Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్ట్ 15, 2022 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నందుకు మాత్రమే కాక ఎవ్వరూ హర్షించని నిర్ణయం చేసిన రోజుగా కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ రోజున గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, 2002లో బిల్కిస్ బానో అనే మహిళను గ్యాంగ్ రేప్ చేసి, ఆమె కుటుంబ సభ్యులు 7గురిని హత్య చేసిన 11మంది వ్యక్తులకు కోర్టు విధించిన శిక్షలను తగ్గిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను జారీ చేసింది.
గోద్రా అల్లర్లు జరిగిన కాలంలో గుజరాత్ రాష్ట్రంలో దహౌద్ జిల్లాలో గ్యాంగ్ రేప్‌కు గురైనప్పుడు ఇరవై ఒక్క ఏండ్ల బిల్కిస్ బానో ఐదు నెలల గర్భవతి. హత్యచేయబడిన వారిలో ఆమె 3ఏండ్ల కూతురు కూడా ఉంది.బిల్కిస్ చాలా తేలికగా నేరస్థులను గుర్తించగలిగింది. వారి నేరాలను రుజువు చేసి, 2008లో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు, బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులు వారికి జరిమానాతో పాటు, జీవిత ఖైదును విధించాయి.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బిల్కిస్ బానో ఫిర్యాదు చేయడం వల్ల నేరం జరిగిన గుజరాత్లో కాకుండా మహారాష్ట్రలో విచారణ చేపట్టారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చట్టం (శిక్ష తగ్గింపు) పుణ్యమా అని పద్నాలుగు సంవత్సరాల తరువాత ఖైదీలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. వారి విడుదల నిర్ణయాన్ని పౌర సమాజంలోని అనేక గ్రూపులు, మహిళా సంఘా లు, న్యాయ వ్యవస్థకు చెందిన సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జూన్ 2022లో కేంద్ర ప్రభుత్వం, ఆగస్ట్ 15, 2022, జనవరి 26, 2023, ఆగస్ట్ 15, 2023 సందర్భాలలో మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించాలనే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, మరణశిక్ష విధించిన వారికి, మనీ ల్యాండరింగ్,వరకట్న మరణం, తీవ్రవాదం, రేప్ కేసుల్లో జీవిత ఖైదు విధించిన వారికి క్షమాభిక్ష వర్తించదని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. కానీ ప్రస్తుత ఈ కేసులో మార్గదర్శకాలు ఉల్లంఘించ బడ్డాయి.
గుజరాత్ ప్రభుత్వం, తన 1992 క్షమాభిక్ష పాలసీ ఆధారంగా ఈ నేరస్థులను విడుదల చేసింది. న్యాయ వ్యవస్థే వారిని విడుదల చేయమని కార్యనిర్వహక శాఖకు చెప్పినట్లుగా చెపుతున్నారు. నేరస్థులలో ఒకడైన రాధేశ్యామ్ షా తనను నిర్ణీత కాలానికి ముందుగానే విడుదల చేయాలని గుజరాత్ హైకోర్టును గతంలోనే ఆశ్రయించాడు. విచారణ మహారాష్ట్రలో చేపట్టారు కాబట్టి ఆ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చాలి గానీ, గుజరాత్ ప్రభుత్వం కాదని, అతని విజ్ఞప్తిని గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు అతని విజ్ఞప్తిపై చెప్పిన అభిప్రాయాన్ని మే 2022లో సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, ''కొన్ని అసాధారణ పరిస్థితుల్లో'' కేసును మహారాష్ట్రకు మార్చారు, వాస్తవానికి నేరం జరిగింది గుజరాత్ రాష్ట్రంలో కాబట్టి, క్షమాభిక్ష కోసం రాధేశ్యామ్ షా చేసిన విజ్ఞప్తిని నిర్ణయించాల్సింది గుజరాత్ ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ క్షమాభిక్ష ఉత్తర్వులను సుప్రీంకోర్టే జారీ చేసిందని అనే పరిస్థితి లేదు.
