Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటి చారిత్రక పోరాటం ఎవరిది? నేటి స్వార్థరాజకీయ ఆరాటం ఎవరిది? నాడు కొట్లాడింది ఎవరు? నేడు మాట్లాడుతున్నది ఎవరెవరు? ప్రస్తుతం ఈ సెప్టెంబర్ 17 చుట్టూ జరుగుతున్న చర్చోప చర్చలూ, మున్నెన్నడూ ఎరుగని వేడుకల హడావుడీ చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు. తెలంగాణ విమోచనం, విలీనం, విద్రోహం అంటూ రకరకాల వాదనలు ముందుకు తెస్తున్నారు. సర్దార్ పటేల్ ''సాహసోపేతమైన పట్టుదల'' గురించీ, నెహ్రూ సైన్యాల ''వీరోచిత చర్యల'' గురించి ఎవరికి కావాల్సినట్టుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. పాలక రాజకీయ పక్షాలన్నీ ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు వేడుకల విన్యాసాలలో తేలియాడుతున్నారు. కానీ, ఈ విన్యాసాల మాటున... తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడమే కాదు, ఇది ''కమ్యూనిస్టుల సారథ్యంలో సామాన్య తెలంగాణ ప్రజలు సాయుధులై సాగించిన విముక్తి పోరాటమ''న్న సత్యాన్ని అత్యంత చాకచక్యంగా విస్మరణకు గురిచేస్తున్న వైనం గర్హనీయం! విమోచన, విలీనాల పేర ఇప్పుడీ వేడుకల హడావుడి చేస్తున్న వారెవరూ ఈ పోరాటంలో ఒక్క నెత్తురు బొట్టు చిందించినవారూ, చుక్క చెమట రాల్చినవారూ కాకపోవడం వైచిత్రి!!
ముఖ్యంగా ''విమోచన'' పేరుతో కట్టుకథలల్లుతున్న వారి తీరుకు చరిత్ర ఫక్కున నవ్వుతున్నది. కుల మతాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజలు సాగించిన ఈ మహౌన్నత పోరాటానికి వీరు మతం రంగు పులుముతున్నారు. ఇది హిందూ ప్రజలకూ ముస్లిం రాజుకూ మధ్య యుద్ధంగా చిత్రిస్తూ చరిత్రకు వక్రభాష్యాలు చెపుతున్నారు. ఇందుకోసం ''ముస్లిం రాజు పాలన కింద ఉన్న హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం విమోచన కలిగించింది'' అన్న వాదనను ముందుకు తెస్తున్నారు. అంతటితో ఆగారా? లేదు... ''మా వైపు లేకపోతే వారివైపు ఉన్నట్లే''నని ప్రపంచాన్ని బెదిరించిన జార్జ్ బుష్ లాగా, ''విమోచనం అనకపోతే రజాకార్ల పక్షం వహించినట్లే''నని విభజన, విద్వేష భావజాలాన్ని రెచ్చగొడుతోందీ పరివారం. కానీ, వాస్తవం ఏమిటి?
