Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉచితాలపై జరుగుతున్న చర్చ వేటిని ఉచితాలంటారనే అంశాన్ని తెర మీదకు తెచ్చింది. అంతేగాక, పేదలకు ఉచితాల పంపిణీ వల్ల కలిగే పర్యవసానాలు, ఆర్థిక స్థిరత్వంపై చూపే ప్రభావం, న్యాయ వ్యవస్థ తన ఔన్నత్యాన్ని దాటి శాసన వ్యవస్థ పరిధులలోకి జొరబడి రాజకీయ ప్రక్రియలో తలదూర్చడంలోని ఔచిత్యం... వంటి అంశాలను కూడా కదిలించింది. అయితే, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న విషయం మాత్రం అంతగా దృష్టిని ఆకర్షించలేదు.
రాష్ట్రాలు 'ఉచిత పథకాల' సంస్కృతికి తలొగ్గుతున్నాయని, ఎక్కువగా ఉచితా లిచ్చేసి ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెస్తున్నా యని ఆరోపణలు వెలువడు తున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ''రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఉచితాలు కురిపిస్తే, అది భవిష్యత్ తరాలకు ''భారమవుతుందని'' ముక్తాయించారు. ఉచితాలు పొందేవారు వాటి కోసం ఏమీ చెల్లించకపోవడం వలన వాటిని మరొకరు (భవిష్యత్ తరాలవారు) భరించాల్సి వస్తుందని'' సెలవిచ్చారు.
ఉచితాలు పంచడం రాష్ట్రాల బాధ్యతా రాహిత్యమా? అది భవిష్యత్ తరాలకు భారమవు తుందా? అనేది అసలైన ప్రశ్న. ఈ ఆరోపణ రాష్ట్రం అప్పులు చేసి పంచడం మొదలు పెట్టినప్పుడు వాస్తవమవుతుంది. అప్పుడు ఉచితాలు ఈ తరం వారు పొందగా, అప్పులు తీర్చాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై పడుతుంది. అసలు ఉచితాలు అంటే ఏమిటి? వాటిని ఏమేరకు ఇవ్వవచ్చు? లేదా రాష్ట్రాలు భరించవచ్చు? అనేది ఇప్పుడు చర్చించాల్సి ఉంది.
ఉచితాలు ప్రభుత్వాల ఖర్చులలో ఒక భాగం. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టంలో ఒక కీలకమైన అంశం లోటును పూర్తిగా నిర్మూలించడం. అంటే తెచ్చిన అప్పులను ఉచితాలతో సహా ఏ ఖర్చులకూ వాడకూడదు. మొత్తం ప్రభుత్వాల ఖర్చులో పెన్షన్లు, జీతాలకు, వడ్డీలకు దాదాపు 50-55శాతం ఖర్చవు తుంది. ప్రభుత్వాలు లోటు లేని బడ్జెట్లను రూపొందించ కుంటే, ఇతర సామాజిక, ఆర్థిక అభివృద్ధి పనులకు పోగా ఉచితాలు పంచడానికి పెద్దగా మిగలదు.
కేంద్ర-రాష్ట్రాల ఖర్చులలో వ్యత్యాసం
కేంద్రమా? రాష్ట్రాలా? ఎవరు ఆర్థికంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు? అన్నదే అసలైన ప్రశ్న. 2000-01లో రాష్ట్రాలు, కేంద్రం మొత్తంగా కలిసి ఏర్పడ్డ లోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో 6.45శాతానికి చేరుకుంది. ఇది అత్యధికం. కేంద్రం లోటు స్థూల జాతీయోత్పత్తిలో 3.91శాతం ఉండగా, రాష్ట్రాల లోటు 2.54శాతంగా ఉంది. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం చేసిన తర్వాత ఈలోటు గణనీయంగా తగ్గి, 2010-11 సంవత్సరంలో రాష్ట్రాలు కేంద్రం కలిపి చేసిన ఖర్చుల లోటు 3.20గా ఉంది. 2010-11లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు 3.24 ఉంటే, రాష్ట్రాలన్నీ 0-4శాతం మిగులులో ఉన్నాయి.
