Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విసునూరి దేశ్‌ముఖ్ ఆధీనంలోని కామారెడ్డిగూడెంలో షేక్ బందగీ ఒక పేద ముస్లిం రైతు. అయిదుగురు అన్నదమ్ములు. పెద్దోడు అబ్బాస్ అలీ దేశ్‌ముఖ్ గడీలో పనిచేస్తాడు. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉమ్మడి భూమిని పంచుకున్నారు. పెద్దవాడని గౌరవించి అన్నకు జ్యేష్ట భాగంగా అదనంగా మూడు ఎకరాలు యిచ్చారు. మిగతా నలుగురు తక్కింది సమానంగా పంచుకున్నారు. తన భాగాన్ని అబ్బాస్ అలీ అమ్ముకున్నాడు. దేశ్ముఖ్తో మాట్లాడి, ఆయన అండతో తమ్ముల భూమిలో కొంత కొట్టేయాలని ప్లాన్ వేశాడు. దేశ్‌ముఖ్ అండనిచ్చి ప్రోత్సహించాడు. దాంతో తమ్ములతో నాకు మళ్ళీ జ్యేష్ట భాగాన్ని యివ్వాలని పేచీ పెట్టాడు. నలుగురు అన్న దమ్ములు బందగీతో సహా వ్యతిరేకిం చారు. భూమి నా పేరుతో ఉన్నది (పట్టా హక్కు) నేనే దున్ను కుంటానని అబ్బాస్ అలీ భూస్వామి ప్రోత్సాహంతో కోర్టుకెక్కాడు.
కోర్టులో కేసు మూడు సంవత్సరాలు నడిచింది. చివరికి కోర్టు తీర్పు బందగీకి, అతని తమ్ములకు అనుకూలంగా వచ్చింది. బందగీ ఈ పోరాటానికి స్వయంగా నాయకత్వం వహించి పోరాడాడు. అప్పటికి బందగీ వయస్సు 25సంవత్సరాలు. యువకుడు. ప్రజా బలం అండతో అన్న అబ్బాస్ అలీని, దేశ్‌ముఖ్‌ను ఓడించాడు. ఒక పేద ముస్లిం యువకుడు విసునూరు దేశ్‌ముఖ్ దౌర్జన్యపూరిత అధికారాన్ని మొట్ట మొదటిసారిగా దెబ్బతీశాడు. ఈ కేసులో అబ్బాస్ అలీ ఓటమిని తన ఓటమిగా దేశ్‌ముఖ్ భావించాడు. ఈ ప్రాంతంలో నేను దేశ్‌ముఖ్‌ను. నాదే సర్వాధికారం. ప్రజలందరూ నాకు తలవొగ్గి బతకాలి. ఎవరినీ తలపైకి ఎత్తనివ్వకూడదు. బందగీని ఎలాగైనా లొంగదీయాలి. వీనికి యింత పొగరా? నాపైన, నా మనిషిపైనే కోర్టులో గెలుస్తాడా? వీని అంతు చూస్తానని వెంటనే బందగీని గడీకి పిలిపించాడు. ''భూమిని వదులుకో, నా మనిషి అబ్బాస్ అలీకి వాటా పెట్టు. లేకుంటే ప్రాణాలతో మిగలవ్'' అన్నాడు. బందగీ యిలా అన్నాడు... ''దొరా నేను పేద ఫకీరు వాణ్ణి. నీవు అరవై గ్రామాలకు దొరవు. నీవు నీ సాటి దొరలను ఎదిరించాలి గానీ పూటకు గతిలేని పేదవాణ్ణి నన్నా? ఇది నీ చేతగానితనంకు నిదర్శనం తప్ప మరొకటి కాదు'' అన్నాడు.
