Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ పెడతారని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందని వినిపించిన కథనాలు వాస్తవ రూపం దాల్చుతున్నట్టు వార్తలు ఈ వారం అధికారిక ముద్ర వేసుకున్నాయి. అంతేగాక ఈ క్రమంలో కేసీఆర్ మొదలుపెట్టిన చర్చల ప్రక్రియ మాజీ ప్రస్తుత సీఎంలవరకూ నడిచింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో మొదట కేసీఆర్ ప్రత్యేకంగా పిలిచి చర్చించారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలహీనపడిన ప్రస్తుత పరిస్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రస్తుతం దీటుగా పొరాడగలిగింది ఆయన ఒక్కరేనని ఉండవల్లి కితాబునిచ్చారు. మూడు భాషలలోనూ అద్భుతంగా మాట్లాడతారు గనక కేసీఆర్ ఒక్కరే మోడీకి చెక్పెట్టగలరని విపరీతంగా పొగిడారు. ఇంకోవైపున ప్రగతిభవన్ కనుసన్నలలో మసలే మేధావులు మాజీసంపాదకులు కొందరు దేశానికి ఆయన నాయకత్వం ఎంత అవసరమో నిగ్గడిస్తూనే వచ్చారు. ఈవారం వారు కూడా దశలవారీగా జాతీయ పార్టీ అవసరాన్ని చెబుతూ మోడీ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందనలు వెలువరిస్తూ వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల చర్చలలో తటపటాయించిన కేసీఆర్ ఓటింగులో మాత్రం ప్రతిపక్షాలతోనే కలసి వ్యవహరించారు. ప్రధాని మోడీ వచ్చిన రోజునే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంతసిన్హాను ఘనంగా ఊరేగించారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండబోతున్నారని ఆ ఎన్నిక తేల్చిచెప్పింది. తర్వాత హైదరాబాదులో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మార్పు తర్వాత మునుగోడు ఎన్నికల సభలూ ప్రచారాలూ అన్నీ బీజేపీ వ్యతిరేకతను ప్రస్ఫుటం చేస్తూ వచ్చాయి మునుగోడులో బీజేపీని ఓడించేందుకు గాను టీఆర్ఎస్ను బలపర్చాలని ఉభయ కమ్యూనిస్టుపార్టీలు నిర్ణయించాయి. షరామామూలుగా బీజేపీ అనుకూల శక్తులు ఈ మద్దతుకు పరిపరి విధాల భాష్యాలు చెప్పినా కమ్యూనిస్టుల మద్దతు తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితి బాగా మెరుగైందనే భావన వచ్చింది.
గత సందేహాలు ప్రస్తుత సవాళ్లు
గతంలో మోడీని కేసీఆర్ అతిగా పొగిడిన నేపథ్యం, కొన్ని మాటలు సందేహాలకు కారణమైనా బీజేపీ ఏకపక్ష ధోరణులులు తెలంగాణపై పనిగట్టుకుని చేస్తున్న దాడులు పరిస్థితిని మార్చేశాయి. 2018కి ముందు కూడా దేశ్‌కీ నేత కేసీఆర్ నినాదాలు విన్నాం. 2019తర్వాత మళ్లీ అది వెనక్కుపోవడం చూశాం. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ అని గతంలో అనేవారు. తర్వాత అది జాతీయపార్టీ ప్రకటనగా మారింది.
