Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహించినట్టే సెప్టెంబరు17 వేడుకలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాజకీయ కోణాలలో జరిపామనిపించాయి. వీరతెలంగాణ సాయుధ రైతాంగపోరాటం అని సగర్వంగా చెప్పుకోవలసిన పోరాట సందర్భాన్ని విమోచన అని బీజేపీ హడావుడి చేసింది. స్వయంగా హౌం మంత్రి అమిత్‌షా వచ్చి అసందర్భ ప్రసంగం చేసి వెళ్లారు. పోరాటంలో ప్రాణాలర్పించిన నాలుగు వేలమంది యోధులు, చిత్రహింసలకు, శిక్షలకు గురైన వేలకువేల ప్రజానీకం, అమానుష పీడనకు వేధింపులకు అవమానాలకు గురైన మహిళా మణులు, వీరనారులు బందూకు పట్టిన బానిసోళ్లు వీరందరినీ విస్మరించి సర్దార్ పటేల్ నామస్మరణ మార్మోగింది. ఆయన రాగానే రాజ్‌ప్రముఖ్ బిరుదు ఇచ్చి రాజీ చేసుకున్న నిజాం నుంచి విమోచన జరిగినట్టు ఒక బీజేపీ మార్కు కథనం అరిగిపోయిన రికార్డులా వినిపించింది. పోరాటానికి భూమిక కలిగించి, లక్షల మంది ప్రజలను కదిలించి, కడదాకా పోరాడిన కమ్యూనిస్టుల పేరైనా వినిపించకపోగా ఆర్యసమాజ్, హిందూమహాసభ(ఆంధ్ర మహాసభ కాదు) ఇంకా ఏవేవో పేర్ల జపం చేశారు. మహారాష్ట్రలో ఈ మధ్యనే ఫిరాయింపుతో గద్దెక్కిన ముఖ్యమంత్రి షిండేను, కర్నాటక నుంచి బసవారాజ్ బొమ్మైని రప్పించి తెలంగాణలో జరిగిన పోరాటాన్ని అన్నింటితో కలిపే తంతు సాగింది. అనకపోతే తప్పదని ఐలమ్మ వంటివారి నాలుగు పేర్లు వినిపించి మిగిలినదంతా తమ స్వంత భజనతో సరిపెట్టారు. నాడు రజాకార్లు దాడి చేశారు గనక, ఇప్పుడు మజ్లిస్‌ను నాటి రజాకార్ల కింద జమకట్టి వారి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినం జరపలేదని తిట్టిపోశారు. పనిలో పనిగా తమను గెలిపించాలని ఊదరగొట్టారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా నాటి మహత్తర పోరాట చరిత్రకు, ఆశయాలకు సంబంధం ఉన్న విషయం కాదు. అంతా బీజేపీ రాజకీయ ప్రచారమే. ఎర్రజండా నాయకత్వంలో జరిగిన పోరాటానికి కాషాయం పులిమే ఆరాటమే. బీజేపీ అధిష్టానం మునుగోడు ఉపఎన్నికల కోసమో రేపు శాసనసభ ఎన్నికల కోసమో రాజకీయ ప్రచారం కోసం చరిత్రకు వక్రీకరణలు చేయదల్చు కుంటే అందుకు మరో సందర్భాన్ని చూసుకోవలసింది. ప్రజల ప్రాణార్పణ రక్త తర్పణతో చరిత్ర ప్రసిద్ధి గాంచిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను దుర్వినియోగపర్చడం ఘోరం.
పాతికేళ్ల కిందట మొదలు
మత తత్వ రాజకీయాల మూల విరాట్టు బీజేపీ 1998లో కేంద్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చే వరకూ సెప్టెంబరు 17ను పట్టించుకోలేదు. అప్పుడే విమోచన దినం అని పేరు పెట్టి ఎల్‌కె అద్వానీని రావించి రాజకీయ హడావుడి మొదలు పెట్టింది. నాడు ఈ విలీనం ప్రక్రియకు సర్దారు పటేల్ ఆధ్వర్యం వహంచినందున అద్వానీ అభినవ సర్దారు అని వారు చేసే ప్రచారానికి బాగా ఉపయోగకరమని తలపోసింది. ఇప్పుడు ''పటేల్ అంటే అమిత్‌షా'' గనక ఆయనా వస్తున్నాడు. అప్పుడు అద్వానీని ఇప్పుడు ఈయనను పటేల్ పేరిట భజన చేసేందుకు కిషన్‌రెడ్డి వంటివారు ఉండనే ఉన్నారు. నిజాం ముస్లిం రాజు గనక ఆయనను కూలదోయడం విమోచన అని వారి భాష్యం. వారిని వ్యతిరేకించే వారంతా నిజాంలూ రజాకార్లు. వాస్తవానికి బీజేపీకి లేదా సంఫ్‌ుపరివార్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేదు. వారి మత ఎజెండా ఇక్కడ చెల్లనూ చెల్లదు. రజాకార్ల సమస్యనే చెబుతూ ప్రజల ఐక్యతను కప్పిపుచ్చడం కుదిరేపని కాదు.
