Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూలై పూయాల్సిన పదాలు
గాయాలై పొడుచుకొస్తున్నాయి
వాక్యమెప్పుడూ
అర్థవంతంగా కుదురుకోవటం లేదు
అసంపూర్ణ వాక్యాలు
అపసవ్యపుటర్థాలు
ఒకానొక అధివాస్తవికతే తప్ప
అందమైన కవితగా రూపుకట్టే
అవకాశమే లేదు
విషాదాంతాలో
ఆశ్చర్యార్థకాలో
వాక్యాలెప్పుడూ సమస్యాత్మకమే
సమస్యాపూరణకు తావే లేదు
చిక్కుముడుల వాక్యం చివరెప్పుడూ
కామాలూ సెమీకాలన్లు
సవాలక్ష ప్రశ్నార్థకాలు
అడుగడుగునా సమస్యల పదాలను
కూర్చుకున్న వాక్యం చివర
ఫుల్ స్టాప్‌కు చోటే లేదు
ఎప్పుడూ ఏదో వొక బ్రాకెట్లో పడి
రెక్కలు టపటపా కొట్టుకోవటమే గానీ
వాక్యం పక్షిలా ఎగిరేదే లేదు
సాఫీగా సాగిపోయే రైలు బండి కోసం
పట్టాలనెప్పటికప్పుడు
సరిచేసుకుంటూనే వున్నాం
అయినా తప్పుపోతూనే వుంది వాక్యం
- చిత్తలూరి...