ఫకీరు అహమ్మద్ బందగీ పెదనాన్న (తండ్రి అన్న). ఇతను కూడా దేశ్‌ముఖ్ గడీలోనే పనిచేస్తాడు. ఇతన్ని ఉపయోగించుకుని బందగీని లొంగదీసుకోవడానికి దేశ్‌ముఖ్ ప్లాన్ చేశాడు. ''బందగీ సోదరులు అనుభవించే భూమి అంతా మీ నాన్నదే. బందగీ తండ్రి ఏమీ సంపాదించలేదు. బందగీ సోదరులకు ఆ భూమిపైన ఎలాంటి హక్కులు లేవు. నీవు నీ భూమి కోసం పోరాడు. నేను అంతా చూసుకుంటా''నని అధికార్లను కట్టుకొని ఫకీర్ అహ్మద్‌తో బందగీ సోదరులపైన కేసు పెట్టించాడు. ఈ దెబ్బతో బందగీ లొంగి వస్తాడని, గ్రామం నుండి బందగీని వెళ్ళగొట్టాలని దేశ్‌ముఖ్ భావించాడు. బందగీ దేశ్‌ముఖ్ ప్లాన్ అర్థం చేసుకున్నాడు. అయినప్పటికీ లొంగలేదు. ఈ అబద్దపు, అక్రమ కేసును కూడా కోర్టులోనే ఎదుర్కొన్నాడు. కాలి నడకన పస్తులతో మైళ్ళ దూరం నడిచి, కోర్టుకు హాజరయ్యేవాడు. కామారెడ్డిగూడెం నుండి జనగామ కోర్టుకు 16 మైళ్ళు. వ్యయప్రయాసల కోర్చి కోర్టు చుట్టూ తిరిగాడు. బందగీ వంటరివాడు కాదు. దేశ్‌ముఖ్‌చే పీడించబడుతున్న ప్రజలందరూ వేల సంఖ్యలో బందగీ వెనకాల నిలబడ్డారు. భూస్వామి నుండి బందగీని కాపాడడానికి రాత్రింబవళ్ళు అండగా నిలబడ్డారు. అయినప్పటికీ కేసు నడుస్తున్న క్రమంలోనే బందగీపై ఒకసారి భూస్వామ్య గూండాలు హత్యా ప్రయత్నం చేశారు. కత్తితో దాడి చేశారు. బందగీ ప్రతిఘటించాడు. కత్తి గాట్లతో చేతివేళ్ళు తెగాయి. రక్తం వరదలై పారింది. కానీ బందగీ ప్రాణాన్ని దేశ్‌ముఖ్ తీయలేకపోయాడు. బందగీలో దేశ్‌ముఖ్ పట్ల మరింత కసి పెరిగింది. ప్రజలలో ఆగ్రహావేశాలు పెరిగాయి. బందగీ ప్రజలను ఎప్పటికప్పుడు ఇంటింటికి వెళ్ళి కలుసుకొని దేశ్‌ముఖ్ దుర్మార్గ చర్యలను వారికి వివరిస్తూ, చైతన్యపరుస్తూ ఉండేవాడు. దేశ్‌ముఖ్ దోసిళ్ళతో రూపాయలను కుమ్మరించి కేసు నడిపించాడు. కోర్టులో బందగీ ఒకవైపు, దేశ్‌ముఖ్‌లు, శ్రీమంతులు, దిట్టమైన పైరవీకార్లు మరోవైపున నిలబడి ఉండేవారు. కాని బందగీ ప్రజల అండతో, పట్టుదలతో కోర్టు చుట్టూ తిరిగాడు. ఈ భూపోరాటం కోర్టులో బందగీకి, భూస్వామికి మధ్య పన్నెండు సంవత్సరాలు జరిగింది. తన జీవనాధారమైన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలనే దేశ్‌ముఖ్ దురుద్ధేశాన్ని, దురాక్రమణను బందగీ దీక్షతో ప్రతిఘటించాడు. చివరికి బందగీ తన ఆశయాన్ని సాధించుకున్నాడు. పోరాటంలో రెండవసారి కూడా బందగీ, అతని సోదరులే గెలిచారు. కోర్టు తీర్పు బందగీకి అనుకూలంగా వచ్చింది. బందగీ యొక్క సాహసోపేతమైన ఈ పోరాట ఫలితం విసునూరు దేశ్‌ముఖ్‌చే పీడించబడుతున్న ప్రాంతంలో రైతు కూలీలపై పెద్ద ప్రభావాన్ని పడవేసింది. ప్రజలు ఉత్సాహంతో గంతులు వేశారు. సంతోషించారు. ప్రపంచంలో దేశ్‌ముఖ్‌ను మించిన శక్తి లేదనుకున్న ప్రజలు తాము సంఘటితమైతే ఏ శక్తీ తమను ఆపలేదని, ఏ పనైనా చేయగలమని మొదటిసారిగా తెలుసుకున్నారు. ఇది బందగీ సాధించిన బ్రహ్మాండమైన విజయం.