బీజేపీ ఇంత హడావుది చేస్తుంటే తను వెనకబడి పోరాదని కాంగ్రెస్ స్వతంత్ర దినంగా జరిపింది. వాస్తవానికి వారి నాయకుడైన సర్దార్ పటేల్‌ను బీజేపీ తన ఖాతాలో వేసుకుని రాజకీయం చేస్తుంటే ఎదుర్కొలేని దుస్థితి కాంగ్రెస్‌ది. రామానంద తీర్థ ప్రముఖ నాయకుడే. కాని వారికీ ఈ పోరాటంలో నామమాత్రపు పాత్రే. ఆలస్యంగా ఏర్పడిన స్టేట్ కాంగ్రెస్ పేరిట కొన్ని చర్యలు జరిగినా వాస్తవంలో ఈ పోరాటానికి ఆ పార్టీకి సంబంధంలేదు. కొందరు ఆ పేరుతో విచ్ఛిన్న చర్యలు కూడా చేశారు. ఇక్కడ ఆలస్యంగా ఏర్పడిన కాంగ్రెస్ అజెండాలో సంస్థానాలపై పోరాటమే లేదు. స్వాతంత్రానంతరం మొదటి దాడి తెలంగాణలో కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ సాగిస్తున్న ప్రజాపోరాటంపైనే కావడం యాధృచ్చికం కాదు. ఇంత ఘనంగా చెబుతున్న సెప్టెంబరు 17 పోలీసు చర్య నిజంగా అణచివేతకు తప్ప స్వతంత్రం కోసం కాదు. నిజాంను కలుపుకోవడం తప్ప లొంగదీసుకోవడం కానేకాదు. పోరాట యోధులను లొంగదీసుకోవడానికే పటేల్ నిజాం చేతులు కలిపారు. రజాకార్ల దాడులూ కొనసాగాయి. అయినా 1951 అక్టోబరు వరకూ పోరాటం కొనసాగింది. మరి 17వ తేదీ ప్రాధాన్యతేమిటో అదే పనిగా పొగిడే వారికే తెలియాలి. తెలంగాణ పోరాటమే లేకపోతే భూస్వామ్య కాంగ్రెస్ మరింతగా భూస్వామ్య పీడనను కొనసాగించి ఉండేది కూడా. వారు పంపిన సైన్యం వచ్చాక చేసిందీ పోరాటాన్ని అణచేయడమే. ఈ పోరాటం గురించి ఎన్నో దుష్ప్రచారాలు జరిగినా 1952 ఎన్నికల్లో ప్రజలు కమ్యూనిస్టులకు ఘన విజయాలు చేకూర్చి సమాధానమిచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతాలలో వారి పునాదులు నిలిచే ఉన్నాయి.
కేసీఆర్ ప్రసంగం తీరు
కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ పోరాట వారసత్వాన్ని తలుచుకోవడానికి ఎనిమిదేండ్లు పట్టింది. కేసీఆర్ చాలాకాలం పాటు నిజాం ఘనతను కీర్తిస్తుండేవారు. అందుకే ఉత్సవాలు కూడా జరపడానికి వెనుకాడారు. రజాకార్ల నాయకుడైన కాశిం రజ్వీ స్థాపించిన ముజ్లిస్ పార్టీ నేత ఒవైసీ లేఖ రాశాక జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిన్నారు. బీజేపీ మతకోణంలో విమోచన అంటుంటే కాంగ్రెస్ స్వతంత్ర దినోత్సవం అంటున్నది. అంటే వీరెవరికీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆ పేరుతోనే జరపడం ఇష్టం లేదు. శ్రీశ్రీ అన్నట్టు తారీఖుులు దస్తావేజుల కన్నా చరిత్ర సారం కీలకం. ఆ విధంగాచూస్తే తెలంగాణ సాయుధ పోరాటం 75ఏండ్ల తర్వాత తన విశిష్టతను చాటుకుంటున్నది. కమ్యూనిస్టులు రాజకీయ మార్పుల రీత్యా సెప్టెంబరు 17నే జరిపి సైద్ధాంతిక చారిత్రిక ప్రాధాన్యత చెబుతూ వస్తున్నారు. బీజేపీ రంగ ప్రవేశం తర్వాత వక్రీకరణలను నిలవరించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మారిన ఈ పరిస్థితుల్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగానైనా దీన్ని జరపడం మంచిదేనని భావించినా ఆయన కూడా తెలంగాణ సాయుధ పోరాటం నిజమైన ప్రాధాన్యతను సూటిగా చెప్పింది లేదు. నిజాం పేరెత్తకుండా నాటి నిరంకుశ, వెట్టిచాకిరీ పీడన, దోపిడీకి గోరి కట్టిన ఘట్టాలన్నీ దాటేసి రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన అని ఒక్క ముక్కతో తేల్చేశారు. అనర్గళ వక్త ఈ రోజు మాత్రం ఆచితూచి రాసుకొచ్చిన ప్రసంగాన్ని చదివారు. సహజంగానే నాటి పోరాట ఘట్టాలు, గొప్ప నాయకుల పేర్లు అనేకం చదివినా కమ్యూనిస్టు అనే పదం మాత్రం రాకుండా జాగ్రత్త పడ్డారు. అత్యధికభాగం తన నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం, అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలు పథకాలు వీటిగురించే వివరించేందుకు సమయం కేటాయించారు. అంతేగాని ఆయన పరివర్తనగా చెబుతున్న మహత్తర పోరాటం దేశంలోనే ఎన్ని మార్పులకు కారణమైందో మాత్రం వివరించని లోటు కొట్టవచ్చినట్టు కనిపించింది. మతతత్వ రాజకీయాలకు అవకాశం ఇవ్వరాదనీ అరక్షణమైనా ఆదమర్చి ఉండరాదని చేసిన హెచ్చరిక ఒక్కటే చెప్పుకోదగింది. నిజాం కీర్తనతో రాజకీయాలు సాగించే మజ్లిస్ కూడా జాతీయ సమైక్యతా దినం జరపాలనికోరడం కాలం తెచ్చిన మార్పే.
చెరగని ప్రాధాన్యత
ఎవరు చెప్పినా చెప్పక పోయినా తెలంగాణ పోరాటం చారిత్రక ప్రాధాన్యత, దానికి నాయకత్వం వహించి నడిపిన కమ్యూనిస్టుల పాత్ర, అమరవీరుల త్యాగాలు చెరిగిపోయేవి కావు. 1946 జులై నాల్గవ తేదీన దొడ్డి కొమరయ్య బలిదానం ఆ మహత్తర సమరానికి నాందీ ప్రస్తావన. రాజకీయ సాంస్కృతిక, ఆర్థిక పీడనలపై అశేష జనం ఒక్కుమ్మడిగా ఆయుధాలు ధరించి, వడిశెలలు చీపుళ్లు రోకళ్లు కూడా ఆయుధాలుగా మార్చి ఇంత పెద్ద ఎత్తున పోరాడటం భారతదేశంలో ఇంతకు ముందుకాని తర్వాతగాని జరగలేదు. అది అంతర్జాతీయంగానూ గొప్ప ఖ్యాతి గడించిన ప్రజా సమరం. సామాన్య జన సాహస గాథల సంపుటి. ఇలాంటిది జరిగిందని చెబితే ఇంద్రజాలమనిపిస్తుందని పేర్వారం జగన్నాథంగా రన్నమాట అతిశయోక్తి కాదు. మట్టి మనుషులు మహావీరులై మహాగ్ని కురిపించిన మనకాలపు ఇతిహాసం. ఆ పోరాట చరిత్ర, ఘన విజయాలు ఈ వారంలో చాలావ్యాసాలలో చూశాం.
తెలంగాణ ప్రజా పోరాటాన్ని రగిలించడంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటివారు ముఖ్యులు. సుందరయ్య, బసవపున్నయ్య, రాజేశ్వరరావు, దేవుల పల్లి వెంకటేశ్వరరావు, బిఎన్రెడ్డిలతో కూడిన కమిటీ దాన్ని నడిపించింది. ఇప్పుడు విభజన జరిగి ఉండొచ్చు గాని తెలంగాణ పోరాటం ప్రారంభం నుంచి చివరి వరకూ తెలుగు ప్రజలందరి పోరాటం. పీడిత ప్రజా విముక్తి అనే విశాల లక్ష్యంతో జరిగిన విప్లవ పోరాటాన్ని రాజకీయాల సంకుచిత సులోచనాలతో వక్రీకరించడం ఎవరికీ మంచిది కాదు. పోరు ఎవరిదనేది ప్రజలకు తెలుసు. పేరు ఏం పెట్టినా అందుకే ఈ సెప్టెంబరు 17పై ఆ ప్రశ్నలు పదేపదే ముందుకొస్తూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. విమోచన కలిగించింది విప్లవ పోరాటమేగాని, విద్వేష మతతత్వం కాదు.పేరుమార్చయినా సరే జరపక తప్పని స్థితికి పాలకులు నెట్టబడటమే దాని ప్రభావానికి ప్రతిబింబం. తన్నే వానికి భూమి అన్నట్టు పరిస్థితి మారిన ఈనాడు దున్నేవానికి భూమి అన్న ఆ పోరాట నినాదం మరింత అవశ్యకమవుతుంది.
- తెలకపల్లి రవి