Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన అలహాబాద్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. గత 15రోజులుగా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. యూనివర్సిటీ ఆవరణలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో ఒక విద్యార్థి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
ప్రశాంతంగా చదువుకోవాల్సిన విద్యార్థులు క్యాంపస్‌లో ఎందుకు ఉద్యమ బాట పట్టారు? యూనివర్సిటీ అధికారులు ఎటువంటి చడి, చప్పుడు లేకుండా, విద్యార్థులతో కనీసం చర్చ లేకుండా ఫీజులు పెంచడమే వీరి ఆగ్రహానికి కారణం. ఒకేసారి భారీ స్థాయిలో 400శాతం ఎక్కువ చేసి పెంచారు. గతంలో సెమిస్టర్‌కి బి.ఎ రూ.975 ఉండగా ఇప్పుడు రూ.3,701కి, బీ.కాం రూ.975 ఉండగా రూ.3901, బిఎస్సి రూ.1175 ఉండగా రూ.4151, బి.టెక్ రూ.1941 ఉండగా రూ.5,151, ఎంఏ రూ.1375 ఉండగా రూ.4651, ఎంఎస్సి రూ.1961 ఉండగా రూ.6,000, ఎల్.ఎల్.బి రూ.1,975 నుండి రూ.4,651కి పెంచారు. ఇంత భారీ స్థాయిలో ఫీజులను పెంచేటప్పుడు యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరపాలి. విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులతో చర్చలు చేయాలి. కానీ ఇలాంటి వేవీ లేకుండానే ఏకపక్షంగా కోర్స్ ఫీజులను, ఎగ్జామ్ ఫీజులను పెంచారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు కడుపుమండి తీవ్రస్థాయిలో స్పందించి ఆందోళన బాటపట్టారు.
ఇప్పుడు ఈ యూనివర్సిటీ విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు... సమాధానం చెప్పలేని యోగి, మోడీ ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు భారీ స్థాయిలో పెంచారు. విద్య ఉద్యోగ అవకాశాలకు దూరంగా బతుకుతున్నాం. ఇప్పుడు ఈ ఫీజుల భారం మోపి మమ్మల్ని విద్యకు కూడా దూరం చేస్తారా? అంటూ నినదిస్తున్నారు. మా యూనివర్సిటీలో అధికారులు, ప్రజాప్రతినిధుల బిడ్డలు చదివితే మా ఆవేదన ఏంటో అర్థం అవుతుంది అంటున్నారు. అవును నిజమే వారు అంతా పేద కుటుంబాల వారే. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. కార్పొరేట్ శక్తులకు రుణమాఫీలు, రాయితీలు కల్పిస్తున్న బీజేపీ నేతృత్వంలోని యోగి, మోడీ ప్రభుత్వాలు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, కూలీ బిడ్డలపై ఫీజుల పిడుగులను వేస్తున్నాయి. వాస్తవానికి గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచమంతా కరోనాతో కకావికలం అయింది. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మృగ్యం అయినాయి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న సమయాన విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం వారిని ఉన్నత విద్యకు దూరం చేయడమే. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధిలో దూసుకుపోతామని మభ్యపెడుతున్న బీజేపీ పార్టీ నిర్వాకం యూపీలో ఇలావుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి బడుగులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనా?
నూతన జాతీయ విద్యా విధానమే మూలమా?
కరోనా కష్టకాలంలో ప్రజలకు విద్యార్థులకు రాయితీలు కల్పించి విద్యా, ఉపాధి, జీవన ప్రమాణాలు పెంచాలి. కానీ ఈ కష్టకాలాన్ని ఆసరా చేసుకొని ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలను బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపింది. దానిలో భాగంగానే కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. విద్యుత్ బిల్లును తీసుకొచ్చింది. కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు పోరాడుతున్నారు. వీటితో పాటు విద్యను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికే నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది. దీని ద్వారా ఉన్నత విద్య అంతా మరింత కార్పొరేటీకరణ, కాషాయీకరణ, ప్రయివేటీకరణ అవుతుంది. పేదలకు విద్య దూరమవుతుంది. దీన్ని అమలు చేయరాదని దేశంలో విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు ఉద్యమిస్తున్నారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఫీజులు పెంచడం కూడా నూతన జాతీయ విద్యా విధానంలో భాగమే అని ఛాన్సలర్ సంగీత శ్రీవాత్సవ్ పేర్కొనడం ఇక్కడ గమనించాలి. అంటే ఫీజులను పెంచడానికి అనుమతిస్తున్న జాతీయ విద్యా విధానం ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందో యోగి, మోడీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలే చెప్పాలి. ఎవరితో సంప్రదింపులు లేకుండా, పార్లమెంట్లో కూడా చర్చించకుండా, కార్పొరేట్ నూతన జాతీయ విద్యా విధానం రూపొందించి అమలుకు పూనుకుంది బీజేపీ సర్కార్. దీని దుష్పరిణామాలను ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీలో పెంచిన ఫీజుల రూపంలో చూస్తున్నాం. దేశంలో ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ గాని, రీసెర్చ్ సెంటర్ గాని నెలకొల్పని మోడీ ప్రభుత్వం, ఫీజులను మాత్రం పెంచి విద్యారంగంపై, విద్యార్థులపై సర్జికల్ దాడులు చేయడం దారుణం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశభక్తి ముసుగులో అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను దేశంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జే.ఎన్.యూ, జామియా మిలియా, బెనారస్, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇప్పుడు ఇది అలహాబాద్ యూనివర్సిటీకి చేరుకుంది. కానీ, సమస్యలు పరిష్కరించాలని అడిగిన అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులపై కూడా అదే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కనీసం నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడంలేదు. ఉవ్వెత్తిన లేస్తున్న విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులే మోడీ, యోగి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.
- పి.మహేష్, సెల్: 9700346942.