అప్పటి నుండి రాష్ట్రాల సరాసరి లోటు, కోవిడ్ వచ్చే వరకు చాలా తక్కువగా ఉంది. దాదాపు 0.05 మాత్రమే ఉండింది. కేంద్రం లోటు మాత్రం 3.15 శాతం చుట్టూ తిరుగుతుండింది. దీనంతటినీ చూస్తే మనకు రాష్ట్రాలు బాధ్యతాయుతంగా ఉన్నాయని కేంద్రమే తెలివి తక్కువగా వ్యవహరించిందని అర్థం అవుతుంది. ఈ వ్యత్యాసం ఆర్థిక లోటు విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు తమ విధానాలను ఆత్మ విమర్శ నాత్మకంగా పరిశీలించుకోవాలి. తమ విధానాలు ఎక్కు వ ఉచితాలు పంచుతున్నాయో లేదో గమనించుకోవాలి.
కేంద్రం ఎన్నయినా ఉచితాలు ఇవ్వవచ్చని, రాష్ట్రాలు మాత్రమే ఆర్థిక నియంత్రణ కలిగి ఉండాలని భావిస్తున్నట్టుగా బీజేపీ వైఖరి ఉంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఈ ఉచితాల ఆశ చూపే నెగ్గిందన్నది బహిరంగ రహస్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో 3.34కోట్ల కుటుంబాలు ఉన్నాయి. యూపీలో ఎన్నికలు రాగానే ప్రధానమంత్రి 'జన్ ధన్ యోజన' కింద 7.86కోట్ల ఖాతాలు తెరిచారు. అందులో 5.33కోట్ల కుటుంబాలకు రూపీ కార్డులు మంజూరు చేశారు.
బ్యాంక్ ఆఫీసర్ల సంఘం నాయకుడు థామస్ ఫ్రాన్సిస్ మాటల్లో... దాదాపు 3.4 కోట్ల మంది ముద్రా లోన్ కింద రూ.18,000 అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులన్నీ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సి.జి.టి.ఎం.ఎస్.ఇ) పథకం కింద చేర్చబడ్డాయి. అందువలన ఒకవేళ ఈ అప్పులు తీర్చకపోయినా బ్యాంకులకు నష్టం కలగదు. అలాగే పి.ఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు 7.8లక్షల ఆర్థిక సహాయం అందింది. 2019-2022లో 'అటల్ పెన్షన్ యోజన' కింద యూపీలో 5కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించబడింది. ప్రభుత్వం తన చేతులు కాల్చుకోకుండా ఈ పథకాలన్నీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే అందించబడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ గుజరాత్ ఎన్నికల వాగ్దానాలకు వచ్చేసరికి బీజేపీని మించిపోయింది ఆప్. అందువల్లనే కాబోలు ప్రధాని తన ఎన్నికల ప్రసంగాలలో ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆప్ ఇచ్చే ఉచితాలు ఆర్థికాభివృద్ధిని కుంటు పరుస్తాయని బీజేపీ భావించినట్లయితే, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి, దానిని ఎన్నికల అంశంగా మార్చుకుని దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల బరిలో తేల్చుకోవాలి. సుప్రీంకోర్టు కూడా తన పరిధిని అతిక్రమించి శాసనాలు చేయడంలో రాజకీయ నిర్ణయాలలో తలదూర్చకూడదు. ఉచితాల కన్నా దేశంలో ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల వంటి తక్షణం తేలాల్సిన, ముఖ్యమైన, కీలకమైన అంశాలు అనేకం ఉన్నాయి. మొత్తం విషయమే గందరగోళంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం, పేదలకు చేసే సామాజిక సంక్షేమ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తుందేమో! అశ్విన్ ఉపాధ్యాయ అనే బీజేపీ నాయకుడు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వాగ్దానాల గురించి ప్రస్తావించినప్పుడు, ఎం.జి.ఎన్.ఆర్.ఎన్.జి.ఏ ని ఉదాహరణగా చూపడం గమనించవలసిన అంశం.
