Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏమండీ! ఇంటికి ఎప్పుడొస్తారు?'' అడిగింది వాణి, తన భర్తను వీడియోకాల్‌లో
''డ్యూటీ పూర్తికాగానే వస్తాను. ఎందుకు?'' అన్నాడు చరణ్.
''బిట్టూ గాడికి ఏదో కావాలంటా?'' అన్నది వాణి.
''నేను బిజీగా ఉన్నాను! తర్వాత మాట్లాడుతాను. ఫోన్ పెట్టేరు!'' అంటూనే ఫోన్ కట్ చేశాడు చరణ్. ఐదు నిమిషాలు కూడా కాలేదు. మళ్ళీ వీడియోకాల్ వచ్చింది!
ఈసారి నేరుగా బిట్టుగాడే లైన్లోకి వచ్చాడు. వీడియోలో బిట్టుగాడిని చూడగానే చరణ్ జడుచుకున్నాడు. గుడ్లురిమి సీరియస్‌గా చూస్తున్నాడు బిట్టుగాడు. వాడికేదో కావాలని అన్నప్పుడే వింటే సరిపోయేది అనుకున్నాడు చరణ్.
''ఏం కావాలి నాన్నా!'' అన్నాడు చరణ్ గొంతు పెగల్చుకుని.
''నాకు మోడీ డ్రస్ కావాలి!'' అన్నాడు బిట్టూ ఇంకా సీరియస్‌గానే. చరణ్‌కి పట్టరాని ఆనందమయ్యింది! తన ఆరాధ్య నాయకుడే తన కొడిక్కి కూడా ఆరాధ్యమయ్యాడు మరి! అయినా కొడుక్కి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు.
''నీకు మోడీ డ్రస్ ఎందుకురా?'' అన్నాడు చరణ్.
''నేను కూడా అంతగొప్పవాడిని అవుతాను డాడీ!'' అన్నాడు బిట్టుగాడు గొప్పగా.
చరణ్‌కి ఆనందంతో కళ్ళు చెమర్చాయి! ఎంత గొప్పవాడు తన నాయకుడు? తన తర్వాత తరాన్ని కూడా ఉత్తేజ పర్చుతున్నాడు! ఇలాంటి నాయకుడు గతంలో లేడు. భవిష్యత్‌లో రాడు! అని గట్టిగా నిర్ధారించుకున్నాడు.
సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో బట్టలషాప్కి వెళ్ళాడు. అప్పుడు గాని చరణ్‌కి సమస్య తీవ్రత ఏమిటో తెలియలేదు. కొన్ని వేల రకాల డ్రస్‌లు వేసుకున్న ఘనత, తన నాయకుడిది. అందులో ఏది సెలక్టు చేయాలో అర్థంకాక తలపట్టుకున్నాడు. షాపువాడు చరణ్ బాధను అర్థం చేసుకుని ఒక డ్రస్ తీసిచ్చాడు! ఎలాగోలా దాన్ని కొనేసి ఇంటికి చేరాడు. గేట్ వద్ద నిలబడి ఎదురు చూస్తున్న బిట్టుగాడి చేతిలో బట్టల కవరు పెట్టాడు! బిట్టూగాడు ఆనందంగా ఇంట్లోకి వెళ్ళి కవరు విప్పి చూశాడు! ఒక్క క్షణం ఆగి దాన్ని నేలకేసి విసిరికొట్టాడు.
''ఏమైందిరా! నీవు చెప్పినట్లే మన ఆరాధ్య నాయకుడు రెగ్యులర్‌గా వేసుకునే డ్రస్సే తెచ్చాను కదా! నచ్చలేదా?'' అడిగాడు చరణ్ ఆందోళనగా!
దానికి సమాధానంగా బిట్టుగాడు ఆ డ్రస్ యొక్క ప్రైస్‌ట్యాగ్ చూపించాడు! దానిమీద రూ.6500 ఉంది.
''అది నా పదిరోజుల జీతంరా! నేనే ఇప్పటిదాకా అంత కాస్టీలీ డ్రస్ వేసుకోలేదు! మీ అమ్మకు కూడా అంత ఖరీదైన చీర కొనివ్వలేదు!'' అన్నాడు బేలగా చరణ్.
''అదంతా నాకు తెల్వదు! నాకు రూ.45లక్షల డ్రస్, రూ.2లక్షల సన్‌గ్లాస్, రూ.16కోట్ల బిఎండబ్ల్యు కారు కావాలంతే'' అన్నాడు బిట్టూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లా గడ్డం కింద చేయి వేసి రుద్దుకుంటూ...
బిట్టూగాడి మాటలు పూర్తికాకముందే చరణ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే వాణి వచ్చి చరణ్ మొహం మీద నీళ్ళు చల్లింది. చరణ్ తేరుకుని లేచాడు! చరణ్ కళ్ళలో కృతజ్ఞత కనపడింది! వాణికి.
చరణ్‌కి బిట్టుగాడి మొహం చూడాలంటే భయం వేసింది! వీడు తన నాయకుడి డ్రస్ అడిగితే పొంగిపోయాడు. కాని అది అంత కాస్ట్లీ అని తట్టలేదు! అవి మొత్తం కొనాలంటే తన జీవితకాలం అంతా కష్టపడి పనిచేసినా చాలదు! మరి బిట్టుగాడిని శాంతింపచేయటం ఎలా? అంతుపట్టడం లేదు చరణ్‌కి! ఆ డ్రస్ ఎందుకని అడిగే ధైర్యం లేదు! తాను గొప్పవాడు కావాలని, డ్రస్ కావాలని అడిగితే మురిసిపోయిందీ తనే! బిట్టుగాడు అంత గొప్పవాడు కావొద్దని అనలేడు! అలాగని అంత ఖరీదైన డ్రస్ తేలేడు! భార్య వంక చూశాడు చరణ్.
