Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భగత్‌సింగ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుల్లోను, విప్లవ సోషలిస్టుల్లోను ఒకడు మాత్రమే కాదు. ఆయన తొలి మార్చిస్టు చింతనాపరులలోను, సిద్ధాంత కర్తలలోను ఒకడు. దురదృష్టవశాత్తు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఆయన సహచర కామ్రేడ్ల పేర్లను, కీర్తిని మతతత్వవాదులు, ఛాందసవాదులు, అభివృద్ధినిరోధకులు తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుని ఈ చివరి వాస్తవాన్ని అంతగా వెలుగులోకి రాకుండా చేశారు.''
- ప్రొఫెసర్ బిపిన్ చంద్ర.
భగత్‌సింగ్ 1907వ సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తేదీనాడు నేటి పాకిస్థాన్‌లో గల ల్యాల్‌పూర్‌లో ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. ఆయన దయానంద్ ఆంగ్లో-వేదిక్ ఉన్నత పాఠశాలలోను, ఆ తరువాత 1923లో గాంధీజీ నాయకత్వంలో సాగిన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జాతీయ నాయకుడు లాలా లజపతిరారు స్థాపించిన లాపూర్లోని నేషనల్ కాలేజీలోను విద్య నభ్యసించాడు. ఏ కోణం నుంచి చూసినా భగత్‌సింగ్ పుట్టుకతోనే విప్లవకారుడు. గదర్ విప్లవకారులతో సంబంధంగల కుటుంబ నేపథ్యం ఆయనిది. ఆవిధంగా గదర్ విప్లవ చైతన్యం ఆయన రక్తంలోనే ఉంది. ఇటలీలో మజినీ నాయకత్వంలో జరిగిన ''యువ ఇటలీ'' రిసార్జిమెంట్ ఉద్యమ చరిత్ర ప్రభావంతో ఆయన ఒక అంతర్జాతీయ వాదిగాను, ఒక విప్లవ జాతీయవాదిగాను మారాడు. 1918-19 సంవత్సరాలలో పంజాబ్‌లో లేచిన విప్లవ కెరట మతడు. ముఖ్యంగా వలస పాలకులు జరిపిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల ప్రాయంలోనే సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా పరిణమించేలా చేసింది. అయితే భగత్ సింగ్ అచిరకాలంలోనే గాంధీ నాయకత్వంలో నడిచిన సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాల చుట్టూ పరిభ్రమించే మధ్యతరగతి జాతీయవాదంతో పాటు మతాచారాల కక్ష్యను కూడా ఛేదించాడు.
క్లుప్తంగా చెప్పాలంటే కొద్దికాలంలోనే భగత్‌సింగ్ గాంధీ జాతీయవాద పరిమితులను దాటి 1905లో పెల్లుబికిన స్వదేశీ ఉద్యమంలో మూలాలుగల విప్లవోద్యమంవైపు పయనించాడు. 1922వ సంవత్సరంలో గాంధీ తన నాయకత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమాన్ని అర్థంతరంగా ఆపటం, అదే కాలంలో చెలరేగిన మత ఘర్షణల వల్ల గాంధీపట్ల భగత్‌సింగ్ కున్న భ్రమలు తొలిగిపోయాయి. 1924వ సంవత్సరంలో ఆయన సచీద్రనాద్ సన్యాల్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి ఆస్థికులైన విప్లవకారులతో స్థాపించబడిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్‌లో చేరాడు. 1924వ సంవత్సరం తరువాత రష్యాలో బోల్షివిక్ విప్లవం విజయవంతం అవటంతో అనేకమంది భారతీయ విప్లవకారులు, మార్క్సిస్టులుగా మారారు. 1928వ సంవత్సరంలో భగత్‌సింగ్ తోపాటు అనేకమంది విప్లవకారులు డిల్లీలోని ఫిరోజ్ ఎ - కోట్లా ప్రాంతంలో సమావేశమై హిందుస్థాన్ రిపబ్లిక్ అసోషియేషన్ పేరును హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్ (హెయస్ఆర్ఎ)గా మార్చారు. ''విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థకు, వర్గబేధాలకు, తారతమ్యాలకు చావు గంటను మోగిస్తుంది. అది ఒక నూతన సామాజిక క్రమానికి, నూతన రాజ్యానికి జన్మనిస్తుంది'' అని హెఎస్ఆర్ఎ ప్రకటించింది.
1928వ సంవత్సరంలో లాహౌర్‌లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన నిరసన కార్యక్రమంలో లాలా లజపతిరారు తీవ్రంగా గాయపడి మరణించాడు. అందుకు కారణమైన జేమ్స్ స్కాట్పై భగత్‌సింగ్ బృందం చేయదలచిన దాడిలో పొరపాటున అతని అసిస్టెంట్ సాండర్స్ హత్యకు గురయ్యాడు. 1929వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీనాడు భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్ సెంట్రల్ లేజిల్లేటివ్ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగబాంబులు వేసి ''విప్లవం వర్థిల్లాలి'' అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విచారణ తరవాత భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లకు జీవిత ఖైదును, ఆ తరువాత సాండర్స్తోపాటు మరో హత్యకు కారణమైన భగత్‌సింగ్‌కు, ఆయన సహచరులైన సుఖ్‌దేవ్, రాజగురులకు మరణ శిక్షను విధించటం జరిగింది. ఆ మరణశిక్షను 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీనాడు లాహౌర్ జైలులో అమలు చేశారు. అలా అసమాన్యుడైన ఒక విప్లవకారుడి శ్వాస ఆగిపోయింది.
భగత్‌సింగ్ తన 23ఏండ్ల జీవితకాలంలో అక్టోబర్ విప్లవం గురించి అనేక వ్యాసాలను, గ్రంధాలను చదివాడు. ఆయనకు లెనిన్ పట్ల గౌరవభావం ఏర్పడింది. మార్క్స్, బకూనిన్ల రచనల అధ్యయనం వల్ల ఏర్పడిన అవగాహనతో భగత్‌సింగ్ జాతీయవాదం, అరాచకవాదం, అహింస, టెర్రరిజం, మతం, మతతత్వ, ఆస్థికవాదంలను నిరంతరం విమర్శించాడు. ఆయన అవగాహనలో ప్రతి విప్లవకారుడికి ''ఆత్మ విమర్శ'', ''స్వతంత్ర ఆలోచన'' అనివార్యంగా ఉండవలసిన లక్షణాలు. మెజారిటీ ప్రజలలో ''బుద్ధిమాంద్యం''అనే వ్యాధి వ్యాపించిన సమాజంలో హేతువాదిగా మనగలగటం కష్టమని చాలా చిన్నతనంలోనే భగత్‌సింగ్ గ్రహించాడు.
మార్క్సిజం వంటి చింతనల అధ్యయనంతోనే భగత్‌సింగ్ నాస్తికుడు కాలేదు. భారతీయ తత్వశాస్త్రంలోని హేతువాద ధోరణులపట్ల ఆయనకు లోతైనపరిజ్ఞానం ఉంది. ప్రాచీన భారత భౌతికవాది చార్వాకుడు ''దేవుడి అధికారానికి'' సవాలు విసిరాడని ఆయన అనేకసార్లు కొనియాడాడు. ''గుండెలు బాదుకునే విశ్వాసులను'' పట్టించుకోకుండా మతమౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని ఎదిరించటానికి చరిత్రలో జరిగిన పోరాట పాఠాలను విప్లవకారులు ఉపయోగించుకోవాలని ఆయన భావించాడు. జాతీయవాదులమని నుదుటిపై రాసుకుని, దేశభక్తులమని రొమ్ములు విరుచుకుని తమతో ఏకీభవించనివారిపైన విరుచుపడేవారు భగత్ సింగ్ రాసిన ఈ మాటలను చదవాలి...
ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా గతకాలపు విశ్వాసాలను నమ్మకుండా వాటిని విమర్శించటం ద్వారా సవాలు విసరాలి. వర్తమానంలోని సిద్ధాంతాలకు, తాత్విక చింతనలకు, విశ్వాసాలకు చెందిన ప్రతి అంశాన్నీ హేతుబద్దంగా తర్కించి చూశాకే వాటిని ఆహ్వానించాలి. అతని హేతువులో లోపం ఉండొచ్చు. అది తప్పుకావచ్చు. కొన్నిసార్లు అది వక్రమార్గం పట్టివుండవచ్చు. అయితే అతను దాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అతని జీవితానికి హేతువే వేగుచుక్క. కేవలం విశ్వాసం, గుడ్డి నమ్మకం ప్రమాదకరమైనవి. అవి అతని మేదస్సును మొద్దుబార్చి అతన్ని ఒక తిరోగమనవాదిగా మారుస్తాయి.
దాదాపు విప్లవకారులందరూ మతభావనలలో కూరుకుపోయిన స్థితిలో కూడా అలా భగత్‌సింగ్ నాస్తికుడయ్యాడు. అండమాన్‌లో జీవిత ఖైదీగావున్న సచీంద్రనాద్ సన్యాల్, రాంప్రసాద్ బిస్మిల్, రాజెన్ లాహిరి వంటి కాకోరి అమరులంతా నిత్యం ప్రార్థనలు చేస్తూ గడిపేవారు. గతితార్కిక భౌతికవాదాన్ని, జ్ఞానార్జనకు చర్చ, సంభాషణ మార్గాన్ని అనుసరించిన భగత్ సింగ్ మార్మికవాదాన్ని తిరస్కరించాడు. అధ్యయనమే ఆయన్ని నాస్తికత్వం వైపు, విప్లవ సామ్యవాదంవైపు నడిపించింది. విశ్వాసానికి, భావజాలానికి సంబంధించిన సమస్యలకు ఆత్మశోధన, ఆత్మ విమర్శ పద్ధతులతో హేతుబద్ద పరిష్కారాలను కనుగొనటంలో భగత్‌సింగ్ అసమాన ప్రతిభ కనపరిచాడు.
భగత్‌సింగ్ భవ్య భారతదేశం జాతీయవాదుల, మతతత్వవాదుల ఊహలకు పూర్తిగా భిన్నమైనది. దేశాన్ని ఆయన ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదేమో. ఆయనకు దేశమంటే నిర్దిష్ట సరిహద్దుల మధ్యగల మట్టి కాదు. దేశమంటే ''పెట్టుబడిదారీ భూతాలు'' పీల్చిపిప్పి చేస్తున్న కూడు, గూడులేని కోటానుకోట్ల ప్రజలు. ఈ పీడిత ప్రజల ఆశల్ని, ఆకాంక్షలనూ తీర్చగలిగేది శాస్త్రీయ సోషలిజం మాత్రమేనని ఆయన అధ్యయనం, ఆచరణలతో గ్రహించాడు. హేతువును, శాస్త్ర విజ్ఞానాన్ని, సామ్యవాదాన్ని చేరుకోవాలంటే విశ్వాసాల, మౌఢ్యాల, పెట్టుబడి కుతంత్రాల సుడిగుండాలను అనివార్యంగా అధిగమించటం ద్వారా మాత్రమే సాధ్యమని భగత్‌సింగ్‌కు తెలుసు. ఆయన దృష్టిలో ఇందుకు సంబంధించిన ఆచరణలో ఉన్నవాడే నిజమైన విప్లవకారుడు.
అంతిమంగా చెప్పాలంటే భగత్‌సింగ్ ఔన్నత్యాన్ని ఆయన పుట్టి పెరిగిన సామాజిక నేపథ్యంలో ఆయన ఎంచుకున్న మార్గం తెలియజేస్తుంది. 1920వ దశకంలో ఒకవైపు రష్యాలో బోల్షివిక్కుల విజయం, మరోవైపు ఇటలీ, జర్మనీలలో ఫాసిజం ప్రపంచాన్ని కుదిపాయి. 1921లో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పడినప్పుడు, 1925లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఆయన యుక్త వయసులో ఉన్నాడు. ఈ రెండు సంస్థలపై నాటికి, నేటికి ఫాసిజం ప్రభావం ఉంది. 1920వ దశకంలోనే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేక మంది హిందూ జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు అనుశీలన్, యుగ్వార్ వంటి విప్లవ గ్రూపులతో సంబంధాలు ఉండేవనేది అందరికీ తెలిసిందే. 1920వ దశకంలో జరిగిన అటువంటి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపట్ల నవయువకుడుగా ఉన్న భగత్‌సింగ్ స్వతంత్ర అవగాహనను ఏర్పరచుకుని విప్లవ కార్యాచరణలోకి దిగటం విస్మయం గొలిపే చారిత్రక వాస్తవం. బిపిన్ చంద్ర అన్నట్టు భరతదేశం తాను విప్లవీకరింపబడటానికి భగత్‌సింగ్ రూపంలో తన లెనిన్‌కు జన్మనిచ్చింది! అయితే భారత లెనిన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేతిలో అమరుడయ్యాడు.
(నేడు భగత్‌సింగ్ జయింతి)
- నెల్లూరు నరసింహారావు
సెల్:8886396999