Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనిమిదేండ్ల కిందట భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, ప్రజా జీవితాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నది. అధికారంలోకి వచ్చే ముందు అవినీతి రహిత పాలన ప్రజలకు అందిస్తామని, జనధన్ ఖాతాల ద్వారా ప్రతి ఒక్కరికి 15లక్షలు వేస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువస్తామని, ధరలు తగ్గిస్తామని, ప్రజలపై ఆర్థిక భారాలు ఉండవని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగం నిర్మూలిస్తామని, రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ కష్టాలు బీజేపీ పాలనలో ఉండవని ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన వందిమాగదులు ఎన్నికల ప్రచారంలో బడాయి ప్రసంగాలు చేశారు. ఎక్కడలేని హామీలు ఇచ్చారు. మొదటిసారి ప్రజలకు ఎక్కడలేని ఆశలు చూపి అధికారంలోకి రాగా, రెండోసారి ప్రజల భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రాగలిగారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే రిహార్సల్స్ మొదలుపెట్టారు. కానీ, మోడీ పాలనా విధానాలపై ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. బీజేపీని అధికారంలో నుంచి తొలగిస్తే గాని ఈ దేశానికి పట్టిన పీడ విరగడ కాదని గ్రహించాలి.
అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ మేకవన్నె పులి లాగ ప్రజల రక్తమాంసాలను పీలుస్తున్నది. పెద్దనోట్లను రద్దు చేసి ప్రజలను అగచాట్ల పాలు చేసింది? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. చివరికి వందల మంది సామాన్యుల ప్రాణాలు బలి తీసుకున్నది. కానీ ఒక్క రూపాయి నల్లధనాన్ని బయటకు తీసుకురాలేకపోగా, దేశ సంపదను దోచుకుంటున్న బడాబాబుల నల్లధనాన్ని తెల్లతనంగా మార్చింది.
విదేశీ స్విస్ బ్యాంకులలో భారత కుబేరుల లక్షల కోట్ల నల్లధనం ఉందని, దాన్ని మన దేశానికి తరలించి ప్రజలకు పంచుతామని ఎక్కడలేని ఆశపెట్టింది? ప్రతి ఖాతాలో 15లక్షలు వేస్తామని చెప్పింది. వెంటనే ఖాతాలు తెర్చుకోవాలని ఆర్భాటంగా ప్రచారం చేసింది. సామాన్య ప్రజలు నిజమేనని బ్యాంకుల చుట్టూ తిరిగి ఖాతాలు తెర్చుకున్నారు. ఎనిమిదేండ్లు దాటినా అందులో ఒక్కపైసా పడలేదు!
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పినవారు, ఉన్న ఉద్యోగాలే ఊడగొడు తున్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాదిమంది అసంఘటిత, సంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. యువత పెడదారి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకుంటున్న విధానాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి?
కరోనా మహమ్మారితో లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వైద్యం అందించడంలో కేంద్ర పాలకులు పూర్తిగా విఫలం అయ్యారు. శాస్త్రీయ విధానంతో వైద్యం అందించడానికి బదులుగా, మూఢనమ్మకాలతో అశాస్త్రీయమైన పద్ధతులతో చప్పట్లు కొట్టటం, దీపాలు వెలిగించడం, భజనలు చేయడం లాంటి పనికిమాలిన అశాస్త్రీయ విధానాలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది కేంద్ర ప్రభుత్వం. సరైన సమయంలో సరైన వైద్యం అందించడంలో విఫలమైంది? వైద్యం అందించడానికి కావలసిన దావాఖనాలు, మందులు, జనాభాకు తగిన విధంగా డాక్టర్లు, సంబంధిత సిబ్బంది లేదనే సంగతి దేశ ప్రజలకు కరోనా వలన తేటతెల్లమైంది! చివరికి ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ప్రజలు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది?
సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగంలో నల్లచట్టాలు తీసుకువచ్చి బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నించింది. తద్వారా వ్యవసాయాన్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టాలనే అసలు కుట్ర బట్టబయలైంది. దీంతో ఏడాదికిపైగా మడమ తిప్పని పోరాటం చేసిన రైతాంగం ముందు కేంద్రం తలవంచక తప్పలేదు. భేషరతుగా చట్టాలను ఉపసంహరించు కుంది. దేశానికి రైతాంగం పోరాట స్ఫూర్తినిచ్చింది. ''బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ'' అన్నట్టుగా కేంద్ర పాలకుల అహంకారం రైతుల ముందు తలవంచక తప్పలేదు. అయితే దెబ్బతిన్న సర్పం బుస కొడుతూనే ఉంది ! ఆదను చూసి రైతులను దెబ్బ కొట్టాలనే ప్రయత్నంలో అదును కోసం ఎదురుచూస్తున్నది!