కోర్టు తీర్పుతో దేశ్‌ముఖ్ ఆలోచనలో పడ్డాడు. ఇక ప్రజలు తనను ఖాతరు చేయరని, బందగీని తమ నాయకుడిగా భావిస్తారని ఆగ్రహంతో ఊగిపోయాడు. బందగీని హత్య చేయాలనే దృఢ నిర్ణయానికి వచ్చాడు. కోర్టు తీర్పుతో బందగీ ఆ రాత్రి తన ఇంటివద్దనే పడుకొని, ఉదయం బస్సులో జనగామ కోర్టుకెళ్ళి జడ్జిమెంట్ (తీర్పు) కాగితాలను తెచ్చుకోవాలని అనుకున్నాడు. రాత్రి ఇంట్లో కుటుంబంతో హాయిగా గడిపాడు. తన ఆస్తి, సోదరుల ఆస్తిని కాపాడుకోగలిగానని, సంతోషంగా నిద్రపోయాడు.
ఉదయం జనగామ కోర్టుకు బయలుదేరాడు. ఊరి వెలుపలికి రాగానే బస్సు చప్పుడైంది. బస్సును అందుకోవాలని చకచక నడిచాడు. బస్సు పది గజాల దూరంలో ఉందనగా, కన్ను మూసి తెరిచేంతలోనే ప్రక్కనే ఉన్న కంచెలో నుంచి దేశ్‌ముఖ్ గూండాలు కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళతో బందగీపై పడ్డారు. బందగీని నరికివేశారు. తల శరీరం వేరైనవి. దుండగులు పారిపోయారు. బందగీ రక్తం ఆ ప్రాంతమంతా ప్రవహించింది. గ్రామ ప్రజలు వేల సంఖ్యలో వచ్చారు. కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? బందగీ గెలిచాడు, దేశ్‌ముఖ్ ఓడిపోయాడు. బందగీకి ప్రజలు బస్సు స్టేజి వద్దనే సమాధి కట్టారు. బందగీ హత్యతో దేశ్‌ముఖ్ పట్ల ప్రజలలో వర్గ కసి మరింత పెరిగింది. నైజాం రాచరిక వ్యవస్థకు, భూస్వామ్య, దొరల పెత్తనానికి తెలంగాణ గడ్డపైన పతనదశ ఊపందుకున్నది. ప్రజలు తమ ప్రియతమ నాయకుని సమాధి చుట్టూ చెట్లు పెంచారు. నివాళిగా అక్కడ ఉర్సు జాతర ప్రారంభించారు. నాటి నుండి ప్రతి యేటా హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా సమాన ఆదరాభిమానాలతో ఉర్సులో పాల్గొని, తమ ప్రియమైన నాయకునికి ప్రజలు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. అలా నేటికీ బందగీ మృత్యుంజయుడు. బందగీ దేశ్ముఖ్తో 1940-41లో పోరాటాన్ని కొనసాగించాడు. విసునూరు, పాలకుర్తి, జనగామ ప్రాంతంలో దేశ్‌ముఖ్‌ను, అతని దౌర్జన్యాన్ని ఎదిరించే చైతన్యాన్ని ప్రజలలో రగిలించాడు. ఈ పోరాట ఫలితంగానే ఆ ప్రాంత ప్రజలంతా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభలో చేరిపోరాడారు. బందగీ పేద ముస్లిం. అయినప్పటికీ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఆనాడు పీడించబడిన ప్రజలతో కలసి ముస్లిం నైజాం రాజుకు, హిందూ భూస్వాములు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాడాడు. బందగీ పోరాటం వర్గ ఐక్యతకు మార్గం చూపింది.
అందుకే ''బందగీ రక్తంబు చింది జ్వాలై లేచే! తెలుగు వీరా! లేచి రారా''... అంటూ ఆనాడు ప్రజానాట్యమండలి కళాకారులు మా భూమి నాటకంలో పాడిన గీతం నేటికీ మన చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఈనాటికీ ప్రజల్ని పోరాటాలకు పురికొల్పుతూనే ఉంటుంది.
- పి. సోమయ్య
సెల్:9490098043