Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల, వ్యవసాయ కార్మికుల జీవన భృతి, ప్రయివేటీకరణ, కార్మిక వర్గంపై దాడులు, మొత్తంగా ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య హక్కులపై మోడీ ప్రభుత్వం జరుపుతున్న దాడి గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. సెప్టెంబరు 14 నుండి 24 వరకు సాగే ఈ ప్రచారం ప్రధానంగా ఈ అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడంపైనే దఋష్టి కేంద్రీకరిస్తుంది. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన డిమాండ్లు, ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి పెడుతుంది. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను కూడా ప్రచార సమయంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.
ధరల పెరుగుదల సమస్య ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. ఆగస్టులో విడుదలైన తాజా గణాంకాలను చూసినట్లయితే రిటైల్ ద్రవ్యోల్బణం మళ్ళీ 7శాతాన్ని తాకింది. టోకు ద్రవ్యోల్బణం దాదాపు 15శాతం దగ్గరే తిరుగుతోంది. వివిధ సెస్సులు, సర్‌చార్జీల కారణంగా పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర పన్నుల భారం పెరిగిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి ఇదే ప్రధాన కారణంగా ఉంది. ప్రస్తుతం, పెట్రోల్‌పై లీటరుకు రూ.28ని కేంద్రం వసూలు చేస్తుండగా, డీజిల్‌పై లీటరుకు రూ.22 వసూలు చేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో సెస్సును రూ.10 తగ్గించిన తర్వాత పరిస్థితి ఇది.
గత ఆర్థిక సంవత్సరం 2021-22లో పెట్రోలియం ఉత్పత్తులపై కేవలం సెస్ ద్వారా రూ.4లక్షల కోట్లకు పైగా మొత్తాలను కేంద్రం ప్రభుత్వం వసూలు చేసింది. కార్పొరేట్లు, సంపన్నులపై పన్నులు తగిన మొత్తంలో వేయడానికి మోడీ ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు వడ్డించడం ద్వారా ఆదాయాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ఆధారపడుతోంది. ఈ వర్గ విధానం వల్ల మరింత ఆదాయాల సముపార్జన కోసం ప్రజలను పిండేస్తున్నారు.
నిరంతరాయంగా పెరుగుతున్న ధరల నుండి ప్రజలకు ఉపశమనం కలగాలంటే, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్, సర్‌చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తప్పనిసరి. గోధుమ పిండి, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు వంటి ప్యాక్డ్ ఆహార ఉత్పత్తులపై విధించిన 5శాతం జీఎస్టీని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి ఉంది.
గత ఎనిమిదేండ్లలో తగిన రీతిలో ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోవడం అతిపెద్ద వైఫల్యం. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ అందుకు విరుద్ధంగా తీవ్రమైన నిరుద్యోగం ముఖ్యంగా యువతలో మరీ ఎక్కువగా ఉంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ప్రకారం, 20-24 ఏండ్ల వయస్సు వారిలో ఈ నిరుద్యోగ రేటు ఏకంగా 42శాతంగా ఉంది.
కొత్త ఉద్యోగాలను సృష్టించడం, దాదాపు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం తక్షణమే తీసుకోవాల్సిన అత్యవసర చర్యలుగా ఉన్నాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద ఉపాధి కోరుకునే ప్రతీ వ్యక్తికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జులై వరకు, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద ఉపాధి కోరుకునే 7.26కోట్ల మందిలో 20శాతం మంది అంటే 1.47కోట్ల మందికి పని ఇవ్వడానికి తిరస్కరించారు. ముందుగా దీన్ని పరిష్కరించాల్సి ఉంది. ఇందుకోసం కావాల్సింది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలు, వేతనాలు పెరగడం. అదే సమయంలో, సాధ్యమైనంత త్వరలో జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం కూడా ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున ప్రయివేటీ కరించేందుకు మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రైవ్ చేపడుతోంది. 2014 నుండి, కేంద్ర ప్రభుత్వం రూ.3.63 లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను (పూర్తిగా లేదా పాక్షికంగా) విక్రయించింది. ఇది, ఉద్యోగాలు నష్టపోవడానికి దారి తీసింది. దేశ, విదేశాల్లోని కార్పొరేట్లు మరింత సంపన్నులు కావడానికి మార్గం వేసింది. ఈ ప్రయివేటీకరణ డ్రైవ్‌ను మరింత ముమ్మరం చేస్తూ, బీజేపీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపి)ను రూపొందించింది. దేశంలోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన బడా ఆస్తులను ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెట్టడం ద్వారా రూ.6లక్షల కోట్లను సముపార్జించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. విద్యుత్ సవరణ బిల్లు ఆమోదించబడితే, విద్యుత్ పంపిణీ ఇక ప్రయివేటుపరం కావడానికి దారి తీస్తుంది. ఫలితంగా విద్యుత్ చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.
ప్రభుత్వం రంగంపై ఇలా దాడి చేయడంతో పాటూ నాలుగు లేబర్ కోడ్లను ఆమోదించడం ద్వారా కార్మిక వర్గం హక్కులపై కూడా దాడి చేస్తోంది. ఉద్యోగులను అవసరమైనపుడు నియమించుకునే, అవసరం లేనప్పుడు తొలగించే హక్కులను యజమానులకు కట్టబెడుతూ, పని గంటలు పెంచడానికి అనుమతినిస్తూ, కనీస వేతనాలను నిర్థారించే తీరును మార్చడం వంటి చర్యలను ఆ కార్మిక చట్టాల్లో పొందుపరిచింది. మొత్తంగా కార్మికుల నిర్వహణపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ కార్మిక చట్ట అమలు యంత్రాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తోంది.
