Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి పెరుగుతున్నదని 'ఆహార, వ్యవసాయ సంస్థ' (ఎఫ్.ఎ.ఓ) సమర్పిం చిన తాజా నివేదిక తెలియచేస్తోంది. యునిసెఫ్, డబ్ల్యు.హెచ్.ఓ, డబ్ల్యు.ఎఫ్.పి, వ్యవసాయ అభివృద్ధి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ కలిసి ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఏ మేరకు ఉందో అంచనా వేస్తాయి. 'వివిధ దేశాల ఆహార భద్రత, పోషకాహారం-2022' నివేదికలో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన ఆహార అభద్రతతో అల్లాడుతున్న దేశాల పేర్లున్నాయి. కానీ అందులో భారతదేశం లేదు. ముఖ్యంగా 2014-2021 మధ్య కాలంలోని గణాంకాలను ప్రచురించడాన్ని మన ప్రభుత్వం అడ్డుకుంది. అయితే, భారతదేశంలో పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లేకపోవడం, ఆహారం వృధా కావడం, పసి పిల్లలు, పెద్దలు స్థూలకాయులవడం, మహిళల్లో రక్తహీనత వగైరాలకు సంబంధించిన గణాంకాలు ఎఫ్ఎఓ దగ్గర ఉన్నాయి.
ఆహార అభద్రత అంటే ప్రజలు తమకు ఆహారం అందుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో జీవించడం. అందువలన వారు తీసుకునే ఆహారంలో పోషకాహారం లోపించే అవకాశాలుంటాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, ఇరాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలు తమ గణాంకాలను సమర్పించాయి. భారతదేశం ఈ అంశాలకు సంబంధించి తన దగ్గరున్న గణాంకాలను అందించలేదంటున్నారు గణాంకాలను క్రోడీకరించే ఆర్థికవేత్త.
భారతదేశం తన గణాంకాలను సమర్పించకపోయినా, ఆహార వ్యవసాయ సంస్థ దగ్గరున్న గణాంకాల సాయంతో ఒక చిన్న మెళకువను ఉపయోగించి భారతదేశంలో ఉన్న ఆహార కొరతను అంచనా వేయవచ్చు. భారతదేశాన్ని మినహాయించి (200.7 మిలియన్ల)... మొత్తం దక్షిణ ఆసియాలో (764.3 మిలియన్లు) ఒక మోస్తరు నుంచి తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్టుగా నివేదికలోని గణాంకాలు తెలియచేస్తున్నాయి. అంటే భారతదేశంలో 563.6 మిలియన్ల ప్రజలు ఒక మోస్తరు నుంచి తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని అంచనాకు రావచ్చు. అంటే, 2019-2021 మధ్య కాలంలో 41 శాతం జనాభా ఆహార కొరతను ఎదుర్కొంటున్నా రన్న మాట. ఇందులో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న వారు 307.7 మిలియన్లు ఉంటా రని అంచనా. అంటే జనాభాలో 22.4శాతం అన్నమాట.
మొత్తం ఆసియాలో 2020లో ఆరోగ్యవంత మైన ఆహారం అందుబాటులోలేని వారి సంఖ్య 1891.4 మిలియన్లు. అందులో దక్షిణ ఆసియాలో సరైన ఆహారం సంపాదించుకోలేనివారు 973.3 మిలియన్లు. ఒక్క భారతదేశంలోనే 563.6 మిలియన్ల ఉన్నారంటే, మంచి పోషకాహారాన్ని పొందలేకపోతున్న వారిలో సగానికి సగం మంది మన దేశంలో ఉన్నారన్న మాట.
ప్రపంచ ఆకలి పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా 2021లో ఆర్థిక పురో గమనం, ఆదాయాలలో పెరుగుదల ఒకేరకంగా లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో ఉండాలంటే, పోషకాహార ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల ఆదాయాలకు అనుగుణంగా ఉండాలి. ఆకలిని అదుపు చేయడంలో, ఆహార భద్రత కల్పించడంలో, పోషకాహారాలు అందించడంలో ప్రపంచం వెనకడుగేస్తోందంటున్నాయి యునైటెడ్ నేషన్స్ సంస్థలు. ఈ సంక్షోభానికి కారణం-ఘర్షణలు, ఆర్థిక ఒడిదుడుకులు, పర్యావరణ సమతుల్యత లోపించడంతో పాటుగా పోషకాహార ధరలు పెరుగుతుండడం. అందువలన అనేక దేశాలు 2030 నాటికి ఆహారంలో స్థిరమైన అభివృద్ధి సాధించాలనే తమ లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుంది-అంటున్నాయి నివేదికలు.
