Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏం తాతా ఎలాగుంది ఆరోగ్యం'' అని అడిగాడు మనవడు.
''ఏమీ సమజైతలేదురా. కాటికి కాళ్ళు జాపుకొని కూచున్నా... పైవాడు టికెట్ ఇంకా పంపలేదురా'' అన్నాడు తాత.
''అంటే పైవాడు కూడా డబ్బుల్లేంది టికెట్ ఇవ్వడా? బ్లాకులో దొరుకుతాయేమో అవ్వనడిగి కనుక్కో'' మనవడి కొంటె ప్రశ్న, సలహా రెండూ
''నాకేం ఖర్మరా, నాకు స్పెషల్గా విమానమే పంపుతాడు. యాదాద్రిలో, భద్రాద్రిలో పైసలు మస్తుగానే చదివించినా'' అన్నాడు గొప్పగా
''అయితే ముందే రిజర్వు చేసుకున్నావా'' అంటూ లోపలికి పోయాడు మనవడు.
ఏదో క్రికెట్ మ్యాచుకు టికెట్ దొరకలేదని మనవడు బాధపడుతుంటే తాతకు ఇంకో టికెట్ రాలేదని బాధ. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందో రాదో అని రాజకీయుల బాధ. ఇలా ఈ టికెట్ బాధలు రకరకాలు.
అసలు టికెట్ అంటేనే గుర్తొచ్చేది సిటీ బస్సులో కండక్టరిచ్చేదొకటి, రెండోది సినిమా టికెట్. ఈ రెండూ ఎక్కువమంది జీవితాలను అల్లుకుపోయి ఉంటాయి. విపరీతమైన రద్దీలో ప్రయాణికుల మధ్యనుండి మహా నేర్పుగా తన క్యాష్ బ్యాగుతో పాటు టికెట్ల కట్టను, పంచింగ్ మిషన్నూ పట్టుకొని టికెట్ టికెట్ అంటూ అరుస్తూ, ముందు స్టాపులో చెకింగ్ ఉంది అంటూ టికెట్ తీసుకోనివారితో కూడా తీయిస్తూ మహా చలాకీగా ఉండే కండక్టర్లతో బస్సుల్లో వాతావరణం చూశాం. ముందుకు రండి ముందుకు రండి అంటూ మనల్ని జీవితంలో ముందుకు రమ్మనే వారి లిస్టులో కండక్టరూ ఒకరు. సోదరీమణులు కూడా కండక్టర్లుగా తమ శక్తిని చాటుకున్నారు.
ఇక సినిమా టికెట్ల కథే వేరు. లైనులో నువ్వు వస్తూ ఉండు అని మా మిత్రుడు సినిమా టికెట్ కౌంటర్లో మా తలల పై ప్రయాణం చేసి ఒడుపుగా టికెట్ తెచ్చేవాడు. కౌంటర్లోకి చేయి పోతుంది కాని అది బయటకు రావడం చాలా కష్టం. వచ్చినా అందులో టికెట్లు ఉంటాయన్న నమ్మకం ఉండేది కాదు. ఒక్కొక్కరికి రెండే ఇచ్చేది. అన్ని ఒడిదుడుకుల మధ్య చూసిన సినిమాను మరువలేము. ఇక కొన్నాళ్ళకు సినిమా హాళ్ళు ఉండవు, టిక్కెట్లు అసలే ఉండవేమో అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బు తన భౌతిక రూపం నుంచి వివిధ రూపాల్లోకి మారడం చూస్తున్నాము. ఇప్పుడు టికెట్లు కూడా సాఫ్టుగా మారాయి. సెల్లులో చూపిస్తే చాలు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచును చూడ్డానికి రెండు రాష్ట్రాలనుంచీ పెద్ద క్యూలో నిలుచున్న యువతను చూస్తే వాళ్ళకున్న ఉత్సాహానికి ముచ్చట పడతాము. అక్కడా గోల్మాల్ గోవిందం జరిగేసరికి అందరికీ కోపమొస్తుంది. గుంటనక్కలా పక్కనుండే రాజకీయులకు ఇదీ ఓ విమర్శనాస్త్రమే. మేమొస్తే పరిస్థితి అస్సలు ఇలా ఉండదని, మా ప్రభుత్వాలు మహా పారదర్శకంగా ఉంటాయని కబుర్లు చెప్పొచ్చు. అవన్నీ ఉట్టివే. మహా మహా స్కాములు వాళ్ళ ఖాతాలో చూడొచ్చు. శ్రీరంగనీతులు చెప్పేవాళ్ళకు ఇతర విలువలేవీ ఉండనక్కరలేదని తెలిసిపోతుంది మనకు. ఇక మ్యాచులు చూడటం విషయానికొస్తే, ఉడుకు రక్తం, చిన్న వయస్సు కాబట్టి ఓకే. చదువులు పూర్తయ్యాక తమ జీవితపు సినిమాకి టికెట్లాంటి ఉద్యోగమో వ్యాపారమో వచ్చే అవకాశాలేమి ఉన్నాయి, అసలు ఉన్న ఉద్యోగాలనే ఊడబెరికే ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి అన్న కనీస ధ్యాస కూడా యువతకుండాలి. ఎందుకంటే వీరు మహాకవి చెప్పినట్టు శైసవదశలో ''మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే'' తమకే అనుకునే అయిదారేడుల పాపలు కాదు, కూనలుకాదు. వీరు యువత. రేపు దేశాన్ని నడిపించవలసింది మేమే అని వాళ్ళకు వాళ్ళు తెలుసుకోకున్నా తెలిపేవారి మాటలు వినాలి. ఎవరి టికెట్లు వాళ్ళే సంపాదించుకోవాలి. లేదంటే అన్నీ బ్లాకులో అమ్ముతారన్న విషయం తెలుసుకోవాలి.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇంకో రకమైన టికెట్ల గురించి చెప్పుకోవలసిన అవసరం, ఆవశ్యకత రెండూ ఉన్నాయి. అవే రాజకీయ టికెట్లు. చట్టసభలకు పోటీ చేసే టికెట్లు. వాటికోసం నానా తంటాలుపడి తెచ్చుకోవలసి ఉంటుంది. ఇంతకుముందు తలలపైనుండి సాలీడులాగా నడిచి టికెట్లు తెచ్చిన మా మిత్రుడిలాగే ఇవి తెచ్చుకోవలసి ఉంటుంది. పైరవీలు చేయాలి, లేనిపోని మాటలు చెప్పాలి, పాద యాత్రలు చేయాలి, పైవారిని నమ్మించాలి. భరతుడు రాముడి పాదుకలతో రాజ్యం నడిపించినట్టు నేనూ మీ అనుయాయుణ్ణని వాళ్ళకు తెలియజేసుకోవాలి. వచ్చిన పెద్దాయనకు నమ్రతగా అన్ని సౌకర్యాలు చూడాలి, అవసరమైతే జూతాలు అందివ్వాలి. మొత్తం మీద నూటికి రెండువందల మార్కులు సంపాదించాలి.
ఇక టికెట్ల పంపిణీలో తమ అస్మదీయులకే అందరూ టికెట్లు ఇస్తారు కాబట్టి ఆ విధంగా రూపాంతరం చెందాలి. ఈ పార్టీ నాయకుడిని, ఇంకో పార్టీలో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు మరిచిపోయేలా ఇప్పుడు పొగడ్తల వాన కురిపించాలి. క్లౌడ్ బర్స్టింగులో ఎలాగైతే విపరీతమైన వర్షాలు కురిసాయో అలాగన్నమాట. అప్పుడు టికెట్ వరకు గ్యారెంటీ అయిపోయాక ఎన్నికల్లో పోటీ సమయంలో ఇంకెన్నో చేయాలి. ప్రజల మనసుల్లో టికెట్ సంపాదించాలి మొదట. అధికారంలో ఉన్న పార్టీలైతె టికెట్లివ్వని, ఆట నడవని సినిమాలలాంటి అమలు చేయని వాగ్దానాలను ఈసారి వందకు వంద శాతం చేస్తామన్న భరోసా ఇవ్వాలి. మీరందరూ ఓట్లేస్తేనే మాకు మరో ఐదేండ్లు ప్రభుత్వాన్ని పాలించే టికెట్ ఇచ్చినట్టు మీమీదొట్టు మిమ్మల్నే నమ్ముకున్నాం అని చెప్పాలి.
జీవితమేమీ ట్వెంటీ ట్వెంటీ మ్యాచు కాదు ఒక పూటలో చూడ్డానికి. అది స్టేడియంలో చూసినా, టీవీలో చూసినా ఒకటే. మన జీవితం మన కండ్లముందే మారుతూ ఉంటుంది. అందుకే అధికారమనే టికెట్ ఇచ్చి కుర్చీలో కూచోబెట్టేవాళ్ళు ఎవరూ, ఎలాగుంటారు అని బాగా నిశితంగా పరిశీలించాలి. ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టే వాళ్ళనే దగ్గరికి తీయాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఎవరి బోగీల్లో వాళ్ళు ప్రయాణించండి, టికెట్లు వేరువేరుగా తీసుకొండి అని చెప్పేవాళ్ళకు ప్రయాణం టికెట్ కాదు కదా ప్లాట్ఫాం టికెట్టు కూడా ఇవ్వకుండా దూరం పెట్టాలి. నిజమైన ప్రజల ప్రేమికులు ఎవరు, జనరల్ బోగీల్లో ప్రయాణించేదెవ్వరు, ప్రజా సేవలో సైకిలుపై చట్టసభలకు వెళ్ళింది ఎవరు అని కూడా చూడాలి ప్రజలు. సమసమాజ స్థాపనలో మన జీవితపు రైలుబండిని సక్రమ మార్గంలో నడిపే త్యాగమయులకు టికెట్ ఇవ్వడం మన మంచికే అని తెలుసుకోవాలి.
- జె. రఘుబాబు
సెల్:9849753298