Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశాన్ని రెండు వందల యేళ్ల పాటు బానిసత్వంలో ముంచిన బ్రిటిష్ వాడు అవలంబించిన ఎత్తుగడల్లో ఒకటి.. ''విభజించు - పాలించు''. దేశ ప్రజలని మతం పేరుతో విభజించి, వారి మధ్య మత విభేదాలు రెచ్చగొట్టి.. వాళ్ల సామ్రాజ్యవాద ఆకాంక్షలు నెరవేర్చుకున్నారు నాటి బ్రిటిషోళ్లు. నేడు అదే తరహాలో.. తమ స్వార్థ ఆకాంక్షలు నెరవేర్చు కోవడం కోసం ఈ దేశపు మనువాద - మతోన్మాద శక్తులు బ్రిటిష్ వాడి చెప్పుల్లో కాళ్ళు పెట్టి, అదే విభజించు-పాలించు నీతిని అమలు పరుస్తూ ప్రజల మధ్య మతోన్మాదాలు రెచ్చగొట్టి, వాటిని సోపానంగా మలుచుకుని అధికారం దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న ఆ దుష్ట శక్తులు తెలంగాణ చరిత్రకు సైతం మత వక్ర భాష్యాలద్ది తమ ఓట్ల సాధనకు ఉపకరించే రీతిలో మలచుకోవాలని శతధా ప్రయత్నిస్తున్నారు.
1940 దశకంలో ఒక మహౌజ్జ్వల చారిత్రక ఘట్టంగా తెలంగాణ గడ్డపై సాగిన పోరాటాన్ని... ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించే వక్రీకరణ నేడు జరుగుతున్నది. ఈ వక్రీకరణ యత్నాలకు పాల్పడుతున్న వారికి ఒక సూటి ప్రశ్న వేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు జరిగిన పోరాటానికి చరిత్ర ఇచ్చిన పేరుఏమిటి? ''తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం'' అనే పేరును చరిత్ర నిర్థారించింది. ఆ పోరాటం నడిపింది రైతన్నలయినప్పుడు... రైతాంగ సమస్యలయిన.. భూమి సమస్య, కూలీ సమస్య, శ్రమ దోపిడీ సమస్యలపై పోరాటం జరుగుతుంది తప్ప, వేరే అంశాల ప్రస్తావనే ఉండదు కదా! హైదరాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలని... భాషాపరమైన సమస్యలు, మతపరమైన సమస్యలు కదిలించిన మాట వాస్తవమే. అయితే వారంతా కలిసి చేసిందల్లా నిరసన తెలుపుతూ మహజర్లు సమర్పించడమే. గుత్పలు చేతబట్టి, దొరల గడీల మీద దాడులు చేసి, దొరల గుండాలను, రజాకార్లను తన్ని తరిమేసి, దొడ్డి కొమురయ్య అమరత్వంతో గుత్పలు వదిలేసి తుపాకులు అందుకుని తిరుగుబాటును నెరపిందీ, ప్రాణత్యాగాలకు సిద్ధమైందీ, సరికొత్త చరిత్రను లిఖించిందీ మాత్రం... రైతన్నలే. ఆ రైతన్నలను కదిలించింది రైతాంగ మౌలిక సమస్యలే తప్ప మతపరమైన అంశాలు కానేకాదు. ఈ విశాల దేశంలోని ఏ ప్రాంతపు రైతాంగాన్నీ, ఏనాడూ కలవర పెట్టని... మతపరమైన అంశాలని వీర తెలంగాణ పోరాటంలో చొప్పించాలని చూడడం దుస్సాహసమే అవుతుంది.
''బండెనుక బండిగట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లోపోతవ్ కొడుకో...'' అనే పాట వీర తెలంగాణ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. ఆ పాట రాసింది... నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలుకాలో.. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలోని దళం సభ్యుడైన నాగిళ్లి యాదగిరి. ఇక్కడ గుర్తించవలసిన విషయమేమిటంటే.. యాదగిరి ఆ పాట రాసింది నిజామోడీపైన కాదు. ఎల్కపల్లి గ్రామానికి చెందిన తననూ, తన గ్రామ ప్రజలనీ అరిగోసలు పెడుతున్న ఆ ప్రాంతపు దొర, ఎర్రబాడు భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి పైన ఆ పాట రాసిండు. ''బండెనుక బండిగట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లోపోతవ్ కొడుకో నా కొడుక ప్రతాప రెడ్డీ.,.'' అనేది ఒరిజినల్ పాట. చివరలో సైతం... ''గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడ్తం కొడుకో.. నా కొడక ప్రతాపరెడ్డి'' అని ముగుస్తుంది. నాటి రైతాంగ దళాలకు మార్చ్ ఫాస్ట్ సాంగ్గా మారిన ఈ పాట పోరాట యోధులకు సమరోత్సాహాన్ని అందించేది. కామ్రేడ్ యాదగిరి వీరమరణం తర్వాత... ఆ పాటలోని తీవ్రతను మరింత విస్తృతపరుస్తూ ప్రతాపరెడ్డి పేరుకు మారుగా 'నైజాం సర్కరోడా' అని మార్చుకుని తెలంగాణ బిడ్డలు పాడుకున్నారు. నాడు తెలంగాణ బిడ్డల ఉసురు తీసుకున్న అపవిత్ర కూటమిలో ఇటు కిందనున్న దొరలు, అటు పైనున్న నిజాం రాజూ భాగస్వాములే కాబట్టి... ఒకరి పేరు బదులు మరొకరి పేరు మార్చినా... ఆ పాట సారంలో, తెలంగాణ ప్రజల దృష్టి కోణంలోనూ మార్పేమీరాలేదు.
