Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ ఏఎస్ రావు నిఖార్సైన మానవతావాది. విలువల కోసం జీవితాంతం నిలబడిన వ్యక్తి. భారతదేశంలో పేరెన్నికగన్న గొప్ప శాస్త్రవేత్త. శాస్త్ర సాంకేతిక రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు, రూపొందించిన ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. కేవలం ఉత్పత్తులు మాత్రమే కాదు, కార్మికుల సంక్షేమం కూడా ప్రధానం అని ఆచరణాత్మకంగా నమ్మిన వ్యక్తి.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగల్లు ఈయన జన్మస్థలం. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టింది అక్కడే. 1914 సెప్టెంబర్ 20న వెంకటాచలం, సుందరమ్మ దంపతు లకు జన్మించారు. వారిది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఐదో తరగతి వరకు మోగల్లులోనే సాగింది. హైస్కూల్ స్టడీకి వచ్చేటప్పటికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఒక పెద్ద మనిషి సహాయంతో తణుకు హైస్కూల్లో చేరారు. అక్కడ ఆయన భోజనం గురించి వారాలబ్బాయిగా రోజుకి ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం చేసే విధంగా కుదుర్చుకున్నారు. అలా ఆయన హైస్కూల్ చదువు అయిపోయింది. ఇక పైచదువులకు ఎలావెళ్లాలి? ఆ రోజుల్లో విజయనగరం మహారాజా వారి కాలేజీలో అర్హులైన పేద విద్యార్థులకు వసతి, భోజనం కల్పించి చదువుకునే అవకాశం ఉన్నదని తెలుసుకొని బంధుమిత్రుల వద్ద చార్జీలకు డబ్బులు తీసుకుని ఇంటర్మీడియట్లో చేరారు. అక్కడ ఆయనకు సత్రంలో వసతినిచ్చి భోజనం పెట్టేవారు. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యారు. ఆయనకేమో ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించే లాగా లేదు. బంధువులు, ఇతరుల సహకారంతో పై చదువుల కోసం 1935లో ఆయన వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో బిఎస్సి చదువుకోవడానికి అడుగు పెట్టారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎంఎస్సీలో చేరారు. ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో ఉండగా కాకినాడలోని అన్నపూర్ణమ్మతో ఆయనకు వివాహం అయింది. 1939లో 25ఏండ్ల వయసులో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ పట్టా అందుకున్నారు.
ఎమ్మెస్సీ పూర్తి అయిన తర్వాత అమెరికాలోని స్టాన్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకోవటానికి అప్లై చేశారు. ఆయనకు ఆ సీటు కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళటానికి డబ్బు కోసం టాటా ఎండోమెంట్ సంస్థ వారిని కలిశారు ఏఎస్ రావు. ఆ రోజుల్లో ఆ సంస్థ అర్హులైన విద్యార్థులకు చదువు కునేందుకు అప్పు ఇస్తూ ఉండేది. దానితో 1945 నుండి 1947వరకు అమెరికాలో స్టాన్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత మాతృ దేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులో టాటా ఇన్సిట్యూట్‌లో హొమి జే బాబా వద్ద రీసెర్చ్ ఇంజనీరుగా చేరారు. ఆ రోజులలోనే టాటా ఇన్సిట్యూట్‌లో ఫిజిక్స్ హెడ్‌గా పనిచేస్తున్న సర్. సి.వి రామన్‌తో కూడా కలిసి పనిచేసే అవకాశం కలిగింది డాక్టర్ ఏఎస్ రావుకి. భారతదేశపు తొలి పరమాణు రియాక్టర్ అప్సర తయారీలో ఏఎస్ రావు కీలక భూమిక పోషించారు. ఆయన సేవలను గుర్తించి 1960లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం. 1962లో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను మనదేశంలోనే తయారు చేసుకోవాలని సంకల్పించి అందుకోసం ఒక కమిటీ ఏర్పరిచారు. ఆ కమిటీలో కీలక సభ్యుడు ఏఎస్ రావు. ఆ కమిటీ సిఫారసుల ఫలితమే భారతదేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రయివేటు సంస్థలకు కూడా అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేసే ప్రత్యేక సంస్థ అవసరమని నిర్ణయించబడింది. ఆ సంస్థను ఎక్కడ స్థాపించాలి అనుకున్నప్పుడు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలిసి హైదరాబాదులో ప్రారంభం అయ్యేలాగా ఒప్పించారు. అదే 1967 ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్). ఏఎస్ రావు దానికి మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్. 300 మందితో ఐదు విభాగాలుగా ప్రారంభమైన ఈసీఐఎల్‌ను10 సంవత్సరాలలో పదివేల మంది సిబ్బందితో 20కి పైగా విభాగాలతో పని చేసేలాగా అభివృద్ధి చేశారు డాక్టర్ ఏఎస్ రావు. ఆయన ఉత్పత్తితోపాటు కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసారు. 1972లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 1967 నుండి 1978 వరకు పనిచేసి ఆయన పదవీ విరమణ చేశారు. ఈసీఐఎల్‌ను ఆయన సొంత బిడ్డగా పెంచి పోషించారు.