ప్రపంచ ఆహార వ్యవస్థ ఎంత అసమానంగా, బలహీనంగా ఉందో కరోనా కారణంగా బయటపడింది. దీనికి ఉక్రెయిన్ యుద్ధం తోడయ్యింది. ఆహార సరఫరాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ధరలు అదుపుతప్పాయి. అయితే, ఈ పరిమితమైన వనరులను ఉపయోగించి కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో, వ్యవసాయాన్ని పునరుద్ధరించడంలో సమత్వాన్ని, స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదిక పప్పుధాన్యాలు, గింజలు, పళ్ళు, కూరగా యలు, ఇతర బలవర్ధక ఆహారాలకు బదులుగా ధాన్యం పండించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలియచేసింది. ధాన్యాల వినియోగం వలన తీసుకునే క్యాలరీలు పెరగవచ్చు గాని, సమతుల ఆహారం పొందే అవకాశం ఉండదు.
వివక్షకు గురవుతున్న మహిళలు, యువత, నైపుణ్యం లేని కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు కరోనా వలన మరింత ఎక్కువగా బాధపడ్డారు. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం 2020లో ఆదాయాలు పోగొట్టుకున్న 20శాతం పైతరగతుల వారు 2021లో తిరిగి సమకూర్చుకోగలిగారు. కానీ కింది 40శాతం మంది పోగొట్టుకున్న ఆదాయాలను తిరిగి పొందలేదు. గత 20ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచంలో అసమానతలు పెరిగాయి. ఈ కాలంలో 40శాతం ప్రభుత్వాలు సామాజిక రక్షణ చర్యలను ఒకే ఒక్కసారి చేపట్టి చేతులు దులుపుకున్నాయి. మూడు వంతుల సంక్షేమ పథకాలు మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం అమలయ్యాయి.
ఆరోగ్యకరమైన ఆహారం అవసరం
ఆకలి, ఆహార అభద్రత, పోషకాహార లోపం వంటి వాటిని అధిగమించే విధానాలు ఎంత మాత్రం అమలవడం లేదు. ప్రభుత్వాలు, సబ్సిడీ ధాన్యాలను ప్రజలకు అందుబాటులో తేగలుగు తున్నాయిగాని పళ్ళు, కూరగాయలు, వంటి పోషకాలు అందించే ఆహార పదార్థాలు అందించడం లేదు. అల్పాదాయ వర్గాలకు, వీటి ధరలు అందుబాటులో లేకపోవడం వలన వినియోగం సాధ్యపడడం లేదు. దాంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం పెద్ద సవాలుగా ఉంది. ఆహారం, వ్యవసాయ విధానాలకి ప్రభుత్వ మద్దతు ఏ మేరకు ఇవ్వాలో నిర్ణయిస్తున్నది మార్కెట్ ఒడిదుడుకులే గాని ప్రజలకు ఆరోగ్య వంతమైన ఆహారం అందించాలనే లక్ష్యం కాదు.
అందువలన 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. సామాజిక భద్రతా వలయం ప్రపంచవ్యాప్తంగా కుంచించుకు పోయింది. ఇప్పుడు ప్రపంచంలో 702-828 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇందులో అత్యధిక భాగం ఆఫ్రికాలో ఉన్నారన్న విషయం గమనించాలి. ఆఫ్రికాలో 26శాతం ప్రజలు ఆకలితో ఉండగా ఆసియాలో 9.1శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలలో 8.6శాతం, ఒసీనియాలో 5.8శాతం, ఉత్తర అమెరికా, యూరప్‌లో 2.5శాతం కంటే తక్కువ మంది ఆకలితో బాధపడుతున్నారు.
ప్రభుత్వాలు అనుసరించే ఆహార, వ్యవసాయ విధానాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ నివేదిక ప్రధానంగా పరిశీలించింది. నిజానికి, ప్రభుత్వాలు మద్దతిస్తున్న ఆహార వ్యవసాయ విధానాల వలన పోషకాహార ధరలు బాగా పెరుగుతున్నాయని, పోషక విలువలులేని అనారోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందుబాటు లోకి వస్తున్నదని ఆ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ విధానం ఎలా ఉండాలనేది సూచించింది. ఆహార-వ్యవసాయ విధానాలు సమర్ధవంతంగా, స్థిరంగా, సమానత్వం సాధించే దిశగా ఉండాలని... వాణిజ్య ప్రయోజనాలు తీర్చే విధంగా ఉండకూడదని సూచించింది. ప్రపంచ ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో ఎఫ్ఏఓ నివేదికకు ఎంతో ప్రాధాన్యత వుంది. భారత ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే, తన దగ్గరున్న గణాంకాలను ఎఫ్‌ఏఓతో పంచుకోడానికి నిరాకరించడం వల్ల ఆహార భద్రతకు ఎంత నష్టం కలుగుతుందనేది కూడా ఆలోచించాలి.
- టి.కె. రాజ్యలక్ష్మి
'ఫ్రంట్‌లైన్' సౌజన్యంతో