ఈ దేశ స్వావలంబనకు కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా అమ్మాలనే ప్రయత్నాలను వేగంగా ముందుకు తెస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే రైల్వేలు, విమానయానం, టెలికాం, స్టీల్, గనులు, బ్యాంకింగ్, ఏల్ఐసీ, ఓడరేవులు లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో తనకిష్టమైన వాళ్లకు కట్టబెట్టాలని కిందా మీదా పడుతున్నది. బిఎస్ఎన్ఎల్ (భారతీయ సంచార్ నిగం లిమిటెడ్)లో లక్ష మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. బలమైన ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యపరిచి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ కార్మిక వర్గం రైతాంగం, ప్రజల సంఘీబావంతో తీవ్రంగా పోరాడుతున్నది.
75ఏండ్ల స్వాతంత్రంలో ఏనాడూ లేని విధంగా జీఎస్టీ భారాలు మోపి ప్రజల నడ్డి విరుస్తున్నది. ''ఏమి కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు'' అనే పరిస్థితి తీసుకు వచ్చింది. ఎటు చూసినా ధరల భారం విపరీతంగా పెరుగుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు సగటు వేతన జీవులను భయపెడుతున్నాయి. ఉల్లిగడ్డ మొదలుకొని ఉప్పు, పప్పు వరకు నిత్యావసరాలు మండిపోతున్నాయి. ధరలపై నియంత్రణలేని మోడీ ప్రభుత్వం... దోచుకునే వాడికి దోచుకున్నంతగా అన్నట్టు ఈ దందా సాగుతుంటే దానికి అండగా నిలుస్తున్నది. ఉపాధి హామీపై దొంగ దెబ్బతీస్తున్నది.
ఈ దేశంలో వందమంది సంపద ఒక్కరి చేతుల్లో పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. కరోనా సమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితి క్షీణించి పోగా, ఈ దేశంలోని కుబేరుల సంపద అందనంత పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ, అంబానీ లాంటి వాళ్ళు మొదటి పది మందిలో చేరిపోయారు. అదానీ సంపాదన రోజుకు అక్షరాల రూ.1,612 కోట్లు. ప్రస్తుతం అదానీ ఆస్తి 10,94,400 కోట్ల రూపాయలు దాటింది. ముఖేష్ అంబానీ రూ.7,94,700 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచాడు. 2022 సంవత్సరంలో 1100 మంది భారత కుబేరుల జాబితాలో మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లుగా ఐఐఎఫ్ఎల్ హురుల్ సర్వే వెల్లడించింది. ఎనిమిది వేల కోట్ల సంపద కలిగిన కుబేరుల సంఖ్య ఈ దేశంలో 221గా నమోదయింది. వంద రూపాయలు కూలి దొరకని పరిస్థితుల్లో సామాన్యుడు ఉంటే, కుబేరులు రోజుకు వందల కోట్ల సంపద నార్జిస్తున్నారు. మరి మోడీ ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తున్నట్టు? ఎవరి సంక్షేమం కోసం పాటు పడుతున్నట్టు?
భారతదేశం ఫెడరల్ వ్యవస్థ. మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఒక సమాఖ్యగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, విధులు, నిధులు విభజన చేశారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గత ఎనిమిదేండ్లలో క్రమంగా ప్రజల హక్కులనే కాకుండా, రాష్ట్రాల హక్కులనూ హరిస్తున్నది. తన మాట వినని ప్రభుత్వాలను కూల దోస్తున్నది. అనుకూలమైన ప్రభుత్వలుగా మార్చుకుంటున్నది. ఒక సర్వే ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాలలో 250మంది శాసనసభ్యులను అంగట్లో సరుకులుగా కొనుగోలు చేసి నీచమైన ఒరవడికి నడుం కట్టింది! రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉన్న పన్నులు, వ్యవసాయ, విద్యుత్, పారిశ్రామిక, శాంతిభద్రతల అంశాలను కేంద్రం తన హస్తగతం చేసుకున్నది. స్వతంత్ర వ్యవస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, సిఐడి వంటి కీలకమైన వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని విపక్షాలపై దాడిచేస్తున్నది. న్యాయవ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నది. ప్రతిపక్షమన్నదే లేకుండా నిర్మూలించే నిరంకుశ పోకడలు పోతున్నది. బలమైన ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం మనజాలదు. ప్రతిపక్షాలే ప్రజాస్వామ్యానికి రక్ష! బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలులేని నియంతృత్వ అధికారాన్ని కోరుకుంటున్నది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న సంగతి మరిచి వ్యవహరిస్తే ఎంతటి నియంతలైనా మట్టిగరవక తప్పదని గుర్తుచేయడం ఇప్పుడు పౌరసమాజం బాధ్యత.
- జూలకంటి రంగారెడ్డి