Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బౌద్ధులు ఏ పుస్తకానికో, వ్యక్తికో బానిసలు కారు. బుద్ధుని అనుసరించడమంటే... తమ ఆలోచనా స్వేచ్ఛను వదులుకోవడం కాదు. స్వేచ్ఛగా బుద్ధుని మార్గంలో ఆలోచించి, జ్ఞాన ప్రపూర్ణులై తాము కూడా బుద్ధులు కావచ్చు. బుద్ధులు కాగల సామర్థ్యం అందరిలోనూ ఉంది. ప్రయత్నించి సాధించాలి!'' అని WHAT IS BUDDISM? గ్రంథంలో నాద మహాథేరో అంటారు.
బుద్ధ వచనంలో గౌతమ బుద్ధుడు బోధించిన దశ శీలాలు ఈ విధంగా ఉన్నాయి. 1. హింసను ఆపండి. ఇతర జీవులకు ప్రాణహాని తలపెట్టకుండా నిగ్రహించుకోండి. 2. మీకు ఎవరూ ఇవ్వనిది, మీకు మీరే తీసుకోకుండా నిగ్రహించుకోండి. 3. స్వచ్ఛతతో, నిజాయితీగా బతకండి. ఎల్లప్పుడూ మెలకువతో మెలగండి. 4. అబద్దాలు చెప్పకుండా నిగ్రహించుకోండి. 5. సత్యం మాట్లాడండి. అదే నమ్మదగింది. అదే ఆధారపడదగింది... అనే విషయం రుజువు చేసుకోండి! కానీ, పరస్పర విరుద్ధమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకండి!! 6. ఇతరుల గూర్చి చెడుగా మాట్లాడకుండా, వారిపై దుష్ప్రచారం చేయకుండా నిగ్రహించుకోండి! 7. మైత్రిని ప్రేమించండి. మైత్రి పెంపొందించే మాటలు మాత్రమే మాట్లాడండి. విద్వేషాలు విడనాడండి. విద్వేషాలు రేకెత్తించే మాటలు మాట్లాడకండి. 8. ఇతరుల మనసులు గాయపరిచే దురుసు మాటలు మాట్లాడకండి. 9. వ్యర్థ సంభాషణలు వదిలేయండి. ఖచ్చితమైన, సున్నితమైన, సభ్యమైన మాటలు మాత్రమే ఎన్నుకుని జాగ్రత్తగా మాట్లాడండి. 10. అర్థవంతమైన, సవివరమైన పద్ధతిలో మీ వాదనను స్పష్టంగా వివరించండి.
- గౌతమ బుద్ధుడు,
(సుత్తపిటక - దీర్ఘనికాయ -బ్రహ్మ జాల సుత్త)
(ఈ దశ శీలాలు ప్రపంచ మానవులందరి కోసం చెప్పినవి. అయితే ప్రత్యేకించి మన దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, వారి పార్టీ ప్రముఖులూ పాటిస్తే... దేశం కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండేది!)
బుద్ద - ధమ్మ - సంఘం : ఇవి త్రి రత్నాలు. బౌద్ధులయిన వారు విధిగా వీటి శరణు పొందాలి. అందుకే వీటిని 'త్రిశరనాలు' అని కూడా అన్నారు.
1. బుద్ధ లేక బోధి అని అంటే,SUPREME KNOWLEDGE - TREE OF WISDOM. అత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు గనుకనే గౌతముడు బుద్ధుడయ్యాడు. తన కన్నా ముందు ఇంకా చాలా మంది బుద్ధులు ఉన్నారని స్వయంగా బుద్ధుడే చెప్పాడు. బుద్ధుడు వినయశీలి గనక, తన గూర్చి తాను గొప్పగా చెప్పుకోకుండా, తన కంటే ముందే జ్ఞాన సముపార్జన చేసిన వారున్నారని చెప్పి ఉంటారు. బోధిస్థితిని సాధించిన వారందరిలోకి మహావ్యక్తి బుద్ధుడే... అందువల్ల ఈ జగత్తు ఆయనను బుద్ధుడిగా గుర్తుపెట్టుకుంది. మానవుల దుఃఖ విముక్తికి దారి చూపినవాడు గనక, ఈ ప్రపంచం దృష్టిలో ఆయన బుద్ధుడయ్యాడు.
2. ధమ్మ అంటే, ప్రకృతి నియమానికే ధమ్మ (ధర్మం) అని అర్థం. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది అధర్మం అవుతుంది. తధాగతుడు - ఏది ఎలా ఉంటే అలా దాని ప్రకారం నడుచుకునేవాడు.. అని అర్థం. ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకునేవాడు గనక బుద్ధుడికి 'తధాగతుడు' అని పేరు. శాక్య వంశానికి చెందిన వాడు గనక, ముఖ్యంగా మునిలాగా జీవించిన వాడు గనక, ఆయనను 'శాక్యముని' అని కూడా పిలుచుకున్నారు.
