Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో మతవాద పాలన పెరుగుతోంది. ప్రపంచ ఐక్యత దెబ్బతింటోంది. ఆర్థికంగా బలహీనపడిన అమెరికా మితవాదాన్ని పెంచుతోంది. మితవాదం మానవత్వాన్ని మంట గలుపుతోంది. అమెరికా ఆధిపత్య ఐక్యరాజ్యసమితి దీన్ని ఆపలేకపోతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో వినాశకర సాయుధ పోరాటానికి దిగజార్చిన పరిస్థితులు నేడు మరింత భయంకరంగా మారాయి. 21.9.2022న ఐరాస సర్వసభ్య సభ 77వ వార్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్, రష్యా సిగ్గులేకుండా ఐరాస సిద్ధాంతాలను ఉల్లంఘించిందన్నారు. ఈ ఉల్లంఘనలలో అమెరికా పాత్రను మాత్రం బిడెన్ ప్రస్తావించలేదు. తమ పరోక్ష ప్రాతినిధ్య యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యాన్ని ప్రకటించలేదు. ఉక్రెయిన్పై ఆయుధీ కరణను పెంచమని, ఈ పక్షపాత ప్రవర్తనతో బిడెన్ తన మిత్రదేశాలను ప్రోత్సహించాడు.
అమెరికా తీరు ఉక్రెయిన్ వివాదం ముగియడానికి బదులు తీవ్రమయేలా ఉంది. ఈ తీవ్రత ఎంత పెరుగుతుందో చెప్పలేం. యుద్ధం తీవ్రమయే కొద్దీ అది విస్తృతమయే అవకాశం పెరుగుతోంది. అమెరికా దాని మిత్రదేశాలు, రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించడానికి సిద్ధమవుతున్నాయి. రష్యాను బలహీనపర్చడమే వాటి లక్ష్యం. దీనివల్ల ఐరాస, ప్రత్యేకించి భద్రతా మండలి, బలహీనపడుతుంది. ప్రపంచ పాలనా వ్యవస్థ స్తంభిస్తుంది. పేదరికం, ఆకలి, పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పు, భూతాపం, ప్రజారోగ్య ప్రమాదాలు పెరుగుతాయి. ప్రపంచాన్ని ప్రమాదంలో పడవేసే తీవ్ర సమస్యల పరిష్కారంలో ఐరాస విఫలమవుతుంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ 77వ జనరల్ అసెంబ్లీ ప్రారంభ వ్యాఖ్యలలో... 'ప్రపంచం ప్రమాదంలో పడింది, స్తంభించింది' అని హెచ్చరించే స్థాయికి పరిస్థితి దిగజారింది. ప్రపంచ దేశాలు నిష్క్రియాపరత్వంలో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్లో ఆగిన వాహనాల లాగా కదలలేకుండా ఇరుక్కుపోయాయి.
మానవాళి భవిష్యత్తును ప్రమాదంలో పడేయగల అనేక వర్తమాన, భవిష్యత్తు సంబంధ మౌలిక అంశాలను, సహజ లక్షణాలను, కారకాలను ఐరాస సెక్రటరీ జనరల్ వివరించారు. కానీ ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణ, తత్సంబంధిత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పోలిస్తే వాతావరణ సమస్యలు, అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలకు సంబంధించి ఆయన ప్రస్తావించిన ''అపాయాల అడవి'', ఐరాస 2030 నిర్దేశిత అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి లేకపోవడం వంటి అనేక అంశాలు ప్రపంచ అభివృద్ధిని ఎక్కువగా అడ్డుకుంటున్నాయి. ఐరాస ప్రధాన కార్యాలయంలో దేశాధినేతలు భయంకరమైన అనేక సమస్యలను వినిపించారు. సమస్యల్లో చిక్కుకున్న ప్రపంచ అశాంతి దృశ్యరూపాలను ప్రదర్శించారు. సమస్యల పరిష్కారాల అత్యవసర ఆవశ్యకతలను సూచించారు. అయితే దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. అవి అభిప్రాయ భేదాలతో విభజించబడ్డాయి.
సమస్యలకు పరిష్కారం కుదిరినా కదరకున్నా నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ఐరాసను అంతిమ చర్చా వేదికగా భావిస్తారు. అయితే వారు ప్రపంచ పర్యవేక్షక సంస్థ ఐరాస ప్రస్తుత బలహీనతలను గుర్తించాలి. కలిసి పనిచేసే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కలిసి పనిచేయాలి. ఐరాసను, ప్రత్యేకించి భద్రతా మండలిని, చీల్చి బలహీన పరిచే భౌగోళిక రాజకీయ ఆటలలో సభ్యదేశాల కొనసాగింపును అనుమతిస్తే, అంతర్జాతీయ పాలనా నిర్మాణం అసంబద్ధం అవుతుంది. దేశాలు మళ్లీ ఆటవిక చట్టాలకు లోబడే స్థితి దాపురిస్తుంది. ఐరాస సంస్కరణల గురించి చాలా చర్చ జరిగింది. ఐరాసను నిష్క్రియాపరత్వం నుండి కాపాడటమే నేటి ప్రధాన అవసరం. ఐరాస పనిచేయాలంటే, సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ విజ్ఞప్తి చేసినట్లు, దేశాలు ''ఒకటిగా, ప్రపంచ కూటమిగా, ఐక్య రాజ్యాలుగా పనిచేయాలి''. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి మాటలు, చర్చల ద్వారా అనుకూల పరిస్థితులను కల్పించడంతో సంఘటిత ప్రయత్నాలను ప్రారంభించవచ్చు.