అసలు హైదరాబాద్ సంస్థానం ముస్లిం పాలన కింద ఉండేదన్నదే అర్థసత్యం. పాలకుడు ముస్లిం కావొచ్చు... పాలకుల మతం ఇస్లాం కావొచ్చు... రాజు పరమ నిరంకుశుడనడంలోనూ సందేహం లేదు. కానీ ఆ రాజు ఆధారపడి పాలన సాగించింది హిందూ భూస్వాములు, దేశ్ముఖ్లు, జాగీర్థార్ల మీదేనన్నది కూడా అంతే నిజం. ప్రజలు ప్రత్యక్షంగా విపరీతమైన దోపిడీకి, పీడనకు గురయింది వీరి చేతుల్లోనే. వీరికి అండ నిజాం రాజు. చివరికి అత్యంత క్రూరులూ మతోన్మాదులుగా పేరుపడ్డ రజాకార్ మూకలన్నిటికీ ఈ దొరల గడీలలోనే విడిది. అక్కడే తిని, తాగి ప్రజలమీద, పోరాడే వీరుల మీద ఈ కసాయి మూకలు కిరాతక దాడులు చేసేవి అన్న సంగతి మరువగలమా? రజాకార్ల సైన్యాధ్యక్షుడు కాసీం రజ్వీ ముస్లిం అయితే, ఉపాధ్యక్షుడైన విసునూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఎవరు? హిందువు కాదా? అతని దాష్టీకానికి బలైన బందగీ ఎవరు? ముస్లిం కాదా? లక్షల ఎకరాలకు అధిపతిగా జనాల మూల్గులు పీల్చిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎవరు? పసిబిడ్డల తల్లుల్ని మోదుగు డొప్పల్లో పాలుపిండించి పరీక్షించిన పసునూరి రామ్మోహన్రావు ఎవరు? నీర్మాల నియంత లింగాల నర్సింహారెడ్డి ఎవరు? కోడూరి కర్కోటకుడు గడ్డెం నర్సింహారెడ్డి ఎవరు? వీరి అమానుషాలను ఎండగట్టిన షోయబుల్లాఖాన్ ఎవరు? వీరి దురాగతాలను ప్రతిఘటించిన మఖ్ధూం మొహియుద్ధీన్ ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా అనేక ఉదాహరణలు... వీటిలో ''పీడకులు - పీడితులు'' అన్న విభజనకు తప్ప ''హిందువులు - ముస్లింలు'' అనే విభజనకు అస్కారముందా? అందువల్ల దీనిని ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలకు లభించిన విమోచనగా చిత్రించడం కేవలం ఓ కుట్ర.
పోనీ, వీరంటున్నట్టు 1948 సెప్టెంబర్ 17న జరిగింది విమోచనే అయితే, 1950 జనవరి 26 దాకా హైదరాబాద్ రాజ్యపాలన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే ఎందుకు సాగినట్టు? ఆ తరువాత 1956 దాకా ఆయన రాజప్రముఖ్ (గవర్నర్)గా ఎలా కొనసాగినట్టు? జరిగింది ప్రజల విమోచనే అయితే, దుర్మార్గమైన ఫ్యూడల్ నిరంకుశ పాలన సాగించి, ప్రజల రక్తమాంసాలు పిండి పన్నులు వసూలుచేసి, ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా చలామణీ అయిన నిజాం ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా రాజాభరణం పేరుతో ఎదురు పరిహారాలు ఎందుకు చెల్లించినట్టు? ఈ ప్రశ్నలకు ''పరివారం'' జవాబు చెప్పగలదా? పైగా నిజాం ఆస్తులతో పాటు వాటిపై అధికారాలనూ యధాతథంగా ఉంచింది నెహ్రూ ప్రభుత్వం. మరి దీనిని విమోచన అనగలమా? అదే నిజమైతే ఆ తరువాత కూడా ప్రజలు సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించినట్టూ? ఎందుకంటే ఆ రోజుతో ఏదో మార్పు వచ్చినట్టు ప్రజలు భావించలేదు గనుక. అదే సమయంలో 1948 సెప్టెంబర్ 17న విమోచన పూర్తయితే 1951 దాకా పటేల్ పటాలాలు తెలంగాణను ఎందుకు వీడలేదు? ఎందుకంటే అవి వచ్చింది నిజాం రాజు కోసం కాదు గనుక. వాటి ''ఆపరేషన్ పోలో'' అసలు లక్ష్యం కమ్యూనిస్టులే గనుక. నిజాం పోలీసులు, రజాకారు మూకలకంటే, తెలంగాణ ప్రజలపై, కమ్యూనిస్టులపై నెహ్రూ సైన్యాల హత్యలూ అకృత్యాలే ఎక్కువ. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? కాషాయ పరివారం చెపుతున్నట్టు ఇది విమోచనే అయితే ఎవరి నుండి ఎవరికి విమోచన? ఈ చారిత్రక వాస్తవాలన్నీ విస్మరించి, వక్రీకరించి ''విమోచనగానాలాపన'' చేయడంలో ఈ పరివారానికి కొన్ని నిర్ధిష్టమైన ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలియనిది కాదు. మత విద్వేషాలను రగిలించి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు వీరు ఎంతటి వక్రీకరణలకైనా దిగజారు తారనడానికి ఇంతకు మించిన ఉదాహరణే ముంటుంది? కానీ చరిత్రకు మసిపూసి సత్యాన్ని దాచి పెట్టగలరా?