3. సంఘం: మనిషి సంఘజీవి. బౌద్ధ మార్గాన్ని అనుసరిస్తూ, మనసును నిర్మలంగా ఉంచుకుంటూ, అంకిత భావంతో, నిబద్ధతతో సమాజానికి మేలు చేసే పనులలో నిమగం కావాలి!
వ్యక్తిగతంగా తన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన బోధనల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలన్నాడు బుద్ధుడు. బోధి స్థితికి చేరాలన్నా, నిర్వాణ దశకు చేరాలన్నా ఎవరికి వారు కృషి చేయాల్సిందేనని కూడా చెప్పాడు. జీవితంలో తను ఆచరించిన అంశాలే బుద్ధుడు ఇతరులకు బోధించాడు. స్వీయ పరిశీలనలో తాను తెలుసుకున్న విషయాలు, గ్రహించిన అంశాలు మాత్రమే తన శిష్యులకు, అనుచరులకూ బోధించాడు. దుఃఖం అనే తిమిరం నుండి 'నిబ్బాణం' (నిర్వాణం) అనే వెలుగువైపు నడిచే మార్గాన్ని బుద్ధుడు ప్రభోదించాడు. తను కేవలం దారి చూపగలవాడినే కానీ, మోక్షదాతను కాదన్న వాస్తవాన్ని స్పష్టం చేశాడు.
బుద్ధుణ్ణి 'భగవాన్ బుద్ధ' - అని కొందరు పిలుస్తుంటారు. మానవ మాత్రుడైన వాణ్ణి భగవాన్ అని పిలవడమేమిటీ? అని కొందరికి అనుమానం రావొచ్చు. భగవాన్ - అంటే అసలైన అర్థం రాగద్వేషాల్ని, మోహాల్ని భగం చేసుకున్నవాడు - అని అర్థం! భగవాన్ - అనేది బుద్ధుడికి ఉన్న బిరుదు. వైదిక - బ్రాహ్మణ - హిందూ ధర్మం చెప్పే భగవాన్‌కు, బౌద్ధం చెప్పే భగవాన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ముందు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వైదిక ధర్మం ప్రకారం భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆదీ అంతం లేనివాడు. ఈ సృష్టి రచన చేసినవాడు. జగద్రక్షకుడు. మహిమలు గలవాడు. పాప పుణ్యాలు లెక్కగట్టుకునే వాడు. ఎప్పుడూ ఎక్కడా కనబడని వాడు. మనిషి మెదడులో సృజించబడ్డవాడు - ఇలా ఎన్నో అర్థాలున్నాయి! కానీ, బుద్ధుడు అలా కాదు. వాస్తవంగా ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి. రాజ్యాన్ని, సర్వ సుఖాల్ని త్యజించి, సత్యాన్వేషణకు అడవుల్లో గడిపిన వాడు. ప్రకృతి పరిశీలనలో కొన్ని జీవన సత్యాల్ని గ్రహించిన వాడు. తాను గ్రహించిన మానవీయ విలువల్ని, జీవన సత్యాల్ని తన శిష్యులకు, అనుయాయులకు బోధిస్తూ... ఈ దేశం నాలుగు చెరగులా తిరిగిన వాడు. వైదికుల భగవంతుడు కల్పితం! బౌద్ధుల భగవాన్ యదార్థం!! రెంటికీ చాలా తేడా ఉంది. ఎవరైతే సాధన చేసి, మానసిక వికారాలు పూర్తిగా తొలగించుకుంటారో వారే 'భగవాన్' అవుతారు. అందుకు విపశ్యన ధ్యానం సాధన చేయాలని బౌద్ధం చెపుతుంది.
