Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరాస సర్వసభ్య సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట సెప్టెంబర్ 28న 'అంతర్జాతీయ సమాచార హక్కు దినం'గా పాటించడం ఆనవాయితీగా మారింది. 'అందరికీ అందుబాటులో సమాచారం' అనేది నినాదం. ప్రభుత్వ యంత్రాం గంలో పారదర్శకత, పథకాల నిష్పాక్షిక అమలు, అధికార యంత్రాంగ జవాబుదారీతనం లాంటివి ప్రజా స్వామ్యానికి, సుపరిపాలనకు పునాదులుగా నిలవటానికి సమాచార హక్కు దోహదపడుతుంది. సమాచార చట్టాల అమలుతో ప్రజలకు న్యాయవంతమైన పాలన దొరుకుతుంది.
సమాచార హక్కు బహు శక్తివంతం. సమాచార హక్కుతో పత్రికా స్వేచ్ఛ హక్కు అనుబంధాన్ని కలిగి ఉంది. భావ స్వేచ్ఛకు సమాచార సేకరణ దోహదపడుతుంది. పన్నులు కట్టే ప్రతి ఒక్కరికీ నిధుల సద్వినియోగం పట్ల సంపూర్ణ సమాచారం తెలుసునే హక్కు విధిగా, చట్టబద్దంగా ఉండాలి. అంతర్జాతీయ సమాచార హక్కు దినం వేదికగా విషయ అవగాహన సదస్సులు, చర్చలు, విద్యాలయాల్లో పోటీలు, పోస్టర్ విడుదలలు, ర్యాలీలు, సమాచారం కోసం దరఖాస్తు చేయడం, లోపాలను ఎత్తి చూపడం, హక్కులను హరించే అవినీతి పరుల చీకటి కోణాలను వెలుగులోకి తేవడం, కార్యశాలలు, శిక్షణల నిర్వహణ, ప్రచార మాద్యమాల్లో అవగాహనలు, సమాచార హక్కు కార్యకర్తలను అభినందించడం లాంటి కార్యక్రమా లను నిర్వహించాలి. సమాచార హక్కు పదునైన ఆయుధం, అక్రమాల అంతానికి ఉపకరణం. అవసరమైన సమాచారం పొందడం, లోతైన అవగాహనను కలిగి ఉండటంతో సమాజానికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ సమాచారాన్ని పొందడం మన హక్కు. పొందిన సమాచారంతో అక్రమాల గుట్టు రట్టు చేయడం మా బాధ్యత.
(28 సెప్టెంబర్ 'అంతర్జాతీయ
సమాచార హక్కు దినం' సందర్భంగా)
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, సెల్:9949700037