Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందేండ్లకు పైబడిన చరిత్రలో ఎన్నో ప్రగతిశీల ఉద్యమాలకు వారధిగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 24 సెప్టెంబర్ సాయంత్రం 4గంటలకు ఆర్ట్స్ కాలేజీ ముందు బహుజన బతుకమ్మను పారంభించుకుందాం. దీనికి ముందు ఉదయం 11గంటలకు గన్ఫార్క్లో తెలంగాణ అమరులకు నివాళులర్పించి నవతెలంగాణ నిర్మాణంలో వారి ఆశయాలు సాదిస్తామని ప్రతినబూనుదాం. ఈ ప్రారంభ సమావేశానికి సామాజిక విప్లవకారులు మహాత్మ జోతిరావు ఫూలే - సావిత్రిబాయిల ముని మనవరాలు నీతాతాయి సళే ఫూలే ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె.లక్ష్మి అధ్యక్షత వహిస్తారు.
పన్నెండేళ్ళుగా వివిధ అంశాలను లేవనెత్తుతున్న బహుజన బతుకమ్మ ఈ ఏడు ''అస్పృశ్యత - కులవివక్షలను వ్యతిరేకిస్తూ కులనిర్మూలనా'' లక్ష్యంగా జరుపుకుందామని పిలుపునిస్తున్నది. ఈ మేరకు ఎంగిలిపూల బతుకమ్మ తొలిరోజున అక్టోబర్ 25న పోలెపల్లితో మొదలై అక్టోబర్ 4న మేడారంతో ముగుస్తుంది. అందుకే ''బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవమేకాదు- ఉద్యమం'' కూడా అని ప్రకటిద్దాం...
1. బతుకమ్మ తెలంగాణ సమాజపు పంటల పండుగగా ప్రకటిస్తూ ''కల్సి ఆడుదాం - కల్సి పాడుదాం-కల్సి పోరాడుదాం'' అంటూ పిలుపునిద్దాం. ఉత్పత్తి, పునరుత్పత్తి, పిల్లల పెంపకంలో భాగమైన స్త్రీలకు అన్ని రంగాల్లో సమానహక్కులుండాలని చాటింపు వేద్దాం.
2. నవధాన్య సంస్కృతిని, తెలంగాణ తరహా ఉత్పత్తి విధానపు ప్రత్యేకతలను ఎత్తి పడుతూ ''భూమి లేని వారికి భూమి-స్వావలంబణాయుత వ్యవసాయం'' అంటూ ప్రచారం చేద్దాం.
3. ఊరూ-వాడ కల్సి తారతమ్యాలు లేకుండా రాష్ట్ర పండుగలైన బతుకమ్మ, బోనాలు కల్సి జరుపుకుందాం. దళితుల ఆలయ ప్రవేశంపై కట్టడి, ప్రకటిత-అప్రకటిత నిషేధాలను, రెండు గ్లాసుల పద్దతులను వ్యతిరేకిస్తూ, పండుగల్లో సహపంక్తి భోజనాలు చేపడుదాం.
4. పని స్వేచ్చ-నివాస స్వేచ్చ-వివాహ స్వేచ్చలను సమర్థిస్తూ పాకీ పనిలో యంత్రాలను వాడాలని, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ, ప్రోత్సాహం ఇవ్వాలని బహుజన బతుకమ్మ వేదికలపై వీరిని సగర్వంగా ఆహ్వానిద్దాం.
5. భూమిలేని దళితులకు భూమి, ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుదాం..
6.మనువాద ఉత్పత్తిగా ఉన్న పితృస్వామ్యం, అంతరాల కులవివక్ష, అస్పృష్యత, శిక్షాస్మృతి, దేవాలయ ప్రవేశ నిషేధం, అంతర్వివాహద్దతి, వంశ పారంపర్య కులవృత్తులను నిరసిస్తూ ''వృత్తి స్వేచ్చ-నివాస స్వేచ్చ-వివాహ స్వేచ్ఛలను'' ఎత్తిపడదాం. కర్మ - పునర్జన్మ భావనలు దోపిడిదార్ల కొమ్ముకాస్తాయని సాంస్కృతిక ప్రచారాన్ని చేపడుదాం. పరువు పేరిట హత్యలకు పాల్పడున్న వారిని సమాజంనుండి వెలివేద్దాం.
7. విద్యా-ఉద్యోగ-రాజకీయరంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులకై, సమాన పనికి సమాన వేతనంకై, సామాజిక న్యాయంకై పాటుపడుదాం.
8. కులానికి ముఖద్వారంగా ఉన్న స్త్రీలను కట్టడి చేయడానికి ఉద్దేశించిన అన్ని రకాల దురాచార అవశేషాలను, స్త్రీలను అంగడి సరుకుగా, విలాసవస్తువుగా చూస్తున్న భూస్వామ్య-సామ్రాజ్యవాద పోకడలను, నేరాలకు మూలమైన మధ్యం ఉత్పత్తులను, అశ్లీల చానళ్ళను తరిమి వేద్దాం.
9. మతాన్ని రాజకీయాలతో మిళితం చేసే ఏరకమైన మతతత్వమైనా సమాజాన్ని చీల్చి వెనక్కు నెడుతుంది. కావునా నేడు హిందూత్వ పేరిట సమాజాన్ని విభజించవద్దని కోరుతూ లౌకికవాదాన్ని ఎత్తిపడుదాం. కుల-వర్గ రహిత సమాజమే నిజమైన నాగరిక సమాజంగా ప్రకటిద్దాం .
తొమ్మిది రోజుల బతుకమ్మల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేద్దాం. పండుగంటే కడుపు నిండా భోజనం చేయడం మాత్రమే కాదు, కలసి భోజనం చేయడ మని ప్రకటిద్దాం. అందుకు వ్యక్తులు, సంస్థలు రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో ముందుకు రావాలని తెలంగాణ సమాజానికి పబ్బతి పడుదాం...
సెప్టెంబర్ 24, 2022 - (ఉదయం10 గంటలకు) గన్ పార్క్లో నివాళి సెప్టెంబర్ 24, 2022 - (సా. 4 గంటలకు) ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం సెప్టెంబర్ 25, 2022 - పోలేపల్లి - హకీమ్పేట్, మం. కోహ్లి, నారాయణపేట్ జిల్లా సెప్టెంబర్ 26, 2022 - ఇస్తాళ్ళపురం, సూర్యాపేట జిల్లా సెప్టెంబర్ 27, 2022 - (మ. 12 గంటలకు) మంచుప్పల, జనగాం జిల్లా సెప్టెంబర్ 27, 2022 - (సా. 4 గంటలకు) బతుకమ్మకుంట, జనగాం పట్టణం సెప్టెంబర్ 28, 2022 - గుండాల, భద్రాద్రి కొత్తగూడంజిల్లా సెప్టెంబర్ 29, 2022 - ఖాజీపురం, సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30, 2022 - వెల్మజాల గ్రామం గుండాల మం., యాదాద్రి-భువనగిరి జిల్లా అక్టోబర్ 1, 2022 - వేములవాడ, రాజన్న-సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 2, 2022 - మల్లాపూర్, హైదరాబాద్ అక్టోబర్ 3, 2022 - పిళ్ళైపల్లి, యాదాద్రి-భువనగిరి జిల్లా అక్టోబర్ 4, 2022 - మేడారం, ములుగు జిల్లా.
- విమలక్క