Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేద, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కాపాడే చట్టాలలో కనీస వేతనచట్టం ఒకటి. 1948లో కనీస వేతనచట్టం చేశారు. రెండో షెడ్యూల్లో వ్యవసాయాన్ని చేర్చారు. వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలన్నీ ఇందులో వస్తాయి. ఈ చట్టం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించి, సవరించిన వేతనాలను ప్రకటించాలి. ప్రకటించిన వేతనాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయో చూడవలసిన బాధ్యత లేబర్ అధికారులు, రెవెన్యూ అధికారుల పైన ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2012 జూలైలో జీవో నెంబర్ 73ను విడుదల ద్వారా వేతనాలను సవరించారు. తరువాత 2016లో వేతనాలను సవరించిన తెలంగాణ ప్రభుత్వం ఆరు సంవత్సరాలు అవుతున్నా వేతనాలు తిరిగి చేపట్టలేదు. సవరించిన వేతనాల గురించి ప్రజలకు గోడ పత్రికలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలి. గ్రామ పంచాయతీ ద్వారా గ్రామాలలో చాటింపు వేయించి రైతులకు, కూలీలకు తెలియజేయాలి. అలాగే గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి పెరిగిన కూలిరేట్ల విషయాలను రెవెన్యూ అధికారులు వివరించాలి. కానీ గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసింది శూన్యం. మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేద, వ్యవసాయ కూలీల జీవన విధానం రోజురోజుకూ బలహీనపడుతున్నది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి కోటి 50లక్షల మంది వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి వ్యవసాయ కార్మికుల కొనుగోలు శక్తి అంతకంతకూ క్షీణిస్తున్నది. మరోపక్క ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడం మూలంగా పేదలపై మరింత భారం పడుతున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనంగా అమలు చేయడం మూలంగా పేదలకు కేవలం రేషన్ బియ్యం తప్ప ఇతర నిత్యావసర వస్తువులేవీ అందుబాటులో లేకుండా పోయాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయ కార్మికుల పనిదినాలు మరింత తగ్గుతున్నాయి. దీంతో కూలీలకు జీవనం భారమవుతున్నది. స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు రావడం లేదు. చట్టం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. పనికూడా ప్రతిరోజు దొరకదు. కూలీలు పని వెతుక్కోవలసిన దుస్థితి ఉంటుంది. పని దొరకకపోతే గల్ఫ్ దేశాలకు లేదా బొంబాయి, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ వంటి ఇతర సుదూర ప్రాంతాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో వారి పిల్లలు చదువుకు, వైద్యానికి దూరం అవుతున్నారు. మరోపక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వ్యవసాయ రంగంలో పని రోజులు తగ్గుతున్నాయంటే కూలీలకు కూలి రేట్లు కూడా పెరగడం లేదు. బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువులు కొనబోతేనేమో ధరలు మండిపడుతున్నాయి. నిత్యవసర వస్తువులు కొనలేక ఆహార భద్రతకు దూరమై అనారోగ్యాలకు గురవుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి సామాజిక, ఆర్థిక భద్రత కరువైంది. ఇటీవల సుప్రీంకోర్టు రోజు కూలీ రూ.600 ఇవ్వాలని అంతకన్నా తక్కువ ఇవ్వకూడదని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలు మాత్రం లక్షల్లో పెంచుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్కనిండని పేద, వ్యవసాయ కార్మికుల బతుకుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
- ఎం. సైదులు
సెల్:8106778287