Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటిం చారు. వెంటనే దానిని హాస్యాస్పదంగాను, బూటక మైనదని గాను పేర్కొన్న భారతీయ జనతా పార్టీ రెండు రోజుల తర్వాత తాము కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్టీలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నోటి గుండా ప్రకటించింది. వీరిరువురి ప్రకటనలూ చిత్తశుద్ధిలేని శివ పూజకు నిదర్శనం కాగా, ఈ రోజుల్లో రిజర్వేషన్ల వలన కలిగే ప్రయోజనం నేతి బీరకాయ లోని నెయ్యి వంటిదే. కుల మూలాల వల్లనే భారత సమ్మిళిత వృద్ధి విచ్చిన్నమైందని మేధావులు కూడా గుర్తించక పోతే బూర్జువా నాయకులకు ఆ నైతికత ఎలా వస్తుంది? దేశ జనాబాలో ఎస్సీలు 20శాతం, ఎస్టీలు 13శాతం కానీ అమలవుతున్న రిజర్వేషన్లు 15శాతం, ఏడున్నర శాతం. బీసీలు సగటున 50శాతం కాగా అమలవుతున్నది (8రాష్ట్రాల్లోనే) 29శాతం మాత్రమే. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు.
నిజానికి బూర్జువా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ఆర్థికపరంగా ఎగువ మధ్యతరగతి, ఆపై వారిని ఎక్కువగా ప్రసన్నం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లాంటి వారికి రిజర్వేషన్ల కల్పన అస్సలు ఇష్టం లేదు. నిషేధించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ వారి అనుయాయుల కోపాగ్ని చల్లార్చడం కోసం అగ్రవర్ణాలలోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం కేటాయిస్తున్నామన్న తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అందులో అవకాశం ఉండాలన్న ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చేలా కేంద్రం సఫలీకృతం అయింది. దీంతో రిజర్వేషన్లకు అర్హత ఉన్న వారు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంలో ఉద్భవించిందే ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ గాంబీర్య ప్రకటన. దీనిని తిప్పి కొట్టాలంటే పప్పులు ఉడకవని మరింత పలుచన అవుతామని భావించిన బీజేపీ మేము అధికారంలోకి వస్తే 10శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు కల్పిస్తామని ప్రకటించాల్సి వచ్చింది.
భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వలన అనేక వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల వారు కొంతమేర లబ్ధి పొంది బాగుపడిన మాట వాస్తవమే. ఈ రిజర్వేషన్ల కల్పనకు ఉపకరించింది ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు పర్మినెంట్ ఉద్యోగమనే కాన్సెప్ట్నే పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొన్ని డిపార్టుమెంట్లు మినహా అనేక చోట్ల ఇప్పటికే 70శాతం ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టీ కరించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్లలో 10 లక్షల దాకా ఖాళీలు ఉన్నా, కానీ వాటిని నింపడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఈ ఖాళీలను భర్తీ చేస్తే షెడ్యూల్డ్ తెగలకు లక్ష ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగంలో గతం కన్నా మూడు లక్షల మేర తక్కువగా ఉద్యోగులు పనిచేస్తున్నారని స్వయానా నిర్మల సీతారామన్ రివ్యూ చేసి చెప్పారు. ఈ బ్యాంకింగ్ రంగంలో దాదాపు నాలుగు లక్షల ఖాళీలు ఉన్నాయని తెలుస్తున్నది. వీటిని భర్తీ చేస్తే 40 వేల ఉద్యోగాలు కేవలం షెడ్యూల్ తెగలకే లభిస్తాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ పని చేయగలదా? లేదా రాష్ట్రాలను డిమాండ్ చేసి ఎక్కడెక్కడ అయితే ఖాళీలు ఉన్నాయో వాటిని నింపడానికి ప్రయత్నం చేయగలరా? తమ అధీనంలోని డిపార్గ్మెంట్లలో ఖాళీలను భర్తీ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అక్కడి ఖాళీలను నింపడానికి ప్రయత్నం చేయకుండా ఎస్టీలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం చిత్తశుద్ధి లేమినే సూచిస్తున్నది. ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లక్ష నలభై వేల మంది ఎస్టీలకి, రెండు లక్షలా ఎనబై వేలమంది ఎస్స్సీలకి, ఐదు లక్షలకు పైగా ఓబీసీలకి అన్యాయం చేస్తున్నట్లు లెక్క.
ఎన్ని ఖాళీలను భర్తీ చేసినప్పటికీ మొత్తం కార్మిక వర్గంలో నాలుగు శాతానికి తక్కువే రిజర్వేషన్లు కల్పించగల సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ నాలుగు శాతం సంఘటిత రంగంలో 10శాతం రిజర్వేషన్లు అంటే 0.4శాతం అన్నమాట. 10కోట్ల జనాభా ఉన్న షెడ్యూల్డు తెగలకు ఇది ఏ మాత్రం సరిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను, ప్రభుత్వ రంగ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ ద్వారా అన్ని కొలువులను కాంట్రాక్టీకరిస్తున్నారు. అక్కడేమీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. తద్వారా రాజ్యాంగం గుర్తించిన తెగలకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. నాలుగవ తరగతి ఉద్యోగాల నియామకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మంగళం పాడేశాయి. ఈ నాలుగవ తరగతి ఉద్యోగాలలో అత్యధిక శాతం వెనుకబడిన లేదా షెడ్యూల్డ్ కులాల, తెగలకు సంబంధించిన వారే పనిచేస్తుంటారు. అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నేరుగా ఎవరి బాగునైతే రాజ్యాంగం కోరుకున్నదో వారికే అన్యాయం జరుగుతుందన్న మాట. ఇక ప్రయివేట్ సెక్టార్లో జరుగుతున్న నియామకాలన్నీ చాలా తెలివైన వారినో లేదా అత్యంత అనుయాయులనో వరిస్తున్నాయి. ఇక్కడ ఏ రకమైన రిజర్వేషన్లు వర్తించవు. ఈ సమాజం కుల ప్రాతిపదికన ఆర్థికంగా వెనుకబడి ఉన్నదని తెలిసినప్పటికీ ఉద్యోగాల కల్పనలో కాస్త తోడ్పాటును అందించాలన్న స్పృహ ప్రభుత్వాలకు కరువైంది. వెనుకబడిన వారి అభ్యున్నతికి ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పాము కదా అని సమర్థించుకుంటారు. కానీ నేటి ప్రభుత్వ పాఠశాలలు కేవలం మిడ్ డే మీల్స్ అందించే ఒక పేద విధ్యార్థుల అన్నదాన సత్రాలుగా మారాయి. నాణ్యమైన విద్య నానిపోయిన నినాదంగా మారి వెనుక బెంచీలో కూర్చుంది. అనేక చోట్ల భోజనానంతరం తరగతులు మూతపడతాయి. రిజర్వేషన్ల ద్వారా ప్రవేశం దొరికినా వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడంతో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు బాగా పడిపోయాయి. ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ల శాతం పెంచడానికన్నా ప్రభుత్వ రంగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టీకరణ కాకుండా పర్మనెంట్ నియామకాలనూ చేపడితే అది ఎన్నికల వాగ్దానంగా కాకుండా సామాజిక అసమానత లను తగ్గిస్తుంది.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016