''వాడి కోర్కె తీర్చండి!'' అన్నది వాణి చిన్నగా నవ్వుతూ...
మొదటిసారి వాణిని పీకపిసికి చంపెయ్యాలని గాఢంగా అనిపించింది చరణ్‌కు.
''తర్వాత నా పీక తీరీగ్గా పిసుకి చంపొచ్చుగాని, ముందు బిట్టుగాడికి డ్రస్ కొనివ్వండి!'' అన్నది వాణి నవ్వుతూనే.
''నా మనసులో ఉన్నది బాగానే తెలుసుకున్నావు గాని, నీ కొడిక్కి ఆ కోరికెందుకు పుట్టిందో తెలుసుకోలేక పోయావా?'' అన్నాడు హేళనగా చరణ్.
''వాడు మీకు పుట్టిన కొడుకు. అందుకే అన్నీ మీ బుద్దులే వచ్చాయి! మీలాగే మీ నాయకుడినే ఆదర్శంగా తీసుకున్నాడు మరి!'' అన్నది వాణి ఇంకా నవ్వుతూనే.
''చరణ్‌కి అప్పటికీ బ్లడ్‌ప్రెషర్ 200 దాటి పోయింది! ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంతలో గేట్ వద్ద నుండి బిట్టూ క్లాస్‌మెట్స్ అందరూ బిలబిల మని వచ్చేశారు.
''ఏరా బిట్టూ ఇంకా రెడీ కాలేదా?'' అడిగారు క్లాస్‌మెట్స్.
''ఏం లేదంకుల్! ఈ రోజు సాయంత్రం స్కూల్లో ఫ్యాషన్ పేరేడ్ ఉంది! దానికి బిట్టుగాడు మోడీ డ్రస్ వేసుకొస్తానని అన్నాడు!'' వివరించారు పిల్లలు.
''మోడీ డ్రస్సే ఎందుకు వేసుకుంటా నన్నాడు?'' అడిగింది వాణి.
''మా క్లాస్‌లో టిల్లుగాడు రాహుల్‌గాంధీలా 45వేల టీషర్ట్ వేసుకుని వస్తానని అన్నాడు. టిల్లుగాడికీ బిట్టుగాడికీ ఎప్పుడూ కాంపిటీషన్ ఉంటుంది! అందుకే బిట్టుగాడు మోడీ డ్రస్ వేసుకుని వస్తాను అన్నాడు ఆంటీ!'' అన్నారు పిల్లలు.
భర్త మొహంలోకి వాణి ప్రశాంతంగా చూసింది!
''మరేఁ ఆ మాత్రం కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి! అదీ నా కొడుకంటే!'' అన్నాడు గర్వంగా చరణ్.
''మరి కాంపిటీషన్లో మీ కొడుకుని గెలిపించండి మరి!'' అన్నది వాణి. చరణ్‌కి గొంతెండి పోయింది.
''చూశారా! మీ నాయకుడు ఘనతలకు పసిపిల్లల మనస్సులు, వారి ఆలోచనలు ఎలా చెడిపోయాయో!'' అన్నది వాణి.
''ఇందులో చెడిపోయింది ఏమున్నది?'' అమాయకంగా అడిగాడు చరణ్.
''మారు తెచ్చిన డ్రెస్ ప్రైస్ ట్యాగ్ చూసి విసిరికొట్టాడు మీ కొడుకు! రూ.6,500, మీరు పది రోజుల కష్టం అని చెప్పినా పట్టించుకోలేదు! పైగా అది నాకు తెల్వదు! అని అన్నాడు. ఇదేనండీ చెడిపోవటం అంటే! రోజూ నాయకులు వేసుకునే ఖరీదైన బట్టల గురించి, విలువైన అస్సెసరీస్ చూసీ గొప్పతనమంటే అదే అనుకుంటున్నారు పిల్లలు! అది వారి తప్పుకాదు! తల్లిదండ్రుల శ్రమ గురించి తెలియని వయస్సు వారిది! ఈ పసిపిల్లలు ఇన్స్పెర్ కావాలంటే శ్రమ విలువ గురించీ, శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే సరుకుల గురించీ నాయకులు మాట్లాడాలి! అంతకు ముందు సాధారణ జీవితాన్ని నాయకులు గడపాలి! ఒక గాంధీ లాగా, ఒక సుందరయ్యలాగా సాధారణ జీవితాన్ని ఆచరించి చూపాలి! అంతే కాదు, శ్రమ వల్ల ఉత్పత్తి అయ్యే సంపదను ముందుగా ఆ శ్రమ జీవులకు అందించాలి! శ్రమ జీవులను గుర్తించి గౌరవించాలి! కాని ఆ శ్రమ వల్ల ఉత్పత్తి అయిన సంపదను అంబానీలకు, అదానీలకు కట్టబెడుతున్నారు మీ నాయకులు! అలాంటి నాయకు లనే ఆదర్శమంటున్నారు మీలాంటివారు! అందుకే మీలాంటి వారి శ్రమకు తగ్గ ఫలితం మీ నాయకుల ఏలుబడిలో దక్కటంలేదని గుర్తించండి!'' అన్నది వాణి.
వాణి మాటలు పూర్తికాగానే బిట్టుగాడిని లోపలి తీసుకెళ్ళాడు చరణ్. పది నిమిషాల తర్వాత రైతు గెటప్ లో బయటికి వచ్చాడు బిట్టుగాడు. ఆ వెనకే తండ్రీ వచ్చాడు.
వాణితో సహా పిల్లలంతా చప్పట్లు కొట్టాలరు!
- ఉషాకిరణ్, సెల్: 9490403545