ఐరాస మానవ హక్కుల మండలి 51వ సెషన్లో, 'అంతర్జాతీయ మానవ హక్కుల రాజకీయీకరణ ప్రమాదాలు' అనే అంశంపై 19.9.2022న చైనాలోని జిలిన్ విశ్వవిద్యాలయం అంతర్జాల సమావేశం నిర్వహించింది. మానవ హక్కుల రాజకీయీకరణ ప్రతికూల ప్రభావాన్ని తొలగించాలని, సహకారం, సంభాషణలతో అంతర్జాతీయ మానవ హక్కుల అభివృద్ధిని ప్రోత్సహించాలని ఈ సమావేశంలో నిపుణులు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మానవ హక్కుల రాజకీయీకరణ పాత ధోరణే. ఆర్థిక ఆంక్షలు, సాంకేతిక దిగ్బంధనాలు, సైనిక దాడులతో ప్రపంచ ఆధిపత్య కొనసాగింపునకు అమెరికా మానవ హక్కులను, ఆర్థిక సైనిక సమస్యలను, పదేపదే జోడించిందని జిలిన్ విశ్వవిద్యాలయ మానవ హక్కుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ లియు హాంగ్జెన్ అన్నారు. మానవ హక్కులను రాజకీయం చేయడం వల్ల మానవ హక్కుల విలువ దెబ్బతింటుందని, అలాంటి సమస్యల పరిష్కారానికి ఐరాస వ్యవస్థలో సమాన చర్చలు, నిజాయితీ గల సహకారం ఉండాలని ఆమె అన్నారు. మానవ మర్యాద, మానవ హక్కుల సమావేశాలు, ప్రతి దేశం స్వతంత్య్ర మానవ హక్కుల మార్గాన్ని ఎంచుకునే హక్కుపై సార్వత్రిక గౌరవం ఉండాలని కూడా అన్నారు.
''పాశ్చాత్య మానవ హక్కుల భావనలో రాజకీయ ఘర్షణ సంబంధిత అంశాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు మానవ హక్కుల సమస్యలను రాజకీయ దృష్టితో గమనిస్తాయి. మానవ హక్కుల సమస్యల సాకుతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయి'' అని సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ మానవ హక్కుల కేంద్రం డైరెక్టర్ మావో జున్క్యాంగ్ అన్నారు. మానవ హక్కుల సిద్ధాంతం, వ్యవస్థ, అభ్యాసం, సంస్కృతి ఒక నిర్దిష్ట ప్రాంత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాలలో పాతుకుపోతాయి. మానవ హక్కుల వైవిధ్యం సహజమే. అయితే పాశ్చాత్య దేశాలు తమ మానవ హక్కుల భావనను సాంస్కృతిక ఔన్నత్యం అనే అవగాహనతో ఇతరులపై రుద్దుతున్నాయని, ఇది అంతర్జాతీయ మానవ హక్కుల అమలుకు ఆటంకమని ఆయన అన్నారు. జాతీయ ప్రయోజనాలను అందించడానికి, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు, విదేశాల్లో సైనిక జోక్యాలకు మానవ హక్కులు ఓ సాకుగా పరిగణించబడుతున్నాయని ఆయన చెప్పారు. ''మానవ హక్కుల ప్రోత్సాహానికి ఘర్షణ కంటే సహకారం, సంభాషణలు సరైన మార్గం. ఇదే ఐరాస మానవ హక్కుల మండలి కార్యనిర్వాహక యంత్రాంగ ప్రాథమిక సూత్రం'' అని కూడా ఆయన అన్నారు.
మానవ హక్కుల రాజకీయీకరణ అంతర్జాతీయ మానవ హక్కుల చట్ట ఉద్దేశానికి విరుద్ధమని, అంతర్జాతీయ చట్ట సార్వత్రికతను అణగదొక్కుతుందని నంకై విశ్వవిద్యాలయం మానవ హక్కుల పరిశోధనా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ టాంగ్ యింగ్క్సియా అన్నారు. విదేశాంగ విధాన స్వీకరణకు, ఏకపక్షవాద అమలుకు, మానవ హక్కుల దౌత్య ప్రోత్సాహానికి మానవ హక్కులను ఒక సాధనంగా ఉపయోగించడం మానవ హక్కుల రాజకీయీకరణ సారాంశం అని ఆమె అన్నారు. సార్వత్రికత, మానవ హక్కుల భావనకు పునాది అని, అందరినీ కలుపుకొని పోవడమే మానవ హక్కుల చైతన్యం అని, ఈ రోజు మనం ఆచరిస్తున్న మానవ హక్కుల వ్యత్యాసాలకు సార్వత్రికత పరిష్కారంగా ఉండాలని టాంగ్ అన్నారు.
మనం మన పాలకవర్గ మతవాదాన్ని అడ్డుకోవాలి. సార్వత్రి కతను, విశ్వజనీనతను పాటించాలి. బలహీనపడ్డ అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని మరింత బలహీనపర్చాలి. సామ్రాజ్యవాద వ్యతిరేక, అమెరికాయేతర ఆర్థిక సామాజిక కూటములను బలపర్చాలి. రాజ్యాంగ తటస్థతను పునరుద్ధరించాలి. పొరుగు దేశాలతో సఖ్యత సాధించాలి. ఐరాస ద్వారా ప్రపంచ ఐక్యత, మానవత్వ వికాసాలను ప్రోత్సహించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి