ధి రేటు (7-8 శాతం) వచ్చి ఉండాలి. కాని మనం మళ్ళీ 2019-20లో ఉండిన మాంద్యపు పరిస్థితిలోనే దిగబడిపోయి ఉన్నాం. ఇది చాలా ఆందోళనకరం. జీడీపీ వృద్ధి సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు (నయా ఉదారవాద విధానాలు మంచి ఊపుగా దేశంలో అమలు జరుగుతున్న కాలంలో కూడా) సైతం దాని వలన శ్రామిక ప్రజానీకానికి వొరిగింది ఏమీ లేకపోగా భారాలే వచ్చి పడ్డాయి. అటువంటప్పుడు మాంద్య పరిస్థితులు నెలకొంటే శ్రామిక ప్రజానీకం మీద ఇంకా ఎంత భారాలు పడతాయో ఊహించుకోవచ్చు.
శ్రామిక ప్రజానీకం కొనుగోలు శక్తిలో పెరుగుదల లేకపోవడం, ఉన్న కొనుగోలు శక్తి కూడా తగ్గిపోవడం ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి మూలకారణం. నయా ఉదారవాద విధానాలు ఆర్థిక అంతరాలను పెంచుతాయి. దాని ఫలితంగా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి దెబ్బ తింటుంది. 2022-23 మొదటి మూడు మాసాల కాలంలో వ్యక్తిగత వినిమయం జీడీపీ వృద్ధి రేటు కన్నా అధికంగా ఉంది. 2019-20 నాటి పరిస్థితితో పోల్చితే వినిమయం పెరిగినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? కరోనా కాలంలో శ్రామిక ప్రజానీకం చేతుల్లో డబ్బు లేక ఇబ్బందులు పడ్డారు. అదేకాలంలో ధనవంతులు స్థోమత ఉన్నా ఖర్చు చేసేందుకు అనుకూల పరిస్థితి లేనందువలన కొనుగోలు చేయలేదు. ఇప్పుడు అందుకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గత రెండేండ్లుగా బిగబట్టుకుని ఖర్చు చేయకుండా ఉన్న సంపన్న వర్గాలు ఇప్పుడు ఒక్కసారిగా ఖర్చు పెడుతున్నారు. సగటు వినిమయం అందువలన పెరిగిందే తప్ప శ్రామిక ప్రజానీకం కొనుగోలు శక్తిలో మెరుగుదల వచ్చినందువలన కాదు.
ప్రస్తుత మాంద్యానికి తక్షణ కారణాలు వేరే ఉన్నాయి. ఒకటి: ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల లేకపోవడం, రెండు: ఇతర దేశాలతో చేసే వాణిజ్యంలో దిగుమతులు ఎక్కువగా ఉండి, ఎగుమతులు వాటికన్నా తక్కువగా ఉండడం కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోవడం.
వ్యక్తిగత వినిమయం 2019-20 మొదటి మూడు మాసాల్లో (2011-12 నాటి విలువలు ప్రమాణంగా లెక్క వేస్తే) రూ.19.74 లక్షల కోట్లు ఉండగా అది 2022-23 నాటికి రూ.22.08 లక్షల కోట్లకు పెరిగింది. అదే కాలానికి స్థూల స్థిర పెట్టుబడి సమీకరణ చూస్తే, 2019-20లో రూ.11.66 లక్షల కోట్లు ఉండగా 2022-23లో రూ.12.78 లక్షల కోట్లు అయింది. అదే కాలానికి ప్రభుత్వ వ్యయం రూ.4.21 లక్షల కోట్లనుండి రూ. 4.14 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అదే కాలానికి వాణిజ్యలోటు రూ.1.62 లక్షల కోట్ల నుండి రూ.2.98 లక్షల కోట్లకు పెరిగింది. జీడీపీతో పోల్చుకుంటే వాణిజ్యలోటు 4శాతం నుండి 5.3శాతానికి పెరిగింది. ఈ వాణిజ్య లోటు గనుక పెరగకపోయివుంటే వృద్థిరేటు ఈ ఏడాది 2.8 కాకుండా 4.1గా ఉండేది.