మరి ధనికులకు అందే ఉచితాల మాటేమిటి?
ఉచితాలు పేదలకు ఇవ్వాలా? ధనికులకు ఇవ్వాలా? అనేది మౌలికమైన ప్రశ్న. ధనికులకిచ్చే కార్పొరేట్ పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటోంది? రెవెన్యూ లోటుతో ఈ రాయితీలు ఇవ్వడం లేదా? ధనికులు ప్రతి ఏటా రూ. లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను రాయితీలు పొందుతున్నారు. అవన్నీ బడ్జెట్ అనుబంధ పద్దులలో కనిపిస్తాయి. 2019లో నరేంద్రమోడీ అమెరికా యాత్రకి వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 30శాతం నుంచి 22శాతానికి తగ్గించి స్టాక్ మార్కెట్ మన్ననలు పొందింది. బహుశా ఈ పన్నుల కోత ట్రంప్‌ని ఆయన భజనపరులను మెప్పిస్తుందనే భావన అయి ఉండవచ్చు.
జీఎస్టీ కింద విధించిన పన్నుల భారం కంటే... వినియోగ వస్తువులపై ప్రస్తుత జీఎస్టీ రేట్లు 30-50శాతం తక్కువగా ఉన్నాయి. ధనికులకిచ్చే ఇటువంటి ఉచితాలకు అంతే లేదు. ఆసక్తికరంగా, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన ఇతర అంశాలతోపాటు, కార్పొరేట్ల రుణమాఫీ అంశాన్ని లేవనెత్తింది. మోడీ ప్రభుత్వం తమ మొదటి మూడేళ్ల పాలనలో... బ్యాంకులలో చెల్లించకుండా పేరుకుపోయిన అదానీ గ్రూపు అప్పులను రూ.75,000 కోట్లు మాఫీ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రూ. పది లక్షల కోట్ల కార్పొరేట్ పారు బకాయిలు రద్దు చేయబడ్డాయి. అందులో ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు రెండు లక్షల కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగాయి. ఇవన్నీ ఉచితాలు కావా? కేవలం రైతులకు వర్తించే అప్పుల రద్దులే ఉచితాలా? పైగా ఇతర రంగాలకు కూడా విస్తరించాలని ఆలోచన ఉన్న భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్ పథకం మాటేమిటి?
ఆదాయాలు, సంపదలలో తీవ్రమైన అసమానతలు గల దేశాలలో భారతదేశం ఒకటి. పైనున్న 1 శాతం ధనిక వర్గం ఆధీనంలో ఉన్న జాతి సంపద భాగస్వామ్యం 1990లో 16.1శాతం ఉండగా 2020లో 42.5శాతానికి పెరిగింది. అదే సమయంలో 50శాతం పేద ప్రజల భాగస్వామ్యం 8.8శాతం నుండి 2.8శాతానికి దిగజారింది. ఆదాయాల పంపిణీలో కూడా అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. పైనున్న 1శాతం ధనికుల భాగస్వామ్యం 1990లో 10.4శాతం నుంచి 2020కి 21.7శాతానికి ఎగబాకింది. కింది 50శాతం పేదల భాగస్వామ్యం అదే సమయంలో 22శాతం నుంచి 14.7శాతానికి దిగజారింది.
ఈ విధంగా అసమానతలు అంతకంతకు పెరిగిపోతున్న కాలంలో పేదలకిచ్చే ఉచితాల గురించి ప్రధానమంత్రి మాట్లాడటం అనుచితంగా ఉంది. పేదలకు మద్దతునిచ్చే, వారికి అవసరమైన, సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలని వాదించే ఆర్థికవేత్తల ఆలోచనలను కూడా ఈ సమయంలో పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంది.
- టి.ఎం.థామస్ ఐజాక్