ఇక ఖద్దరు బృందానిది మరో ప్రహసనం. తన సైనిక చర్య ద్వారా నిజాంను లొంగదీసుకుని, హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నది వీరి వాదన. ఈ వాదన ద్వారా ఈ ''ఘనత''ను తమ ఖాతాలో వేసుకోవాలన్నది వీరి తాపత్రయం. అదే నిజమైతే నాటి నిజాం రాజుతో సంధి చేసుకుని, హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ''యథాతథ ఒప్పందం''పై ఎందుకు సంతకం చేసినట్టో వీరు సమాధానం చెప్పాలి. అంతకుముందే సంస్థానాలలో పోరాటం మన లక్ష్యం కాదనీ, బ్రిటిష్ ఇండియా పరిధిలోనే ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి సమీకరించాలనీ తీసుకున్న విధానం వెనుక ఉద్దేశ్యం ఏమిటో కూడా వీరు చెప్పాలి. అంతే కాదు, కమ్యూనిస్టులు విలీనాన్ని స్వాగతించినప్పటికీ, ఆ తరువాత వారిపై క్రూరమైన అణచివేతకు ఎందుకు పాల్పడ్డారో కూడా చెప్పాలి. నిజానికి నెహ్రూ సైన్యాలకు రోజుల వ్యవధిలోనే నిజాం లొంగిపోయాడు కదా? కానీ ఆపైన 1951 దాకా మూడేండ్ల పాటు అవి తెలంగాణలో చేసిన యుద్ధం ఎవరి మీద? కమ్యూనిస్టుల మీద, తెలంగాణ ప్రజల మీదనే కదా! ఇక్కడ గమనించవలసిన అసలు విషయం ఏమిటంటే... తెలంగాణ సాయుధ పోరాటం ముందు నిజాం తలవంచక తప్పదనీ, ఆ ప్రజా యుద్ధం ధాటికి నిరంకుశ ఫ్యూడల్ పాలన కూలిపోవడం తథ్యమనీ తేలిపోయాకే భారత యూనియన్ సైన్యాలు రంగప్రవేశం చేసాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు గెలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల చేతిలోకి వెళుతుందనీ, అది రేపు తమ ఢిల్లీ కోటను కూడా ముట్టడిస్తుందనే భయం వారిది.
వాస్తవాలు ఇలా ఉండగా, ఇందుకు విరుద్ధంగా వస్తున్న వాదనలన్నీ ఆ చరిత్రను వక్రీకరించి, ఆ పోరాట స్ఫూర్తిని నిర్వీర్యం చేసే కుతంత్రాలు. విశాల ప్రజామోదమున్న ఒక చారిత్రక సందర్భాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు కాషాయ పరివారాలు, ఖద్దరు బృందాలు చేసే కుట్రలు. నిజం చెప్పాలంటే ఇది ఒక రకంగా యూనియన్ సైన్యాలు తెలంగాణ ప్రజల నుండి నిజాం రాజుకు కల్పించిన విమోచన. గడీలను గడగడలాడించి జనాన్ని జెండాలుగా ఎగరేసిన కమ్యూనిస్టు ఉద్యమ ప్రకంపనలు హస్తినదాకా చేరకుండా నెహ్రూ ప్రభుత్వం తనకు తాను కల్పించుకున్న విమోచన. కనుక, ఈ చరిత్రకవాస్తవాలతో గానీ, జరిగిన చరిత్రతో గానీ ఎ సంబంధమూ లేని శక్తుల వక్రీకరణల వెనుక ప్రజలను నిట్టనిలువునా చీల్చే పన్నాగాలున్నాయని గమనించాలి. వాటిని నేడు ఛేదించగలిగితే, నిన్నటి ఈ చారిత్రక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే నేటి విప్లవ సందేశమై వినిపిస్తుంది.
- రాంపల్లి రమేష్