నిర్భయ కేసులో వలే మరణశిక్ష విధించవలసిన నేర తీవ్రతను పరిగణలోకి తీసుకొని కార్యనిర్వహక శాఖే అతని విజ్ఞప్తిని నిరాకరించాల్సింది. కానీ గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్, అప్పటికే రాష్ట్రంలో ఉనికిలో ఉన్న 1992 పాలసీ ఆధారంగా క్షమాభిక్ష ను ఆమోదించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే... 2012లో నిర్భయ గ్యాంగ్ రేప్‌కు గురైనప్పుడు, ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నేరస్థులను ఉరి తీయాలని వీధుల్లో అరుపులు, పెడబొబ్బలు పెట్టారు. కానీ బిల్కిస్ బానో కేసులో మాత్రం అలాంటి ఆగ్రహజ్వాలలు ఎక్కడా కనిపించడం లేదు. అయినప్పటికీ, జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు లలితా కుమార మంగళం లాంటి భారతీయ జనతాపార్టీ సభ్యులు కొంతమంది, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ అసంతృప్తిని బహిరంగం గానే వ్యక్తీకరించారు.
కానీ నేరస్థుల క్షమాభిక్షకు మద్దతు కూడా చాలా బలంగానే ఉంది. వారు విడుదలైనప్పుడు, వారిని పోరాట యోధులుగా భావిస్తూ, విశ్వహిందూ పరిషత్ సభ్యులు వారిని పూలదండలతో ఆహ్వానించారు. వారికి క్షమాభిక్షను ఆమోదించిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన ప్యానల్ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నవారే. నేరస్థులైన వ్యక్తులందరూ బ్రాహ్మణులే, వారికి సంస్కార విలువలు ఉన్నాయి, అసలు వారు ఈ నేరం చేశారా అనే అనుమానం కలుగుతుందనీ, ఆ ప్యానల్ సభ్యుడైన ఒక బీజేపీ ఎంఎల్ఏ అభిప్రాయపడ్డాడు.
క్షమాభిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు స్వీకరించినప్పుడు, న్యాయమూర్తులలో ఒకరు చాలా ఆశ్చర్యానికి గురై, ఈ చర్య చాలా దారుణమైనది అంటేనే క్షమాభిక్ష తప్పు అని అనుకోవాలని అన్నారు. వివిధ వర్గాల నుండి విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో, పిటీషన్ దాఖలు చేసినవారు ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు.
క్షమాభిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటీషన్ దాఖలు చేసిన వారిలో సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీ, సుభాషిణీ అలీ ఉన్నారు. కార్యసరళికి సంబంధించిన అనేక ఖాళీలు ఉన్నాయని పిటిషన్ ఎత్తి చూపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 435 ప్రకారం, ముఖ్యంగా కేసును సీబీఐ విచారించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరవలసి ఉండాల్సింది. ఆ తరువాత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 433(2) ప్రకారం, క్షమాభిక్ష ప్రసాదించడానికి ముందు శిక్షను విధించిన జడ్జి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని కొన్ని షరతులకులోబడి మాత్రమే ఉపయోగించవలసి ఉంటుందనే విషయాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. బిల్కిస్ బానో కేసులో కేంద్ర ప్రభుత్వం, తీర్పు వెలువరించిన జడ్జి అభిప్రాయాలను పరిగణలోకి తీసు కోవాల్సిన అవసరం ఉంది. ఆసక్తికరంగా, ముంబై సిటీ సివిల్, సెషన్స్ కోర్టులో తీర్పు చెప్పిన జడ్జి జస్టిస్ (రిటైర్డ్) యూ.డీ.సాల్వీ తన అభిప్రాయా లను కోరలేదని చెప్పారు. ఈ నేరస్థులకు క్షమాభిక్షను ప్రసాదించడానికి జస్టిస్ సాల్వీ వ్యతిరేకం అనీ, వారిలో ఏ విధమైన పశ్చాత్తాపం (సాధారణంగా క్షమాభిక్షను మంజూరు చేసే సమయంలో పరిగణలోకి తీసుకునే అంశం) కనిపించలేదని జడ్జీ గారు అన్నట్లు సుభాషిణీ అలీ 'ఫ్రంట్ లైన్'తో అన్నారు. ''గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్లో అనేక మంది నిష్పక్ష పాతంగా లేని భారతీయ జనతాపార్టీ సభ్యులే ఉన్నారని'' ఆమె అన్నారు.
నష్టపరిహారంగా 50లక్షల రూపాయలు, ఒక ఇల్లు, ఉద్యోగం బిల్కిస్ బానోకు ఇవ్వాలని 2019లో సుప్రీంకోర్టు ఆదేశించింది. బానో తనకు రావాల్సిన నష్టపరిహారం కోసం పోరాడాల్సి వచ్చిందనీ, ఆమెకు ఇస్తామని చెప్పిన ఇల్లు, ఉద్యోగం ఇంత వరకు ఇవ్వలేదని సుభాషిణీ అలీ అన్నారు. సుభాషిణీ అలీ ''సంస్కార బ్రాహ్మణులు'' అనే మాటను ఉదహరిస్తూ, వారు మెజారిటీ మతానికి చెందిన బ్రాహ్మణులు కాబట్టి వారికి క్షమాభిక్ష ఇవ్వవచ్చా అని అడిగింది. ఇదే విధమైన ధోరణి హత్రాస్‌లో జరిగిన రేప్, హత్య కేసులో కనిపించింది. బాధితురాలు వాల్మీకి కులానికి చెందినది. ఆమెను రేప్ చేసింది ఠాకూర్లు. వారికి రక్షణ కల్పించింది రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమని సుభాషిణీ అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గుజరాత్‌కు పంపించింది కానీ క్షమాభిక్ష ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పలేదని, భారత ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారని పిటిషన్ విచారణ సమయంలో సుభాషిణీ అలీ చెప్పారు. క్షమాభిక్ష మంజూరు అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు సృష్టిస్తుందని సుప్రీంకోర్టుకు తెలుసని ఆమె అన్నారు. వారు పిటిషన్‌పై స్పందించి, వీలైనంత త్వరగా విచారణకు తేదీని నిర్ణయిస్తారని ఆమె ఆశించింది. పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ అయ్యింది. పదకొండు మంది నేరస్థులకు కూడా నోటీసులు పంపారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష ఉత్తర్వులను సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది, గతంలో అనేక కేసులను సుప్రీంకోర్టు సమీక్షించిన సందర్భాలు ఉన్నాయి.
నేరస్థులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేశారు. కానీ వారు విడుదల అయిన తరువాత వారిని స్వాగతించిన తీరు, దేశానికి గొప్ప సేవలందించిన దేశభక్తులను స్వాగతించిన విధంగా ఉంది. ఈ కేసులో వ్యక్తిగతమైన అంశాలను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ అసలు పరిగణలోకి తీసుకుందా? అని, సుప్రీంకోర్టు న్యాయవాది కీర్తీ సింగ్ ఆశ్చర్యపోయింది. సమాజంపై పెద్దగా ప్రభావం చూపనటువంటి వ్యక్తిగతమైన నేరమేనా ఇది? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షను ఇచ్చేముందు నిర్ణయం చేయాలని (లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా) సుప్రీం కోర్టు ఆదేశించిందని ఆమె అన్నారు. ఇది మైనారిటీలను లక్ష్యం చేస్తూ, హత్యలతో కూడిన ద్వేషపూరిత నేరమని ఆమె అభిప్రాయపడింది. తాను మరణ శిక్షను అంగీక రించనని, అంటే ఘోరమైన ప్రమాదాలతో బాధపడే బాధితురాలి కేసులో జీవిత ఖైదును తగ్గించ మని అర్థం కాదని, అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘానికి (ఐద్వా) న్యాయ సలహాదారు, ఉపాధ్యక్షు రాలు కూడా అయిన కీర్తీ సింగ్ అభిప్రాయపడ్డారు.
క్షమాభిక్షను వ్యతిరేకిస్తూ మాజీ హౌం సెక్రటరీ జీ కే పిళ్ళై, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శులు శివశంకర్ మీనన్, సుజాతా సింగ్, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్లతో పాటు 130మంది మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సివిల్ సర్వెంట్స్ భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక బహిరంగ లేఖరాశారు. ''క్షమాభిక్షను రద్దు చేయాలని, 11 మంది నేరస్థులు వారి శిక్షలను పూర్తి చేయా లని వారన్నారు.'' భయంకరమైన తప్పుడు నిర్ణయాన్ని సవరించాలని వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
- టీ.కే.రాజ్యలక్ష్మి
అనువాదం: బోడపట్ల రవీందర్,
సెల్:9848412451