Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని రంగాల్లో వేగంగా మారుతున్న పరిస్థితులను అందిపుచ్చుకునేందుకు కాలంతోపాటు మనిషి పెరుగుతున్నాడు. ఆకాశమే హద్దుగా అవకాశాలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. అది సహజం. కానీ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కఠోర శిక్షణ ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ, జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలంటే, కోచ్ తప్పనిసరి. అందుకు వ్యయప్రయాసల కొర్చి శ్రమించాల్సి వస్తుంది. అప్పుడే విజయ శిఖరాలను తాకుతారు. పిటి ఉష, కరణం మళ్లేశ్వరి, పీవి సింధు, సైనా, సానియామిర్జా, సచిన్, గంగూలీ, రాహుల్, లక్ష్మణ్, ధోని, మిథాలీరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ కోవంలోకి వస్తారు. వీరంతా శిక్షణ తీసుకుని పైకి వచ్చిన వారే. ఆర్మీ, పోలీసు, సివిల్ సర్వెంట్స్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన తర్వాతనే వారికి విధులు అప్పగిస్తారు. ఐటీ రంగంలో రాణించాలంటే, అందుకు సంబంధించిన కోర్సులు చదవాల్సి ఉంటుంది. అప్డేట్స్ కోసం శిక్షణ ఇస్తారు. అది నిరంతర ప్రక్రియ. ఉపాధి అవకాశాన్ని ఎంచుకోవాలన్నా... వారికి శిక్షణ తప్పదు. ఇటీవల వంటలు ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. అందులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబోలు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చేవారికి ఉపన్యాసం, భాషపై పట్టు సాధించేందుకు కూడా శిక్షణాలయాలు వెలిశాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, మాకెందుకు చెబుతున్నారని మీరడగవచ్చు. అందుకు కారణం లేకపోలేదు. చివరకు శిక్ష నుంచి తప్పించుకునేందుకు శిక్షణ పొందుతున్న రాజకీయ నాయకులు గురించి మీకు తెలుసా... ఇటీవల కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే హెరాల్డ్ పత్రికకు చందాలు ఇచ్చినందుకు వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో శిక్షణ తీసుకునేందుకు ఆ నోటీసులు పట్టుకుని అఘమేఘాల మీద ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులు ఏం అడుగుతారు. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు. వాటికి సూటిగా, స్పష్టంగా సమాధానమెలా చెప్పాలి... తదితర అంశాలపై కులంకషంగా లాయర్లు వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్ష నుంచి తప్పించుకునే కిటుకులు నేర్పిస్తున్నారు. అందుకోసం ఏఐసీసీ శిక్షణ ఇస్తుంది అని సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు...
- గుడిగ రఘు