Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశంలో ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసు పరిశ్రమ రోజు రోజుకు విస్తరిస్తున్నది. సరుకుల ఉత్పత్తి రవాణా, రక్షణ, సర్వీసుల కోసం ప్రయివేటు సెక్యూరిటీ మీద ఆధారపడుతున్న స్థితిక్రమంగా పెరుగుతున్నది. బహుళజాతి, జాతీయ సంస్థలు సెక్యూరిటీ సేవల పేరిట ఈ రంగంలో ప్రవేశించాయి. లక్షలాదిగా నిరుద్యోగులను సెక్యూరిటీ గార్డ్డులుగా నియమించు కుంటున్నాయి. వారికి నామమాత్రపు వేతనాలను చెల్లిస్తూ ఏజెన్సీలు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుల భద్రతకు ప్రభుత్వాలు సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఔట్సోర్సింగ్ సేవల ద్వారా సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలలో, ప్రభుత్వ హాస్పటల్స్‌లో, యూనివర్సీటీలలో, బ్యాంకులు- ఎ.టి.ఎం.ల విస్తరణ, ఎయిర్‌పోర్టులు, మెట్రోరెళ్ళు ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్, వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ విద్యాలయాలు, హాస్పటల్స్, రెసిడెన్షియల్ ఏరియాలన్నింటి లోనూ నేడు ప్రయివేటుసెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమించబడిన వర్కర్లే పనిచేస్తున్నారు. నేడు దేశంలో సుమారు 22 వేలు ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల్లో సుమారు 80లక్షల మంది గార్డులు, రిటైర్డ్వర్కర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 4లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఈ సెక్యూరిటీ ఎజెన్సీల ద్వారా పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిలో వలస కార్మికులు గణనీయంగా ఉన్నారు. యూపీ, బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్నారు. అనేక ఉన్నత విద్యార్హతలున్నప్పటికీ, ఉద్యోగాలులేని స్థితిలో యువత ఈ సెక్యూరిటీ సర్వీసుల్లో అతి తక్కువ వేతనాలతో, ఎటువంటి సౌకర్యాలులేక సెక్యూరిటీ లేని స్థితిలో వీరు పనిచేస్తున్నారు.
ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల క్రింద పనిచేస్తున్న గార్డులు, ఇతర సిబ్బంది కోసం ప్రయివేటు సెక్యూరిటీ ఎజెన్సీ రెగ్యులేషన్ చట్టం 2005ని కేంద్రప్రభుత్వం తెచ్చింది. దీని ప్రకారం ప్రతిసెక్యూరిటీ ఏజెన్సీ లైసెన్సును పొంది మాత్రమే సర్వీసులు నడపాలి. ఆచరణలో చాలా సంస్థలు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే తమ బిజినెస్ కొనసాగిస్తున్నాయి. ఇందులో పనిచేస్తున్న కార్మికుల చేత రోజుకు 12గంటలు పనిచేస్తున్నారు. 8 గంటలు దాటి వీరు అదనంగా పనిచేయిస్తున్నా ఓటి చెల్లించడం లేదు. ఎలాంటి సెలవులు లేవు. కేంద్రచట్టం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కనీసవేతనం నిర్ణయించలేదు. రాష్ట్రంలో సెక్యూరిటీ సర్వీసెస్ షెడ్యూల్ ఎంప్లారుమెంట్లో ఉన్నా గత 10ఏండ్లుగా వీరి కనీస వేతనాలను ప్రభుత్వం సవరించలేదు. ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్‌లో పెట్టారు. లక్షలాది మంది సెక్యూరిటీ గార్డులు నష్టపోతున్నారు. సెక్యూరిటీ సంస్థలు కోట్లాది రూపాయల లబ్ధిపొందుతున్నాయి. పీఎఫ్, ఇఎస్ఐ, బోనస్, గ్రాట్యూటీ, ప్రసూతి ప్రయోజనం, యాన్యూటి, కార్మికులకు పరిహారం వంటి చట్టబద్ద సౌకర్యాలు సెక్యూరిటీ గార్డులకు అమలుకావటం లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయటంలేదు. విధి నిర్వహణలో సెక్యూరిటీ గార్డులపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. వీరి చేత పనిచేయించు కోవటమే తప్ప కనీసం పనిప్రదేశాల్లో మంచినీరు, టాయిలెట్స్, రక్షణ పరికరాలను యాజమాన్యాలు అందించడంలేదు, యూనిఫామ్స్, బూట్లు, వగైర ఖర్చులను వీరికి వచ్చే అరకొర వేతనాల నుండే భరించాలి. కనీసం గుర్తింపు కార్డులను కూడా కొన్ని సంస్థలు జారీ చేయకపోవడం వలన విధులు నిర్వహించి అర్థరాత్రి ఇళ్ళకు జేరుకునే సమయాలలో పోలీసుల వేధింపులు షరామామూలే. ఇచ్చే అరకొర వేతనాలు నెలనెలా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను వీరు ఎదుర్కొంటున్నారు. రోజుకు బ్యాంకుల ద్వారా రూ.15,000 కోట్ల నగదును వ్యాన్ల ద్వారా వీరి పర్యవేక్షణలో రవాణా చేస్తున్నారు. కానీ ఈ సెక్యూరిటీ సిబ్బందికి ఎలాంటి రక్షణలేదు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల చాలీచాలని వేతనాలతో, దుర్భరమైన జీవితాలు గడుపు తున్న సెక్యూరిటీ సంస్థల సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవ టంలేదు. ప్రయి వేటు సెక్యూరిటీ ఏజెన్సీలు మాత్రం లాభాలు కొల్లగొడు తున్నాయి. ప్రభుత్వాల నిర్వాకం వలన ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలపని నేడు మంచి లాభాదాయకమైన వ్యాపారంగా మారింది. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఎం.పి, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సెక్యూరిటీ గార్డులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఓరియన్, జైబాలాజీ, డీఏఎస్బీ, వారియర్, గ్లాడియెటర్, ఓపిడిఎస్, మాక్స్ సెక్యూరిటీ మొదలైన సంస్థల్లో పనిచేస్తున్న గార్డ్స్ సంఘటితమై సమస్యలను కొంత మేర పరిష్కారం చేసుకున్నారు.
ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల రెగ్యులరైజేషన్ చట్టం- 2005ను సక్రమంగా అమలు చేయాలని, సెక్యూరిటీగార్డ్స్కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 8 గంటల పనివిధానాన్ని అమలు చేయాలని, చట్టప్రకారం ఓవర్‌టైంకు డబుల్ పేమెంట్ ఇవ్వాలని, అపాయింట్మెంట్ ఆర్డర్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్, గ్రాట్యూటీ, బోనస్, ప్రమాదభీమా సౌకర్యాలు కల్పించాలని, పనిప్రదేశాలలో మంచినీరు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్, యూనిఫారమ్, టార్చిలైట్స్, రక్షణ పరికరాలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మిక చట్టాల సవరణ నిర్ణయాన్ని ఉపసంహ రించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు తమ జాతీయ సదస్సును ఆగస్టు 28న నిర్వహించు కున్నా రు. దేశవ్యాప్తంగా సంఘటి తమై తమ సమస్యలను పరిష్కరించు కోవటానికి సన్నద్ధమవుతున్నారు.
- ఎవి నాగేశ్వరరావు