Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ రమణ తండ్రి లక్ష్మీపతి ఉద్యోగరీత్యా చెన్నై నుండి హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదులో అమీర్ పేట నాగార్జుననగర్ కాలనీలో (ఒకప్పుడు ఈ కాలనీకి కమ్యూనిస్టు కాలనీగా పేరు) కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ తమ్ముడు తమ్మారెడ్డి కష్ణమూర్తి ఇంట్లో అద్దెకు ఉండేవారు. లక్ష్మీపతికి ముగ్గురు సంతానం. మూడవ సంతానం కామ్రేడ్ రమణ. పెద్దమ్మాయి విజయ తప్ప మిగతా ఇద్దరి జననం హైదరాబాద్‌లోనే జరిగింది. రమణ తండ్రికి కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో సూపర్వైజర్గా ఉద్యోగం రావడంతో అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు మారారు. అప్పటికి రమణ హైదరాబాదులో ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసుకున్నాడు. తదుపరి అతని విద్యాభ్యాసం కాగజ్‌నగర్‌లోనూ టెక్నికల్ కోర్సు వరంగల్లోనూ సాగింది. కామ్రేడ్ రమణ వరంగల్‌లో చదివే సందర్భంలో ఎస్ఎఫ్ఐతో సంబంధాలతో పార్టీలోకి వచ్చారు. ఆ రోజుల్లో (అంటే 80 - 83 సంవత్సరాల కాలంలో) నక్సల్ ఉద్యమం సీపీఐ(ఎం) నాయకులను టార్గెట్ చేసి నిత్యం దాడులు చేస్తూ ఉండేది. కామ్రేడ్ ఓంకార్ బయటకు వెళితే నలుగురు రక్షకులుగా ఉండేవారు. ఆ నలుగురిలో కామ్రేడ్ రమణ ఒకరు. చదువు పూర్తయ్యాక 1984లో కాగజ్ నగర్ పేపర్ మిల్లులో (ఎస్పిఎం) ఎఈగా ఉద్యోగంలో జాయిన్ అయిన రమణ 1987లో జిల్లా పార్టీ పిలుపుమేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం కార్యకర్తగా మందమర్రికి వచ్చారు. రమణ తండ్రిగారైన లక్ష్మీపతికి కుమారుడు ఉద్యోగానికి రాజీనామా చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కొడుకు భవిష్యత్తు ఏమి అవుతుందో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. రమణ తల్లి జలజ కొడుకు చేస్తున్న పనిని వ్యతిరేకించేవారు కాదు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో రమణ తల్లి జలజకి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు, వై వి కష్ణారావు, ఎన్ వి భాస్కర్ రావు కుటుంబాలతో పరిచయం ఉన్న కారణంగా తన కుమారుడు చేస్తున్న పనిని మంచి పనిగా భావించి అతన్ని ప్రోత్సహించేది. భర్తతో వాడికి ఇష్టమైన పని చేయనీయండి అని నచ్చచెప్పి ఒప్పించింది. పేపర్ మిల్లులో ఉద్యోగ విరమణ అనంతరం రమణ తండ్రి తన కుమార్తెలతో తిరిగి చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడి కాలం చేశారు. రకరకాల అనారోగ్య సమస్యలతో రమణ అక్కలిద్దరూ కూడా వివాహానంతరం చిన్న వయసులోనే మృతి చెందారు. ఉద్యోగానికి రాజీనామా చేయకముందు కాగజ్‌నగర్‌లో కామ్రేడ్ రమణ యువజన రంగంలో పనిచేసి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిర్మాణం చేశారు. అప్పటికే కాగజ్‌నగర్‌లో అమరుడు డి. వి. సుబ్బారావుతో పార్టీ నిర్మాణం ఉంది. రమణ పేపర్ మిల్లులో పనిచేస్తూనే ఆ పరిశ్రమంలోని పరిచయాలను బలపరుచుకుని పార్టీని నిర్మించడంలో ఒక ముఖ్య పాత్రను పోషించారు. అప్పటికే ఉన్న నిర్మాణం మరింత బలోపేతం అయింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత1987 నుండి సింగరేణి కార్మిక ఉద్యమంలోనూ, ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. నేడు రమణకు మిగిలింది పార్టీ కుటుంబాలు, నాయకులు వారి ఆత్మీయత, వారితోవున్న సంబంధాలు మాత్రమే. రాష్ట్ర కేంద్రం పిలుపుమేరకు హైదరాబాదుకు వచ్చి సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత సిటీ కమిటీలో కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ సూచన మేరకు నవ తెలంగాణ ఎడిటోరియల్ బోర్డులో చేరి తిరిగి తన కృషి ప్రారంభించి అనేక ఎడిటోరియల్స్, అనువాద వ్యాసాలు రాస్తూ ఉండేవారు. మూడు నాలుగు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సలు పొందుతూనే రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించడానికి ప్రయత్నించే వారు. రమణకు ఉద్యమం ఎడల ఉన్న తపన, పార్టీ యందు విధేయత, నాయకులు యెడల గౌరవం అద్భుతం. వామపక్షాలలోని కార్యకర్తలను సీపీఐ(ఎం) పార్టీలోకి తీసుకురావాలని తపన పడేవారు. వారందరూ దారి తప్పారు సీపీఐ(ఎం) పార్టీనే సరైన మార్గమని నచ్చజెప్పి పార్టీలోకి తీసుకురావాలని ఆయన చేసే ప్రయత్నం ఒక్కొక్కసారి మేము కోప్పడే లాగా కూడా ఉండేది. తను అనారోగ్యంతో బాధపడుతూ కూడా కార్యకర్తలతో సంబంధాలు ఇనాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలను గుర్తించి మళ్లీ వారిని పార్టీ నిర్మాణంలోకి తేవాలని ఆయన పడ్డ తపన అనిర్వచనీయం. ఆ కామ్రేడ్‌ని అర్థం చేసుకున్న వారికి, అలాగే తెలిసిన వారికి ఆ కామ్రేడ్ ఒక ఉత్ప్రేరకం. తన శరీరం ఎంత సహకరించకపోయినా మానసిక బలంతోనే పార్టీ ఎడల ఉన్న నిబద్ధతతో పదవ తేదీ నాడు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ వర్థంతి సమావేశంలో కూర్చుని, ఆ ప్రసంగాలు వింటూ వాంతులు చేసుకుని అక్కడే పడిపోయారు. ఆ తరువాత మూడు రోజులకి మనందరం ఆయన మరణ వార్త వినడం దురదృష్టకరమైన విషయం.
మా మంచిర్యాల, కొమరం భీమ్ జిల్లాల కార్యకర్తలు వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇక్కడ కార్యకర్తలతో, ఉద్యమంతో ఆయనది విడదీయలేని బంధం. పార్టీ తన జీవితం అనుకున్నాడు రమణ. చివరకు పార్టీనే రమణకు కుటుంబం అయ్యింది. ''తిరుకోయలూర్ నారాయణస్వామి వెంకటరమణ'' తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించి తన ఆశయాలను మనకు మిగిల్చి పోయారు. ఆ కామ్రేడ్‌కి ఇవే జోహార్లు... రెడ్ సెల్యూట్...
- కమలకుమారి