బీహార్ నుంచి ప్రగతిభవన్ దాకా
రాష్ట్రంలో వ్యూహాలు, చర్చలు, సంకేతాలు సాగుతుండగానే కేసీఆర్ జాతీయ స్థాయిలోనూ చొరవ ప్రదర్శించారు. పాఠశాలల పరిశీలన కోసం ఢిల్లీ, రాజకీయ చర్చల కోసం మహారాష్ట్ర, బీహార్ సందర్శించారు. అయితే ఆ తర్వాత మహారాష్ట్రలో ఉద్భవ్ థాక్రే సర్కారు కూలిపోయింది. బీహార్‌లో నితిష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అమరజవాన్లకు ఆర్థిక సహాయం అందించేందుకు బీహార్ వెళ్లిన కేసీఆర్ నితిశ్‌తో కలిపి నిర్వహించిన మీడియా గోష్టి నాయకత్వంపై ప్రశ్నలకు కారణమైంది. ఆయన దాటేయాలని ఎంతగా ప్రయత్నించినా బీహార్ పాత్రికేయులు పదేపదే అదే ప్రశ్న వేయడం, నితిష్ నిష్క్రమించడానికి సిద్ధం కావడం ఇబ్బందిగా మారింది. వారు ఎన్నిసార్లు అదే అడిగినా కేసీఆర్ మాత్రం నాయకత్వ సమస్య తర్వాత చర్చించుకుంటామనే జవాబిచ్చారు. కాంగ్రెస్‌ను కలుపు కోవడంపైనా అదే చెప్పారు. ఈ సమావేశం తర్వాత నాయకత్వంపై భిన్నాభిప్రాయాలున్నట్టు కథనాలు రావడంతో నితీశ్ ఢిల్లీ వెళ్లి సోనియా, సీతారాం ఏచూరి తదితర నాయకులను కలసి తనకు ప్రధాని కావాలనే ఆలోచన లేదని మరీ మరీ చెప్పి వచ్చారు. అంతకు ముందు ఈ రేసులో తానే ముందున్నానని ప్రకటించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తమ మంత్రులపై ఈడీ దాడులు కేసుల తర్వాత ఒకింత వెనకడుగు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నాటికి ఒక అవగాహనకు వచ్చారని కూడా కథనాలు వెలువడ్డాయి. అంతేగాక కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రధాని మోడీకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాయన్నట్టు సభలో తీర్మానం సందర్భంగా చెప్పారు. ఆరెస్సెస్‌లోనూ అంతా చెడ్డవారు కాదని కితాబునిచ్చారు. మొత్తంపైన ఆమె కాళ్లు చల్లబడుతున్నాయనే అంచనాకు పరిశీలకులు వస్తున్నారు.
ప్రాంతీయ నేతల కాంక్షలు
నితిష్పైకి చెబుతున్నారా లేక నిజంగా మారారా అని మల్లగుల్లాలు ఒకవైపు సాగుతుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష ఐక్యత అంత కీలకమేమీ కాదనే రీతిలో మాట్లాడుతున్నారు. తాము పంజాబ్‌లో విజయం సాధించడం, గుజరాత్‌లోనూ గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం కేజ్రీని తానే ప్రత్యామ్నాయం అనుకునేలా చేస్తున్నాయను కోవాలి. వారిపైనా ఈడీ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నది. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర అధ్యక్ష ఎన్నికలలో తలమునకలవుతున్నారు. యూపీలో కన్నా కేరళలోనే అత్యధిక కాలం యాత్ర జరపడం ద్వారా రాహుల్ తమ ఆలోచన ఏమిటో చెప్పకనే చెప్పేశారు. అసలు నాయకత్వం సమస్య, బీజేపీయేతర కూటమి రూపం ఎన్నికల ఫలితాల తర్వాతనే స్పష్టం కాగలదని ఏచూరి చెబుతున్న మాట ఇప్పుడు అనివార్య పరిణామంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న నాయకులు గాక అఖిలేష్‌యాదవ్, సురేష్వఘేలా వంటివారితోనూ కేసీఆర్ వివరంగానే చర్చలు చేశారు. అధికారంలోలేని నాయకులు చాలామంది ఆయనను జాతీయపార్టీ పెట్టాలని కోరినట్టు అధికారిక కథనాలు విడుదలైనాయి. మరో తెలుగు రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలూ బీజేపీని విమర్శించే స్థితిలో లేవు. కాబట్టి కేరళ, తమిళనాడు, తెలంగాణ కీలకమవుతున్నాయి. బీజేపీని వ్యతిరేకించడం ఒకటైతే జాతీయ పార్టీ స్థాపన అనేదాని రూపురేఖలు ఎలా ఉంటాయనేది ఇంకా స్పష్టత రావలసే ఉంటుంది. ఓట్లశాతం పొందేవిధంగా ఇతర చోట్ల కొన్ని సీట్లలో పోటీ చేయడం దీని తాత్పర్యంగా కనిపిస్తుంది. కాని ఇతర ప్రాంతీయ పార్టీలు బిఆర్ఎస్ను జీర్ణం చేసుకోగలవా పిలిచి పీట వేయగలవా అంటే ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఆప్ పంజాబ్ గెలిచిన ఉదాహరణతో ప్రాంతీయ జాతీయ చర్య కూడా మారింది. వాస్తవానికి ప్రాంతీయ పార్టీ అనేది ఇందిరాగాంధీ రూపొందించిన పదం. కాంగ్రెస్ ఒక్కటే జాతీయ పార్టీ అని చెప్పడానికి ఆమె అలా చేశారు. దృక్పథాలను బట్టి పార్టీల పాత్ర నిర్ణయమవుతుంది. వామపక్షాలు కూడా మూడు రాష్ట్రాలలో పాలన చేస్తున్నప్పుడు జాతీయ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేశాయి. ఇప్పుడూ బీజేపీని ఓడించే విషయంలో గట్టిగా నిలబడుతున్నాయి. అయితే ఈ రెండు దశాబ్దాలలోనూ ప్రాంతీయ పార్టీలు అనేక మల్లగుల్లాలతో బీజేపీ పెరుగుదలకు దోహదం చేశాయి. కాంగ్రెస్ సరేసరి. ఆర్థిక విధానాలలోనూ అవకాశవాద రాజకీయాలలోనూ వీటి మధ్య పెద్ద తేడా ఉండదు గనక ఇలా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ఇందుకు మరో ఉదాహరణ అవసరం లేదు. ఎన్నికలు చాలా దూరమే ఉన్నాయి గనక వీటిపై పూర్తి నిర్ధారణలకు రావడానికి ఉండదు. ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు ప్రధాని పదవి గురించి చూస్తున్నారనే సంకేతాలు ఇందుకు నిదర్శనం. ప్రశాంత్ కిశోర్ వంటి నవీన రాజకీయ మార్కెట్ బేహారులు, మీడియా వ్యవస్థ నిర్ణేతలు పార్టీలను ప్రభుత్వాలను ప్రభావితం చేయడంలో ముందుంటారు.
తక్షణ సమస్యలు, భవిష్యత్తు
అవన్నీ ఎలా ఉన్నా మహారాష్ట్ర, బీహార్ ఉదంతాల తర్వాత బీజేపీ ఇతర మిత్ర పార్టీలను కూడా చప్పరించేయడం తప్పదని తేలిపోయింది. రానున్న శాసనసభ ఎన్నికలలో తెలంగాణను ఎలాగైనా గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బీజేపీ అగ్రనేతలు అహంకరించి మాట్లాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా తన అస్తిత్వం కోసం బీజేపీపై కేంద్రీకరించే బదులు టీఆర్ఎస్నే లక్ష్యంగా చేసుకుంటున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట రోజూ ముఖ్యమంత్రి కుటుంబంపైనా బెదిరింపులు సాగుతున్నాయి. కేంద్రంలో నుంచి పాలనా పరమైన ఇబ్బందులు పెట్టడం సరేసరి. కాబట్టి శాసనసభ ఎన్నికల సమరంలోనూ టీఆర్ఎస్ అనేక క్లిష్టమైన పరీక్షలు తట్టుకోవలసి ఉంటుంది. మునుగోడు ఉపఎన్నికతో అది మొదలవుతుంది. అందుకే కేసీఆర్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీని వ్యతిరేకించి పోరాడటానికే నిర్ణయించుకున్నారు. మజ్లిస్‌తో స్నేహం కొనసాగిస్తూనే మొన్న సమైక్యతా దినోత్సవం జరిపి ఒక విధమైన మధ్యేమార్గం ఎంచుకున్నారు. కేంద్ర సంస్థల దాడుల తీవ్రతను బట్టి స్పందించకా తప్పదు. బీజేపీ తదుపరి లక్ష్యం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అస్థిరం పాలు చేయడమేనని రాజనీతిజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆ సూచలూ చూస్తున్నాం. ఇవన్నీ టీఆర్ఎస్కు తక్షణ రాజకీయ సవాళ్ళు గనక అలసత్వానికి అవకాశం ఉండదు. ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ పాత్ర నిర్వహిస్తానని చెప్పడం ద్వారా కేసీఆర్ ఒక రాజకీయ ఊహాగానానికి కూడా స్పష్టత ఇచ్చేశారు. బంగారు తెలంగాణ విధానాలు దేశమంతటికీ వర్తింప చేయాలనే ఆయన ప్రచారం ఇతర పార్టీలతో సంబంధంలేనిదే కానీ వాటిపై చర్చ కూడా తప్పక జరుగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ అడుగులు ఎలా ఉంటాయనేది చూడటం ఆసక్తికరమే అవుతుంది. మతతత్వం కేంద్రీకృత పెత్తనాలను వ్యతిరేకించాలనే తన విధానాన్ని అమలు చేయడంలో వాస్తవికత ఏమేరకు ఉండేది భవిష్యత్ చెబుతుంది.
- తెలకపల్లి రవి