Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుడమి పులకించింది...
మట్టిరేణువులు పెలపెలమన్నాయి.
సముద్రపు అగ్నిధారలు, పిడుగుల వర్షమై
దిక్కులు పిక్కటిల్లాయి...
మట్టి పెల్లల నుండి ఎగసి పడ్డవిత్తులు,
ఎర్ర పరిమళాలుగా పరిఢవిల్లాయి..!
భూమికోసం, భుక్తి కోసం...
పీడిత ప్రజల విముక్తి కోసం
తెలంగాణ మాగాణల్లో,
నాగేటి సాలల్లో విరబూసిన
గడ్డిపోచలు ఏకమై
చురకత్తుల్లా విచ్చుకుని..
నిజాం కుత్తుకలో గుచ్చుకున్నాయి..!!!
డొక్కలెండిన ఎట్టిబతుకులు
నీ బాంచన్ దొర కాల్మొక్తనన్న దీనులు..
ఎట్టి పీడన విముక్తి కోసం
రగల్జెండాలయ్యాయి.
రగిలిన విప్లవాగ్నియై...
మరతుపాకులతో గర్జించి, గాండ్రీంచి...
దొరల గడీలపాలనకు పాతరేసిన
వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం..!!!!
నాలుగు వేలమంది వీరులు రక్తతర్పణం,
పదిలక్షల ఎకరాలభూమిని జనానికి పంచిన సమరత్వం...
చాకలి ఐలమ్మ ధీరత్వం,
దొడ్డి కొమరయ్య వీరత్వం..
బండియాదగిరి శూరత్వం,
సుందరయ్య, రావినారయణల మానవత్వం,
ధ్రువతారల అమరత్వం అజరామరం శ్లాఘనీయం..
ఎర్ర మందారాపూదోటలో
నేడు,
మిడతల దండు చొరబడింది...
రుధిరపు త్యాగాల పునాదుల్నీ కూల్చి... రక్తసిక్తం చేస్తుంది..!?
త్యాగం ధ్రువతారలది,
భోగం దొరలది, కుబేరులదా!
ఇక చెల్లదు సుమా..!?
చెమట చుక్కలు పరిమళించాలి...
మానవీయత వికసిల్లాలి...
పీడితుల రాజ్యం వర్థిల్లాలి..!!!!
- డి.కృష్ణయ్య