భదంత - అంటే భిక్షువు / భిక్కు / భగవాన్ అనే అర్థాలున్నాయి. భంతే - భగవంత అనే పదాలకు కూడా అర్థం అదే - పెద్దవారినీ, గౌరవనీయులను 'భంతే' అని పిలవాలని, చిన్నవారినీ, సమ ఉజ్జీలయిన స్నేహితుల్ని 'అవుసో' అని పిలవాలని 'మహా పరినిబ్బాన సూత్రం'లో స్వయంగా బుద్ధుడే చెప్పాడు. భిక్కు సంఘంలోకి బుద్ధుడు ప్రత్యేకించి ఎవరినీ ఆహ్వానించలేదు. బౌద్ధ భిక్కు కావడమన్నది ఎవరికి వారు తీసుకోవల్సిన నిర్ణయం. శ్రమించకుండా బతుకు వెళ్ళదీయడానికి బిక్కు కావద్దనీ, సమాజానికి సేవలు అందించే విధంగా దృఢ సంకల్పంలో ఉన్నవారు, ధర్మశీలం ఆచరిస్తూ దానిని బోధించేవారు అయితేనే, భిక్కు సంఘంలో చేరాలనీ ఆయన సూచించాడు. ఎవరో లోకరక్షకుడు ఉన్నాడన్న భ్రమలో యజ్ఞాలూ, యాగాలు చేస్తూ, తమను తాము మోసం చేసుకుంటూ లోకానికి తప్పుదోవ చూపేవాడు బౌద్ధభిక్షువు కాకపోవడమే మంచిదన్నాడు. ప్రశాంత వదనంతో సత్యాన్ని సత్యంగా, కరుణ, ప్రేమ, మైత్రితో ప్రజలకు ''జ్ఞానం'' అందించే వారు మాత్రమే బౌద్ధులవుతారనీ చెప్పాడు. నీటిలో పుట్టి పెరిగిన తామరపువ్వు, నీటిలోని మురికి అంటించుకోకుండా పైకి తేలి ఎలా నిలబడుతుందో బౌద్ధులు కూడా అదే విధంగా లౌకిక ప్రపంచపు మురికిని అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని బుద్ధుడు చెప్పాడు. (అంగుత్తర నికాయ 11-38). బుద్ధుడు చెప్పిన నైతిక విషయాలు బుద్ధుడి కంటే ముందే మరికొందరు చెప్పి ఉంటారు. కానీ, అంతవరకు ఎవరూ చెప్పని అంశం... 'శాస్త్రీయతని' జోడించి, బుద్ధుడు సంఘాన్ని నిర్మించాడు.
మనుషులలో సోదర సమానత్వ భావనల జ్ఞానాన్ని తొలిసారి కలిగించిన తాత్త్వికుడు - బుద్ధుడు. అతీత శక్తులేవీ ఉండవని స్పష్టం చేసిన భౌతికవాది. శ్రద్ధ, ఏకాగ్రత, సమర్పణ భావనల గురించి చెప్పిన ఉపాధ్యాయుడు.
జ్ఞానమే పునాదిగా గలది - బౌద్ధం!
మానసిక ఉన్నతిని సాధించడం - బౌద్ధం!!
దయ, కరుణ, నిస్వార్థం, సత్ప్రవర్తనల గూర్చి బోధించిన బుద్ధుడు, అహింసా పద్ధతుల్ని, యుద్ధ వ్యతిరేకతని ప్రపంచానికి అందించాడు. ఒక దార్శనికునిగా తను జీవించిన కాలానికి అతీతంగా ఆలోచించి, శీలాన్ని, ప్రగతిశీల ఆలోచనా ధోరణిని ప్రపంచానికి చాటి చెప్పిన నాగరికుడు. బుద్ధుడిని మించి శాంతిమార్గం చూపిన ప్రపంచ శాంతి కాముకుడు మరొకరు లేరు.
పన్నెండవ శిలాశాసనంపై అశోకుడు ఒక చక్కని మాట చెక్కించాడు. ''ఎవరైతే తాము నమ్మిన ధర్మాన్ని వ్యాప్తి చేయాలని ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతారో, వారు నిజానికి తమ ధర్మానికే నష్టం కలిగిస్తారు'' అని! బౌద్ధ బహుజన చక్రవర్తి అశోకుడు బ్రాహ్మణులకు, జైనులకు, అజీవకులకు ఎంతో ఉదారంగా దాన ధర్మాలు చేశాడు. అశోకుడు గానీ, అతని తర్వాత వచ్చిన ఇతర బౌద్ధ చక్రవర్తులు గానీ ఇతర మతాలను, ఇతర ధర్మాలను ద్వేషించలేదు. వాటిని నాశనం చేయాలని ప్రయత్నించలేదు. కానీ, బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శృంగుడు, అతని వారసులు బౌద్ధ భిక్షులను చంపించారు. బౌద్ధారామాలను ధ్వంసం చేయించారు. ఆ తర్వాత ఆది శంకరుడు, రామానుజుడు అనే వైదిక మత గురువులు వారి వారి కాలాలలో హిందూ తీవ్రవాదులుగా ప్రవర్తించారు. బౌద్ధ, జైన ఆరామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చడంలో ఆరితేరారు. బౌద్ధాన్ని నాశనం చేయడంలో వీరూవీరి అనుచరులు తమని తాము విజయులుగా భావించుకుని ఉంటారు. కానీ, చరిత్రలో దోషులుగా మిగిలిపోయారు. ఆ విషయాలు అలా ఉంచితే, 14 అక్టోబర్ 1956 - అశోక విజయదశమి రోజన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, తన తాడిత, పీడిత సోదర సోదరీ మణుల్ని - సుమారు మూడు లక్షల అరవై అయిదు వేల మందిని తీసుకుని - నాగపూర్‌లో బౌద్ధం స్వీకరించారు. మనుషులుగా గుర్తించని హిందూమతంపై తిరుగుబాటు చేశారు. తరువాతి తరాల వారికి సైతం, ఒక జీవన విధానాన్ని చూపించారు!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.