Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు వరప్రధాయినిగా భావించిన మూసీనది నేడు దుఃఖదాయినిగా మారింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే ముగించబడిన ప్రస్థానం మూసీది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల గొంతు తడిపి బీడుబారిన భూములకు పచ్చదనాన్ని అద్దింది. చారిత్రక అనుబంధం కలిగి ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకొని పరవళ్లు తొక్కింది. 40ఏండ్ల క్రితం ఎంతో స్వచ్ఛతను సంతరించుకున్న మూసీ నీరు ఇప్పుడెందుకు కాలకూట విషంగా మారింది. దీనికి కారకులెవరు? పాలకుల బాధ్యత ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు వెతకటమే కాదు, ఎదురు తిరిగి నిలదీయకుంటే ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అంధకారమవుతుంది.
కాలుష్యానికి కారణమేమిటి?
ప్రతిరోజు మూసీలో వందలాది పరిశ్రమల వ్యర్థాలు, రసాయన పదార్థాలు కలుస్తున్నాయి. ఫార్మా కంపెనీలు ఇష్టానుసారంగా వదిలిన ఔషద వ్యర్థాలు, పటాన్చెరువు, జీడిమెట్ల, నాచారం పారిశ్రామిక ప్రాంత కెమికల్స్, మూసీ వెంట వెలసిన కంపెనీల వేస్టేజి మూసీలో కలుపుతున్నారు. అలాగే తీవ్ర జనసాంద్ర కలిగిన హైదరాబాద్ నగరం మురికి నీరు, మానవ వ్యర్థాలు, డిటర్జెంట్ నీళ్ళు, చెత్తాచెదారంతో మూసీ తన ఉనికిని కోల్పోయి డంపింగ్ యార్డుగా మారిపోయింది. రెండేండ్ల క్రితం దాదాపు 350 మిలియన్ల లీటర్ల కాలుష్యం మూసీలో కలిసేది. ఇప్పుడది క్రమంగా పెరిగి 1625 మిలియన్ లీటర్లకు చేరుకుంది. ఈ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషద పదార్థాల (ఏపీఐ) ఆనవాళ్ళు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. యాంటీ బయాటిక్స్ (బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వాడే మందులు) యాంటీ డిప్రెసెంట్లు ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. నీటిలో 0.3 మి.గ్రా.లు ఉండవలసిన బయోకెమికల్ ఆక్సిడెంట్లు 172 ఎం.జి.ల నుండి 185 ఎం.జి.ల వరకు చేరాయి. ఈ పరివాహక ప్రాంతంలో 70కి.మీ. దాకా నీరు కలుషితం అయింది. 40 లీటర్ల లోతుల్లో కాలుష్య కారకాలు ఉన్నాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ ''ఫార్మా స్యూటికల్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్ రివర్స్'' పేరుతో అధ్యయనం చేసి 140 దేశాలలోని 258 నదులలో నీటి పరీక్షలు నిర్వహించింది. మనదేశంలోని యమున, మూసీ నదుల నీళ్ళను పరిశీలించి ప్రపంచంలోని డేంజరస్ నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉన్నదని ''ది ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్'' అనే జర్నల్‌లో వివరాలు ప్రచురించింది.
అనేక అధ్యయనాల ప్రకారం ఈ నీటి ద్వారా ప్రజారోగ్యం దెబ్బతిని రకరకాల క్యాన్సర్లు, కిడ్నీ జబ్బులు, చర్మ వ్యాధులు, గర్భస్రావాలు, ఆర్థరైటిస్, గొంతునొప్పి, కడుపునొప్పులతో పాటు అంతుచిక్కని వింత వ్యాధులతో వెలకట్టలేని నష్టం జరుగుతుందని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తెలిపారు.