అయితే నేడు క్షుద్ర మత రాజకీయాలు నడుపుతున్న వారు ఒడిగడుతున్న తెలంగాణ చరిత్ర వక్రీకరణంలో భాగంగానే... ''భారతదేశంలో విలీనం కావడానికి ముందు తెలంగాణలో సాగింది ఇస్లామిక్ పాలనే. ఆ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగానే హిందువులు పోరాడారు'' అంటూ తప్పుగా మాట్లాడు తున్నారు. వీర తెలంగాణ యోధురాలు చిట్యాల ఐలమ్మ పొలాన్ని గుంజుకుని, ఆమె ఇద్దరు కొడుకులను జైలుపాలు చేసి, ఆమె ఇల్లు కూలగొట్టి, ఆమె బతుకును ఆగమాగం చేసిన ఆ ప్రాంతపు దొర విసునూరు రామచంద్రారెడ్డిది ఏ మతం? ఆ విసునూరు దొరోడు సాగించింది కూడా ఇస్లామిక్ పాలనే అంటారా? వీర తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను తుపాకీతో కాల్చి చంపిన కడివెండి దొరసాని జానమ్మ నడిపింది కూడా ఇస్లామిక్ పాలనేనా? తెలంగాణ గ్రామాల్లో ఏ ఆడబిడ్డ కంటికి నదురుగా కనపడ్డా.. ఆ రాత్రి దొర గడీలో, దొర చేతుల్లో నలిగి పోవాల్సిందే నన్నచరిత్ర వీరికి అసలు తెలుసా? ఆ బలిసిన దొరలు నడిపింది కూడా ఇస్లామిక్ పాలనేనా? తెలంగాణలో నాడు పైన ఇస్లాం మతావలంబీకుడు అయిన నిజామోడు కూర్చుంటే.. తెలంగాణ అంతటా అరాచక పాలన క్రింది స్థాయిలో ఉన్న హిందూ మతంలో కొనసాగిన దొరలూ దొరసానులు నడిపిండ్రన్న చరిత్ర తెల్వనోల్లు తెలంగాణ బిడ్డలెట్లా ఐతరు? ఆది హిందూ పాలనా కాదు, ఇస్లామిక్ పాలనా కాదు. నిఖార్సైన ఫ్యూడల్ అరాచక పాలన.
మనదేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర నిరూపించే వాస్తవమేమిటంటే... రాజులు ఏమతం వారైనా నిరంకుశులు, ప్రజా కంటకులే. స్వమతంలో తనకు వత్తాసుగా నిలిచే కొందరు కులీన, పురోహిత వర్గాల వారిని తప్ప మిగతా ప్రజలందరినీ రాచి రంపానపెట్టిన నికృష్ట చరిత్ర రాజులందరిదీ. మతపరమైన సెంటిమెంట్లు సామాన్య ప్రజలకేగాని, రాజులకూ, రాజులకు వత్తాసుగా నిలిచిన దొరలకూ ఏనాడూ లేవు. పైనున్న రాజుదీ, కిందున్న దొరలదీ ఒకటే దోపిడీ స్వభావం. తెలంగాణ ప్రజలను సంఘటిత పరిచి పోరుబాట పట్టించింది క్రింది స్థాయిలోనున్న దొరలు అమలు పరిచిన వెట్టి చాకిరి విధానమే. వెట్టికి వ్యతిరేకంగా మొదలైన పోరాటం... క్రమక్రమంగా కూలీ సమస్యలు, భూమి సమస్యలను పరిష్కరించే సాధనంగా మారి, ఆ క్రమంలోనే కిందున్న దొరలతో పాటు పైనున్న నిజాం ప్రభువును సైతం తెలంగాణ ప్రజలు ఎదిరించడానికి కారణమైంది.
నిజాం రాజు ఇత్తెహాదుల్ ముసల్మీన్ అండతో అనల్ మాలిక్ (నిజాం రాజ్యంలో ముస్లిం లందరూ రాజులే) తరహా నినాదాలతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. దొరలు సైతం ఆర్య సమాజ్తో మతాంతీకరణలు చేయిస్తూ మత రాజకీయాలు నెరిపారు. అయితే తమపైన జులుం చేయడానికి నిజాం ప్రభువుకైనా, దొరలకైనా మతం అడ్డు రాలేదన్న సత్యాన్ని తెలంగాణలోని ఇరు మతాల ప్రజలందరూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అందుకే చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డిలతో పాటు మఖ్దూమ్ మొహియుద్దీన్, షోయబుల్లా ఖానులు భుజం భుజం కలిపి పోరాడుతూ... మతోన్మాద రాజకీయాలని సమైక్యంగా ఓడించారు. మతోన్మాద రాజకీయాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ అసలు సమస్యలపై నికరంగా పోరాడడమే వీర తెలంగాణ చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలు విఫలం కాక తప్పదు!
- ఆర్. రాజేశమ్,
సెల్ 9440443183