Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: గురువుగారూ... గురువుగారూ... స్త్రీకి కావాల్సింది స్వేచ్ఛా? రక్షణా..?
గురువు: స్త్రీ, అయినా పురుషుడైనా ప్రతివ్యక్తికి స్వేచ్ఛ కావాల్సిందే. అది ఆధునిక మానవ హక్కు. ఇకపోతే రక్షణ. ఎవరి నుండి స్త్రీకి రక్షణ?
శిష్యుడు: అదేమిటండీ గురువుగారూ, పురుషల నుండి రక్షణ.
పిత్రా రక్షిత కౌమారే... భర్తా రక్షితా యవ్వనే... పుత్రా రక్షితి వార్ధవ్యే... నస్త్రీ స్వాతంత్య్రః మర్హతి అని మనుధర్మశాస్త్రం ఘోషిస్తుంది గదా!
గురువు: అందులోనే ఉందిగా... స్త్రీకి స్వాతంత్య్రం అక్కర్లేదనీ... మరి స్వేచ్ఛా స్వాతంత్య్రం ఇవ్వలేని రక్షణ ఒకరకంగా నిర్బంధమే కదా శిష్యా...
శిష్యుడు: అందుకే ఇరాన్లో జరిగే ఘర్షణ నాకు అంతుచిక్కడం లేదు. స్త్రీలు... నెత్తిని, ఛాతిని కప్పే హిజాబ్ వస్త్రాన్ని ధరించాల్సిందేనని అక్కడి పాలకులు, మత ప్రవక్తలు వాదిస్తున్నారు.
మా శరీరంపైనా ఇంకా మీ పెత్తనం ఆంక్షలు ఏమిటి? అని మహిళాలోకం పెద్దఎత్తున ఉద్యమిస్తున్నది. అభ్యుదయ వాదులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. పాలకుల నిరంకుశత్వానికీ - ప్రజా ఉద్యమానికీ మధ్య జరుగుతున్న ఆ ఘర్షణల్లో, కాల్పుల్లో ఈ పదిరోజుల్లోనే డైబ్భైమందికి పైగా మరణించారు.
గురువు: ఇరాన్లో ఇస్లాం మత ఛాందస ప్రతిఘటనా ఉద్యమం 1979 అయితుల్లా ఖామైనీ కాలం నుంచే నడుస్తున్నది. మహిళా వస్త్రధారణపై ఆంక్షలు కూడా అందుకు ఓ ముఖ్యకారణం. 'తిరోగమించడానికి కాదు మానవ జీవనం' అని నినదించేశారు. మహిళా న్యాయవాదులు, విద్యావేత్తలు, యువత ఈ వివక్షదాడిని తీవ్రంగా నిరసించారు.
హిజాబ్ వస్త్రధారణ పాటించని స్త్రీలను 74 కొరడా దెబ్బలతో శిక్షించాలనేది 1983లో ప్రభుత్వ శాసనమైంది. 1995 నాటికి ఈ శిక్ష ఇంకా తీవ్రమై రెండు నెల్ల కఠిన కారాగార వాసమైంది. అయినా కొందరు మహిళలు లెక్కచేయక బాహాటంగానే నిరసన తెలుపుతున్నారు. మాది శతాబ్దాల అణచివేత అంటూ హిజాబ్‌ను తీసి కర్రకు తగిలించి దగ్దం చేయడం, జుత్తును కత్తిరించుకోవడం తీవ్రమైంది. ఇలాంటి వారిపై మరింతగా ఉక్కుపాదం మోపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ఓడిక్రీ తాజాగా ఆజ్ఞలు జారీ చేసాడు. మరలా ఉద్యమం పెల్లుబికింది. ఈ నేపథ్యంలోనే మహ్స అమని అనే యువతిని మోరల్ (నైతిక) పోలీసులు నిర్భందించడం, కస్టడీలో ఆమె గాయాలుపాలై మరణించడంతో ఉద్యమం ఉప్పెనలా విరుచుకుపడింది.