అందుచేత ఈ రెండు తక్షణ కారణాలూ (ప్రభుత్వ వ్యయం తగ్గడం, వాణిజ్యలోటు పెరగడం) మన మాంద్యం తీవ్రం కావడానికి దోహదం చేశాయి. శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి పడిపోవడం అనే మూల కారణం ఉండనే వుంది. ప్రభుత్వ వ్యయం, ముఖ్యంగా సంక్షేమానికి చేసే ఖర్చు పడిపోవడం, దిగుమతులు పెరగడం అదనంగా తోడ్పడ్డాయి. దిగుమతులు ఎగుమతులకన్నా అధికంగా ఉండడం అంటే దాని సారాంశం మన దేశంలో చేయవలసిన ఖర్చు విదేశాల్లో చేసినట్టు. పొదుపు పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, ఇంకోపక్క దిగుమతులకు యధేచ్ఛగా అనుమతించడం ఈ పరిస్థితికిి కారణాలు. ఇది నయా ఉదారవాద విధానాల అమలు పర్యవసానమే. శ్రామిక ప్రజానీకపు కొనుగోలు శక్తి పడిపోవడానికి కూడా ఆ విధానాలే కారణం. ఆ విధానాలే ఆర్థిక మాంద్యానికి దారితీశాయి. రాబోయే కాలంలో ఈ మాంద్యం మరింత పెరిగిపోయే ప్రమాదమే పొంచివుంది. దానికి రెండు కారణాలు.
మొదటిది: జీడీపీ వృద్ధిరేటు కొనసాగించలేకపోతే అప్పుడు పెట్టుబడులు పెట్టడంలో వెనకడుగు పడుతుంది. 2019-20 నుండి 2022-23 మధ్య కాలంలో జీడీపీలో వృద్ధిరేటును నిలబెట్టలేకపోతున్నాం. అందుచేత 2019-20 నాటి పెట్టుబడులతో పొందిన ఉత్పాదక సామర్థ్యం ఇప్పటికీ అదే మాదిరిగా కొనసాగుతోంది. ఈ మూడేండ్లలో పాత యంత్రాల స్థానే కొత్త వాటిని తేవడానికి పెట్టిన పెట్టుబడి కొంత ఉంటుంది. దానివలన ఉత్పత్తి పెద్దగా పెరిగేది ఉండదు. ఆ తరహా పెట్టుబడిని పక్కన పెడితే, దానితోబాటు అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం మరికొంత అదనంగా కూడా పెట్టుబడి పెట్టి ఉండాలి. వినిమయం ఎప్పుడైతే పెరగలేదో, అప్పుడు ఈ అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. ఉపయోగంలోకి రాని అ అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువైపోతున్నకొద్దీ అదనపు పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది. దాంతో డిమాండ్లో రావలసిన పెరుగుదల రాకుండా పోతుంది అప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల రాదు.
రెండవది: వాణిజ్యలోటు పెరుగుతున్నప్పుడు ఈ దేశం నుండి ద్రవ్యం విదేశాలకు, ముఖ్యంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తరలిపోతుంది. ఆ దిగుమతులకు డాలర్లలో చెల్లించాలి. మనకు వచ్చే డాలర్లకన్నా మన వైపు నుండి పోయే డాలర్లు అధికం అయినందువలను విదేశీ చెల్లింపుల లోటు పెరుగుతుంది. దాని వలన డాలరుతో పోల్చితే రూపాయి విలువ తగ్గిపోతుంది. దీని వలన దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే అప్పుడు దానిని అదుపు చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని మరింత తగ్గించాల్సి వస్తుంది. వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఈ చర్యలన్నీ శ్రామికవర్గ ప్రజల కొనుగోలుశక్తిని మరింత కుంగదీస్తాయి. శ్రామిక ప్రజలను బలిపెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. విదేశీ చెల్లింపుల లోటు పెరుగుతోంది అనగానే రూపాయి విలువ మరింత పడిపోనుంది అని ఫైనాన్షియర్లు ముందస్తు అంచనాలు వేస్తారు. అప్పుడు తమ సంపదను రూపాయిల్లో కాక, ఇతర కరెన్సీలలో భద్రపరుచుకోడానికి చూస్తారు. దానివలన దేశం నుండి ద్రవ్యం విదేశాలకు తరలిపోతుంది. అప్పుడు వారి ముందస్తు అంచనాలు కాస్తా వారి తరలింపుల ఫలితంగానే వాస్తవరూపం దాలుస్తాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని దానితోబాటు మాంద్యాన్ని మరింత పెంచుతుంది.
ప్రస్తుత పరిస్థితులలో వాణిజ్యలోటు పెరిగిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం. కోవిడ్ కన్నా ముందే దేశంలో మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ద్రవ్యోల్బణం తోడైంది. ఈ పరిస్థితి అంతర్జాతీయంగా ఏర్పడింది. అయితే ఇప్పుడు పెరుగుతున్న వాణిజ్య లోటు దానికి అదనం. సంక్షోభపు ఊబిలో మన ఆర్థిక వ్యవస్థ మరింత లోతుగా కూరుకుపోనున్నది. నయా ఉదారవాద విధానాల చట్రం నుండి బైట పడకుండా ఈ సంక్షోభ పరిస్థితులను అధిగమించడం అసాధ్యం.
- ప్రభాత్ పట్నాయక్