మూసీపైనే ఆధారపడిన బతుకులు
ఒకవైపు తమ ఆరోగ్యం దెబ్బతింటున్నా గత్యంతరం లేక దశాబ్దాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మూసీపై ఆనకట్టలు నిర్మించి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, భీమలింగం, ఆసిఫ్‌నగర్ కాల్వల ద్వారా పంటలు పండించుకొని బతుకెళ్ళదీస్తున్నారు. ప్రధానంగా పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట, ఆత్మకూరు, మోత్కూరు మండలాల్లో వందకుపైగా గ్రామాల్లో వరి, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పాడి పరిశ్రమ, మత్స్యసంపద కూడా ఇక్కడ జీవనాధారంగా ఉన్నది. అనేక అధ్యాయనాల్లో తేలిన అంశాలను బట్టి పండించిన పంటలతో పాటు పాలు, మత్స్య సంపదలో కూడా హానికరమైన విషపదార్థాలు ఉన్నాయని తెలిపారు. క్రమేపి ఈ ప్రాంతంలో పండిన పంటలు, చేపలు, పాలు వాడటానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూసీయేతర ప్రజలు ఈ పంటలను నిరాకరిస్తున్నారు. ఈ స్థితి రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ పరిణామాలతో ప్రజల ఆరోగ్యమే కాదు, ఆదాయమూ దిగజారుతున్నది.
ప్రక్షాళన చర్యలు -
ప్రత్యామ్నాయ మార్గాలు - పాలకుల బాధ్యత
ఇంత జరగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలే తీసుకుంటున్నాయి. ప్రక్షాళన పేరిట హైదరాబాద్‌లో కొన్ని చోట్ల నీటి శుద్ధి కేంద్రాలు పెట్టి చేతులు దులుపుకున్నాయి. నిత్యం 1500 మిలియన్ లీటర్ల మురుగు, మానవ వ్యర్థాలు వెలువడుతుంటే ఎస్.టి.పి.ల ద్వారా కేవలం 750 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధి చేస్తున్నారు. మిగతా మురుగంతా మూసీలోనే కలస్తుంది. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా నష్టపరిచే భయానక రసాయనాలు మూసీలో కలుపుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొద్దు నిద్ర నటిస్తున్నది. మూసీపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా హైదరాబాద్ మేరకు పరిమితమై పనిచేస్తున్నది. అదికూడా ప్రక్షాళన వదిలి సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నది. దీనివల్ల ఉపయోగం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రాంత ప్రజల బతుకులను గాలికి వదిలేసి తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నదుల ప్రక్షాళనకై ఎన్.ఆర్.సి.పి. (జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక) జలశక్తి అభియాన్ లాంటి పథకాలు ఉన్నా మూసీ ప్రక్షాళనకు నయా పైసా విదిల్చిడం లేదు. తెలంగాణ మూసీ ఫ్రంట్ ఎనిమిదివేల కోట్లకు ప్రతిపాదనలు పంపి యేండ్లు గడుస్తున్నా నిధులు మంజూరు చేయకుండా కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ప్రతియేటా కేంద్ర బడ్జెట్లో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్.ఎం.సి.జి.) పేరుతో ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. గంగా ప్రక్షాళనకు వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం మూసీపై ఎందుకు వివక్ష చూపిస్తుందో కేంద్రాన్ని నిలదీయాల్సివున్నది. తెలంగాణ ప్రాంత బీజేపీ ఎం.పి.లు, నేతలు మూసీ ప్రక్షాళనపై సమాధానం చెప్పాలి.
మూసీ ప్రక్షాళనకు పోరాటమే మార్గం
యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ప్రక్షాళనకై, ప్రత్యామ్నాయంగా గోదావరి - కృష్ణా జలాల సాధనకై జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. పలుమార్లు సెమినార్లు, చర్చాగోష్టులు జరిగాయి. సీపీఐ(ఎం) పోరుయాత్ర పేరుతో 10 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 89 గ్రామాల్లో ఊరూరా సభలు, ఊరేగింపులు నిర్వహించి వేలాదిమందిని చైతన్యపరిచింది. లక్ష సంతకాల సేకరణ కోసం అనేక గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి సంతకాలు చేయించడం, గ్రామాల్లో సామూహిక నిరసనలు చేపట్టడం జరిగింది. జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు నీటిని మూసీ కాల్వలోకి మళ్ళిస్తే కాలుష్యం నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. దీనికనుగుణంగా ప్రభుత్వం సర్వే నిర్వహించాలి. ఈ సమస్యల పరిష్కారాని జరిగే ఆందోళనా పోరాటాల్లో ప్రజలు మహోద్యమంగా కదలాలి. పాలకుల మెడలు వంచి మూసీ కాలుష్య ప్రక్షాళన సాధించుకోవాలి.
- యం.డి.జహంగీర్
సెల్ 9490098379