శిష్యుడు: అదా అసలు విషయం.
గురువు: మరో విషయం కూడా నీవు గమనించాలి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసీ న్యూయార్క్ వెళ్ళారు. ఆ సందర్భంలో ఇరాన్లో చెలరేగుతున్న అలజడి గురంచి రైసీని ఇంటర్వ్యూ చేయాలని సి.ఎన్.ఎన్. వార్తా సంస్థ ప్రయత్నించింది. మహిళా యాంకర్ హిజాబ్ ధరిస్తేనే తన ఇంటర్వ్యూ అన్నారట. అలాగా... అయితే తమరి ఇంటర్వ్యూనే రద్దు చేసుకుంటున్నాం అని యాంకర్ క్రిస్టియానా ప్రకటించింది. సంకేతంగా రైసీ కుర్చీని ఖాళీగా చూపిస్తూ ఫొటోను వైరల్ చేసింది.
శిష్యుడు: అది ఇరాన్ కాదుగా, అమెరికా కదా! అయినా అక్కడకూడా తన మాటే నెగ్గాలంటే ఎలా గురువుగారూ...?
గురువు: ఒక్కోసారి పాలకుల మూర్ఖత్వానికి అంతం ఉండదు శిష్యా. ఇప్పుడు మత ఛాందసుల మద్దతు రైసీకి కావాలి. తన పదవిని కాపాడుకోవడానికి అతనికి అంతకన్నా గత్యంతరం లేదు. కాగా మహ్స అమని మరణవార్తను లోకానికి చాటిన మహిళా జర్నలిస్టు నీలోఫర్ అమేథిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఇంటిపై దాడిచేసి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆమె పరిశోధక రాతలు, అభిప్రాయాలు బయటకు రాకుండా ఆమె ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.
శిష్యుడు: ఎంత దారుణం? ఇలా అయితే నిజాలు ఎలా బయటకు వస్తాయి?
గురువు: నిరంకుశత్వానికి తొలిమెట్టు నిజాన్ని హత్యచేయడమే కదా శిష్యా...
శిష్యుడు: బాగా చెప్పారండి. మనదేశంలో కూడా ఫ్రొఫెసర్ సాయిబాబా, స్టాన్‌స్వామి, వరవరావు, తీస్తా సెతల్వాద్ వంటి మేధావులను నిర్భందిస్తున్నారు, వేధిస్తున్నారు.
విచిత్రం చూశారా గురువుగారూ... ఇక్కడ హిందూ మత పెద్దలు, బీజేపీ వారు - కర్నాటకలో... ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కళాశాలలకు రావద్దని నానా యాగి చేశారు. యువతను రెచ్చగొట్టారు. అక్కడ ఇరాన్లో ముస్లిం మత పెద్దలు, పాలకులు హిజాబ్ ధరించాల్సిందేనని వాదిస్తున్నారు.
గురువు: విచిత్రం కాదు శిష్యా. మత ఛాందసత్వం ఎక్కడైనా ఒక్కటే. ఏ మతంలోనైనా ఒక్కటే. పురుషాధిక్యత దాని అంతః సూత్రం. మహిళలు పురుషులకు లొంగి ఉండాలనే పెత్తందారీ ధోరణి. సాటి మనిషిని మనిషిగా చూడని అమానుషత్వం. అంతిమంగా అది మానవ హక్కులను గుర్తించకపోవడం, గౌరవించకపోవడం.
శిష్యుడు: గురువుగారూ... ఈ కోణంలో చూస్తే పాలకులు ప్రతిదీ రాజకీయ స్వార్థంతోనే పనిచేస్తున్నారని అర్థమవుతున్నది.
గురువు: మహిళా రక్షణే మానవ హక్కుల రక్షణ. వివక్షకు మూలం మతం ముసుగులో మగపెత్తనం.
- కె శాంతారావు
సెల్: 9959745723