Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రష్యా సైనిక చర్యలో కోల్పోయిన ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు, పుతిన్ సేనలను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. నిజమే, ఇదిగో చూడండి పారిపోతున్న రష్యా సేనలు అంటూ పశ్చిమ దేశాల టీవీలు కొన్ని దృశ్యాలను చూపటం, విశ్లేషణలు, వాటి ప్రాతిపదికగా అనేక దేశాల వారు స్పందించటం, వాటిని మన దేశంలోని మీడియా ఎప్పటికప్పుడు అందించటం చూస్తున్నాము. ఖారకైవ్ ప్రాంతం నుంచి తమ సేనలను వెనక్కు మళ్లించినట్లు మాస్కో అధికారులు ప్రకటించారు. నాలుగు నెలలుగా ఆక్రమించిన ప్రాంతాన్ని నాలుగు రోజుల్లో తిరిగి వెనక్కు తీసుకున్నట్లు జెలెనెస్కీ ప్రభుత్వం చెబుతున్నది.
మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఒక ఎత్తుగడగా మాస్కో సేనలు భారీ దాడులకు సిద్ధం కావటంలో భాగంగా వెనక్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అందువలన ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నదా? నాలుగు నెలలుగా సాధ్యం కానిది ఈనెల మొదటి వారంలో ఆకస్మికంగా నాలుగు రోజుల్లో రష్యా సేనలను తరిమికొట్టే శక్తిని జలెనెస్కీ ఎలా సంపాదించినట్లు? పశ్చిమ దేశాలు జనాల ప్రాణాలు తీసే లేదా ఆస్తులను విధ్వంసం చేసే అస్త్ర శస్త్రాలే కాదు, జనాల మెదళ్ల మీద దాడి చేసే ప్రచార ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి. ప్రాణాంతక అస్త్రాలను దాడులు జరిగే చోటనే ప్రయోగిస్తే ప్రచారదాడికి ఎల్లలు లేవు. తాజాగా ఉక్రెయిన్ ప్రతిఘటన అనేది ఒక ప్రచార ''విజయం''గా కొందరు వర్ణించారు. జరిగిన దాంట్లో తమ వైఫల్యాలు, ఉక్రెయిన్ సంక్షోభం, ఇతర కారణాలతో తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇంకొక్క ఊపు ఊపితే పుతిన్ పతనం ఖాయం అనే అభిప్రాయాన్ని, వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నది.
తాము జరుపుతున్నది దురాక్రమణ దాడి కాదని రష్యా చెబుతున్నది, కాదు అదేనని దాన్ని వ్యతిరేకించే దేశాలు వర్ణిస్తున్నాయి. ఏ కారణంతో పశ్చిమ దేశాలు చెప్పినప్పటికీ 1,27,484 చదరపు కిలోమీటర్ల మేర జెలెనెస్కీ సర్కార్ ఏలుబడిలో లేదు. దీనిలో మూడు వేల చదరపు కిలోమీటర్లు తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని పెద్ద విజయంగా చిత్రించుతున్నారు. ఒక పోరు జరుగుతున్నప్పుడు ఇలాంటివి సాధారణం. ఇదేమీ నిర్ణయాత్మక పరిణామం కాదు. దీంతోనే ముగిసేది లేదు. అందుకే దీన్ని ప్రచార ''విజయం'' అంటున్నారు. దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికన్లు అక్కడ సాధించిన విజయ గాధలను ప్రపంచానికి ఎలా వినిపించారో, తప్పుదారి పట్టించారో, చివరికి తాలిబాన్ల కాళ్లు పట్టుకొని ప్రాణాలతో స్వదేశానికి ఎలా పారిపోయారో తెలిసిందే. ఖార్కైవ్ ప్రాంతం నుంచి రష్యా సైనికులు టాంకులు, వాహనాలు, తుపాకులను ఎక్కడి వక్కడ వదిలేసి ఉక్రేనియన్లు దాచుకున్న సైకిళ్లను అపహరించి వాటి మీద పారిపోయారట. మరి జెలెనెస్కీ సేనలు వారిని ఎందుకు బందీలుగా చేయలేదు. ఎవడైనా పారిపోవటానికి ఉన్న వాహనాలను వదలి సైకిళ్లెందుకు ఎక్కుతారు?
మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకోవటం గొప్పే అనేవారిని కాసేపు సంతృప్తిపరుద్దాం. ఐరాస కాందిశీకుల సంస్థ వివరాల ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత మంది కాందిశీకులు ఏ సంక్షోభంలోనూ రాలేదు. ఆగస్టు 30 నాటికి 70లక్షల మంది కాందిశీకులు వివిధ దేశాల్లో ఉన్నారు. అత్యధికంగా 24లక్షల మంది రష్యాకే వెళ్లారు. డాన్బాస్ ప్రాంతంపై ఉక్రెయిన్ మిలిటరీ, నాజీ కిరాయి మూకలు జరిపిన దాడుల కారణంగా వారు వలస పోవాల్సి వచ్చింది. మిగిలిన వారు రష్యా మిలటిరీ దాడుల కారణంగా ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. వీరు గాక అంతర్గతంగా మరో 80లక్షల మంది తమ నెలవులు తప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు, వారికి ఎందరికి తిరిగి పూర్వపు జీవనాన్ని కల్పించారన్నది ముఖ్యం. ఆ వివరాలు మనకు ఎక్కడా కనపడవు, వినపడవు. తామే ఇంథన కొరతతో ఇబ్బందులు పడుతుంటే కాందిశీకులకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ అనేక దేశాల్లో గుసగుసలు.
ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఉక్రెయిన్ మిలిటరీ, ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా దాడులను జరుపుతున్నది. జన నష్టం జరగకుండా ఎంపిక చేసుకున్న వాటి మీదనే దాడులు చేస్తోంది. రెండు వైపులా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. చెబుతున్నది నమ్మదగినవిగా లేవు. దాడుల్లో జననష్టం జరిగితే దాన్ని చూపి రష్యాను మరింత ఒంటరి చేసి ఎండగట్టాలన్న అమెరికా ఎత్తుగడ పారలేదు. అదే విధంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున జెలెనెస్కీ సేనలకు ఆయుధాలు అందిస్తాయనే అంచనా ఉన్నప్పటికి ఆధునిక అస్త్రాలతో తమను ఎదుర్కొంటారని పుతిన్ ఊహించినట్లు కనపడదు. ఇలా ఊహించనివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంథనాన్ని ఆయుధంగా మలచాలని చూసిన అమెరికాకు అది ఎదురుతన్నటమే కాదు మాస్కోకు అదనపు రాబడి తెచ్చిపెడుతున్నది. ఇంథన సంక్షోభంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అది ఏ రూపంలో జనంలో ఆగ్రహం కలిగిస్తుందో చెప్పలేం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్య ముప్పు పొంచి ఉంది. మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోవాలని అమెరికా విసిరిన మతిమాలిన సవాలు దానికే ఎదురు తన్నింది. డాలరును పక్కన పెట్టి తమ కరెన్సీలతో లావాదేవీలు జరుపుకోవాలని మరింత గట్టిగా చెప్పేందుకు ఈ సంక్షోభం అవకాశం ఇచ్చింది. పెద్దన్న ప్రాభవం తగ్గుతున్నదని లోకానికి స్పష్టం చేసింది. చివరికి ప్రతిదానికి అమెరికా నేతలను కావలించుకున్న నరేంద్రమోడీ కూడా ఈ అంశంలో మాత్రం దూరంగా ఉన్నారు. గొంతు కలిపేందుకు వెనుకాడుతున్నారు.
రెండవ ప్రపంచయుద్దంలో జర్మనీ, జపాన్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సోవియట్‌తో భుజం కలిపి పోరాడిన అమెరికా, బ్రిటన్,ఫ్రాన్సులు తరువాత దాన్నే బూచిగా చూపి ప్రపంచానికే శత్రువులుగా రుజువైన జర్మనీ, జపాన్‌లను చంకనెత్తుకున్నాయి. అన్నింటికంటే విపరీతం ఏమంటే నాటో పేరుతో జర్మనీని, రక్షణ ఒప్పందం పేరుతో జపాన్ను కాపాడేందుకు పూనుకున్నాయి. అన్నీ కలసి ప్రపంచానికి ముప్పు తలపెట్టాయి. గతంలో ఐరోపాలో యుద్ధానికి జర్మనీ కారణమైతే ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా కారణమైంది. ఏదో ఒకదాన్ని బూచిగా చూపకపోతే తమ దుష్టపథకాలను జనం ప్రశ్నిస్తారు గనుక ఊహాజనిత బూచిని చూపుతున్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం రష్యాను, దానికి మద్దతు ఇస్తున్నదంటూ చైనాను బూచిగా చూపుతున్నారు. చివరికి స్విడ్జర్లాండ్, ఫిన్లాండ్ వంటి తటస్థ దేశాలను కూడా తమ కూటమిలోకి లాగాయి. లాటిన్ అమెరికాలో నియంతలను ప్రోత్సహించి ప్రజా ఉద్యమాలను అణచేందుకు పూనుకుంటే అక్కడా ఇప్పుడు ఎదురుతన్నుదోంది. వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ముందుకు వస్తుండగా మితవాద శక్తులను జనం ఛీకొడుతున్నారు.
అమెరికా డాలరు దెబ్బకు తమ కరెన్సీ యూరో, బ్రిటిష్ పౌండ్ కూడా విలవిల్లాడుతున్నాయి. వాటి పర్యవసానాలు ఇప్పుడే తెలియదు. ఇంథనాన్ని ఆయుధంగా మార్చాలని చూసిన అమెరికా ఎత్తుగడకు విరుగుడుగా దాన్నే తన అస్త్రంగా మార్చుకున్న రష్యా ప్రయోగానికి ఐరోపా గింగిరాలు తిరుగుతోంది. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సిద్దం సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. ఈ పథకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్థించే ఏ దేశానికీ తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్ పుతిన్ తెగేసి చెప్పాడు. ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్ స్రీమ్ ఒకటవ సహజవాయు సరఫరాను రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా ఇప్పుడు గుండెలు బాదుకుంటోంది.
ఆంక్షలు అమల్లోకి రాక ముందే రష్యా నుంచి అందినంత మేరకు ఇంథనాన్ని కొని నిలువ చేసుకోవాలని ఐరోపా దేశాలు చూశాయి. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు కోతలు, పరిశ్రమల మూతలు ప్రారంభించి పొదుపు మంత్రాన్ని జనాలకు ప్రవచిస్తున్నాయి. చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని తలలు పట్టుకుంటున్నాయి. సిగ్గువిడిచి రష్యాను అడగలేవు, జనానికి సంతృప్తి కలిగించలేని స్థితి. ఇంథన బ్లాక్మెయిల్, తమను చీల్చేందుకు కుట్ర అంటూ ఐరోపా సమాఖ్య మండిపడుతోంది. నీవు నేర్పినే విద్యే కదా అన్నట్లుగా పుతిన్ ఉన్నాడు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వద్దు అన్న జర్మనీ ఇప్పుడు తమకు అవే ముద్దు అన్నట్లుగా తిరిగి తెరుస్తున్నది. జర్మనీతో సహా అనేక దేశాల జనం పెరిగిన ఇంథన ధరలను తాము తట్టుకోలేమంటూ వీధులకు ఎక్కుతున్నారు. మన ఆర్బిఐ మాదిరే ఐరోపా బాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నది. 1970దశకం తరువాత ఇలాంటి తీవ్ర పరిస్థితిని ఐరోపా ఎన్నడూ ఎదుర్కోలేదు, ఈ స్థితి ఎంతకాలం ఉంటుందో అంతుబట్టటం లేదు. రెండు సంవత్సరాల పాటు సాధారణ జనానికి, ఆరునెలల పాటు వాణిజ్య సంస్థలకు విద్యుత్ చార్జీలను పెంచబోమని బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎల్ఎన్జి, ఇతర ఇంథనం అందుబాటులో ఉన్నా ఐరోపా దేశాలకు నిల్వచేసుకొనే ఏర్పాట్లు లేవు. ఇంతకాలం రష్యా నుంచి నిరంతర సరఫరా ఉండటంతో నిల్వ అవసరం లేకపోయింది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కుదిరేవి కాదు. జర్మనీలో రసాయనకర్మాగారాల మూత లేదా విద్యుత్ లేక కోతలుండటంతో చైనా ఉత్పత్తులకూ గిరాకీ పెరిగింది.
ఖారకైవ్ ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాం, మిగతా ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలు, డబ్బు ఇవ్వాలంటూ ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ కోరుతున్నాడు. ఇచ్చినడబ్బులో కొంత నొక్కేశాడని కూడా వార్తలు. మా సమస్యలు మాకుంటే ఇదేమి గొడవ అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. తాము ఇస్తున్న వాటిని పెంచే అవకాశం లేదని జర్మన్ రక్షణ మంత్రి క్రిస్టిని లాంబ్రెచెట్ అన్నారు. మా దగ్గర ఉన్న ఆయుధాలు నిండుకుంటున్నాయి, మా అవసరాలకే మేము కొనుక్కోవాలి అన్నారామె. మరొక ముఖ్య దేశమైన ఫ్రాన్స్ అంటీముట్టనట్లుగా నాకేంటి అన్నట్లుగా ఉంది. గొడవలెందుకు అన్న ధోరణితో ఫ్రాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మీరు తలచుకుంటే అందరికంటే ఎక్కువ సాయం చేయగలరంటూ జర్మనీని మునగ చెట్టు ఎక్కించేందుకు అమెరికా పూనుకుంది. మొత్తం మీద రానున్న కొద్ది రోజులు లేదా చలికాలంలో లేదా ముగిసిన తరువాత కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288