Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా కార్పొరేట్ వ్యవహారాల పరిధిలోని వివిధ ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ కార్యాలయాల్లో 15లక్షల పైగా కంపెనీలు నమోదై ఉన్నాయి. గత ఏడాది కాలంలోనే 2.5లక్షల కంపెనీలు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నాయి. ఇలా కొత్తగా ఏర్పాటు అయిన కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో ప్రారంభించి ఆ సమాచారాన్ని ఆర్వోసీలకు తెల్పాలి. అంతేకాకుండా సమయానుకూలంగా రికార్డులు నిర్వహించాలి, ఆ నిబంధనలు అన్ని కంపెనీలకు వర్తిస్తాయి. లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, వార్షిక నివేదిక తదితర సమాచారంతో కూడిన రికార్డులు సకాలంలో దాఖలా చేయకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. నోటీసులు ఇచ్చినా స్పందించని కంపెనీలను రద్దు చేస్తారు. అలాంటి కంపెనీల పేర్లను తొలగిస్తారు. దీన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేపడుతుంది. అయినప్పటికీ కేవలం కాగితాలకే పరిమితమై బోగస్ (డొల్ల)కంపెనీలు వేలల్లో ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 7వేల కంపెనీలు లిక్విటేషన్ ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. సుమారు తొమ్మిది లక్షల కంపెనీ లు వివిధ కారణాల వల్ల మూతపడ్డాయి. దీనికి తోడు కార్య కలాపాలు సాగించని, రికార్డులు చూప(దాఖలాచేయ)ని కంపెనీ లు వేల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రజలను మోసం చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకొని ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సి ఉంది.
ఇలా బడా కార్పొరేట్ బోగస్ కంపెనీలు అక్రమ దందాలు కొనసాగిస్తున్నప్పటికీ వాటికి ప్రజాధనాన్ని, మౌలిక వసతులను పందేరంలా పంచి పెడుతున్న ప్రభుత్వం అక్రమాలను ఉదా సీనంగా చూస్తుంది. పేదల నుండి పన్నుల రూపంలో వసూలు చేసి పెద్ద పెద్ద కంపెనీలకు దోచిపెట్టడం మంచిది కాదు. వారు స్థానికులకు ఉపాధి, ఉద్యోగం చూపుతామన్న హామీ కూడా నెర వేరడం లేదు. ఇలాంటి బోగస్ కంపెనీల ఆగడాలను అరికట్టాలి.
రుణయాప్‌ల దారుణాలు:
సామాన్య, మధ్యతరగతిలో అప్పు కోసం రుణయాపుల ఊబిలో పడి ఆత్మహత్యల పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. అక్రమ రుణ యాప్ సంస్థల ఏజెంట్లు చేసే దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. మహిళా రుణగ్రస్తులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. రక్తాన్ని పీల్చే జలగల్లా వ్యవహరిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆన్లైన్లో రుణ యాప్‌ల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. చిరు ఉద్యోగులు, వీధి వ్యాపారులు, పేద, మధ్యతరగతి వారు, చదువుకున్నవారు సైతం రుణయాప్‌ల బారినపడి విలవిలలాడు తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద నమోదైన రుణ యాపులు మాత్రమే యాప్ స్టోర్లలో ఉండేలా చూసి, అనధికారికంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుణ యాప్‌లను యాప్ స్టోర్‌లో నుంచి తొలగించాల్సిన అధికారులు ''చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు'' వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజలకు పరువు నష్టం, ప్రాణ నష్టం. వడ్డీలు చెల్లించలేక ఉన్న కొద్దిపాటి స్థిరాస్తులు కోల్పోయాక ఆర్థికశాఖ చర్యలకు దిగింది. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో 2020లో ఆన్లైన్ రుణ యాప్‌ల కేసులు 61 నమోదు కాగా, 2022 వచ్చేసరికి అవి ఏకంగా 3342 కు పెరిగినట్టు తెలుస్తున్నది. వీటి ఆగడాలు నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల ప్రాంతాలకూ చేరాయి. ప్రభుత్వం ఈ అనధికార రుణయాప్‌ల కార్యకలాపాలను సత్వరం కట్టడి చేయడానికి ఐదు అంశాలతో కూడిన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయానికి వచ్చింది. అవి 1.చట్టబద్ధమైన అన్ని యాప్‌లపై ఆర్బీఐ ఒక శ్వేత పత్రం తయారు చేస్తుంది. ఆ జాబితాలోని యాప్‌లు మాత్రమే యాప్ స్టోర్లలో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ దృవీకరించాలి. 2.మనీ లాండరింగ్ ఉపయోగిస్తున్న అద్దె ఖాతాలను ఆర్బీఐ పర్యవేక్షించాలి. నిద్రాణస్థితిలో ఉన్న ఎస్బిఎఫ్ల కార్యకలాపాలు సమీక్షించి అవి దుర్వినియోగం కాకుండా వాటి లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలి. 3.పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత నమోదు కాని అగ్రిగేటర్లు ఎవరినీ ఆర్థిక కార్యకలాపాల్లోకి అనుమతించ కుండా చూడాలి. 4.కార్పొరేట్ వ్యవహారాల శాఖ సేల్ కంపెనీలను గుర్తించి వెంటనే రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి. 5.వినియోగదారులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఇతర భాగస్వాములకు సైబర్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి. కేంద్ర ఆర్థికశాఖ ఆర్థిక వ్యవహారాలవిభాగం తదితర విభాగాలతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సంయుక్తంగా పై నిర్ణయాలను తీసుకుంది. కానీ ఈ నిర్ణయాలు రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా కార్యరూపం దాల్చాల్సి ఉంది. మన దేశంలో ఒకవైపు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడం లేదు. కేవలం కాగితాలకి పరిమితమై బోగస్ (డొల్ల)కంపెనీలు ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అక్రమ దందాలను కఠిన చట్టాలతో ఉక్కుపాదం మోపి కట్టడి చేయాల్సి ఉంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వద్ద నమోదు కాని రుణ యాప్‌లు అనేక దారుణాలతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. జనం కట్టలేక ఆత్మ హత్యలకు పూను కుంటున్నారు. వీటి అమానవీయ ఆర్థిక దోపిడీని అరికట్ట కుండా ప్రభుత్వాలు కాల యాపన చేస్తూ ఉదాసీనంగా వ్యవహ రించడం మంచిది కాదు. వెంటనే ఈ అక్రమ దందాలు కట్టడి చేస్తూ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవితాలకు భరోసా కల్పించాల్సిఉంది.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650