ఆయన సారథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేయబడి, అభివృద్ధి చేయబడిన దాదాపు 100రకాల ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తులు ఈసీఐఎల్ చేసేది. 1970 ప్రాంతంలో భారతదేశంలో కంప్యూటర్లు అంటేనే అది ఒక కొత్త వింత. అలాంటి రోజుల్లోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన టి.డి.సి 12, అనే కంప్యూటర్ను తీసుకొని దాని తర్వాత జనరేషన్ అయిన టిడిసి 16, టిడిసి 32 లాంటి కంప్యూటర్లను తయారు చేసిన ఘనత ఈసీఐఎల్ ది. ఈసీఐఎల్ స్థాపించిన తొలి దశాబ్దాల్లో దేశంలో కంప్యూటర్ స్పెషలిస్టులుగా ఉన్నవారందరూ ఈసీఐఎల్ నుంచి వెళ్ళిన వారే. విప్రో లాంటి సంస్థ సాఫ్ట్వేర్ విభాగం ప్రారంభించినప్పుడు దాని సారథులు ఈసీఐఎల్ నుంచి వెళ్లిన వాళ్లే. ఆ రోజుల్లో ఈసీఐఎల్ తయారుచేసిన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు డిఫెన్స్, సెక్యూరిటీ, రైల్వే, మెడికల్ లాంటి కీలకమైన రంగాలలో వాడేవారు. అలానే 1980 ప్రాంతంలో భారతదేశంలో టీవీలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్.
ఆ తర్వాత భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలను తయారు చేసిన ఘనత కూడా ఈసీఐఎల్దే. స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటగా తయారుచేసిన ఫ్యాక్స్ మిషన్ గాని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంట్రోల్ సిస్టం గాని, ఎర్త్ స్టేషన్ యాంటీనా గాని, రేడియేషన్ మానిటరింగ్ అండ్ డిటెక్షన్ సిస్టం కానీ, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ కానీ, సాలిడ్ స్టేట్ కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కానీ, ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టం కానీ ఇవన్నీ మొట్టమొదటిసారిగా ఈసీఐఎల్ ఉత్పత్తి చేసినవే. అలాగే యుద్ధక్షేత్రంలో ఉపయోగించే మిస్సైల్స్ అవి సరిగ్గా ఏ సమయంలో పేలాలి అని నిర్థారించేది అత్యంత ముఖ్యమైన భాగం ఎలక్ట్రానిక్ ఫ్యూజు. అలాంటి కీలకమైన ఫ్యూజులను 10లక్షలకు పైగా తయారుచేసి డిఫెన్స్‌కు సప్లై చేసింది ఈసీఐఎల్. అందులో ఒక్క ఫ్యూజు కూడా ఫెయిల్ కాలేదు అంటే ఎంతటి నాణ్యత ప్రమాణాలను ఈసీఐఎల్ పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంస్థ పటిష్టతకు పునాదులను, ప్రణాళికలు వేసి, దశ దిశను నిర్దేశించిన మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు.
తన మరణానంతరం ఎలాంటి క్రతువులు చేయవద్దని కోరారు. 89 సంవత్సరాల వయసులో 2003 అక్టోబర్ 30న హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో కన్నుమూశారు. ఆయన భారతదేశం కన్న గొప్ప శాస్త్రవేత్త.
- పి.బి. చారి
సెల్:9704934614