ప్రయివేటీకరణ ప్రమాదాలు, దానివల్ల ప్రజల మౌలిక హక్కులు ఏ విధంగా దెబ్బతింటున్నాయో ప్రజలకు తెలియచేయడం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతున్న పోరాటాలకు మద్దతుగా ప్రజలను సమీకరించడం సెప్టెంబరు ప్రచారోద్యమంగా లక్ష్యంగా ఉంది. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కోవడానికి దారి తీసిన చారిత్రక రైతాంగ పోరాటం తర్వాత, వివిధ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన ప్రాతిపదిక కల్పించే అంశం, పెరుగుతున్న రుణ భారం సమస్య అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. వ్యవసాయ కార్మికులకు, వేతనాలు తక్కుగానే ఉన్నాయి. వారికి లభ్యమయ్యే పని కూడా గణనీయంగా తగ్గిపోతోంది.
వ్యవసాయ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతుతో సహా రైతుల, వ్యవసాయ కార్మికుల డిమాండ్లపై ఈ ప్రచారం దృష్టి పెడుతుంది. మోడీ ప్రభుత్వం అనుసరించే నయా ఉదారవాద విధానాల ఫలితంగా, పైగా దీనికి తోడు ప్రజాస్వామ్యంపై, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై పూర్తి స్థాయిలో దాడి చేయడం వల్లనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. పూర్తి స్థాయి నిరంకుశ ప్రభుత్వాన్ని కొనసాగించడం ద్వారా మితవాద ఆర్థిక విధానాలు, మతోన్మాద ఎజెండా అమలుకై మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతీ ప్రజాస్వామ్య హక్కు, పౌరుల పౌరహక్కులు ఉల్లంఘించ బడుతున్నాయి. పైగా ఆ ఉల్లంఘనలకు రక్షణ కూడా కల్పించబడుతోంది. యుఎపిఎ, దేశద్రోహం క్లాజులు వంటి నిరంకుశ చట్టాలను ఉపయోగించడం ద్వారా రాజకీయ, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇ.డి, సిబిఐ, ఆదాయ పన్ను వంటి కేంద్ర సంస్థలను... ప్రతిపక్ష నేతలకు, ప్రతిపక్షాల పాలనలోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళల హక్కులు దాడులకు గురవుతున్నాయి. పార్లమెంట్‌ను ప్రతీసారీ కించపరుస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు గళమెత్తి ప్రజల సమస్యలను ప్రస్తావించే అవకాశం కల్పించడం లేదు. అన్ని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసే ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్య రక్షణ, అన్ని రంగాల్లో పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడంపై ఈ ప్రచారోద్యమం దృష్టి కేంద్రీకరించనుంది.
కార్మికుల డిమాండ్లను ముందుకు తీసుకువస్తూ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం రక్షణకై పిలుపిస్తూ, నయా ఉదారవాద హిందూత్వ పాలనకు ప్రత్యామ్నాయ విధానాలను కూడా పార్టీ ముందుకు తీసుకురానుంది. గత ఆరేండ్లలో రికార్డు స్థాయిలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ విద్యా, ఆరోగ్య వ్యవస్థలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎలా బలోపేతం చేసింది? ప్రజా పంపిణీ వ్యవస్థను, 'మావెలి' స్టోర్ల యంత్రాంతాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే కేరళలో ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఎలా ఉంది? వంటి విషయాలను కూడా ప్రచారం చేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడానికి బదులుగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎలా పునరుద్ధరించిందీ, పారిశ్రామిక, వ్యవసాయ కార్మికులకు కేరళ ప్రభుత్వం అధిక కనీస వేతనాలను ఎలా అమలు చేస్తోంది? వంటి విషయాలన్నింటిని ఈ ప్రచారంలో ప్రముఖంగా వివరించనున్నారు.
బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలన్న విజ్ఞప్తులు, డిమాండ్లు పెరుగుతున్న సమయంలో సెప్టెంబరు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రతిపక్షాల నేతలందరూ కృషి చేస్తున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవడం అవసరమనే భావన, చైతన్యం కూడా రాన్రాను పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వివిధ సమైక్య పోరాటాలు సాగడమే ఇందుకు కారణం. సంయుక్త కిస్తాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో రైతులందరూ సమైక్యంగా సాగించిన పోరాటం, కేంద్ర కార్మిక సంఘాల నుండి ఐక్య ప్రతిఘటన పెరుగుతుండడం, వివిధ రాష్ట్రాల్లో ఇతర ఐక్య ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ కలిసి ఐక్య ప్రతిపక్షం ఉండాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న అంశాలపై వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా విస్తృత పోరాటాలు సాగించాలి. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా విశాల ఐక్య వేదిక ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాలు, ఆర్థికాంశాలే కాదు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని రక్షించడానికి విస్తృత ఐక్య వేదికలు అభివృద్ధి చెందాల్సి ఉంది. వివిధ వేదికల వ్యాప్తంగా ప్రజల ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడగల రీతిలో పార్టీ స్వతంత్రంగా సాగిస్తున్న ప్రచారమే ఈ సెప్టెంబరు ప్రచారోద్యమం.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం