Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అది మాటైనా, ఉపన్యాసమైనా ఎవరి శైలి వారిది. కాకపోతే కొంతమంది మైకు పట్టుకుంటే మాత్రం పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఎదురుగా జనం ఉంటే చాలు గంటల తరబడి స్పీచ్ దంచి కొడుతుంటారు. రౌద్ర, బీభత్స రసాలను పండిస్తూ ఉంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభలోనూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు అదే విధంగా 'ఉపన్యాస భయోత్పాతం...' సృష్టించారు. తమ సవాళ్లు, ప్రతి సవాళ్లతో స్టేజీని ఊపేశారు. వాటన్నింటినీ ఓపిగ్గా విన్న ముఖ్య అతిథి, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి... చివర్లో ప్రసంగించారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి కృషి, ఆయన పాత్ర, వర్తమాన పరిస్థితుల గురించి సోదాహరణంగా వివరించారు. ఆ తర్వాత సభ ముగిసింది. భోజనాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వెళుతూ ఓ పెద్ద మనిషి... ఇంత మంది మాట్లాడారు, కానీ దేశం గురించి, దాని బాగోగుల గురించి ఒక్క ఏచూరి తప్ప ఎవరూ మాట్లాడలేదిందిరా అయ్యా... అని సణుగుతూ అక్కడి నుంచి కదలబోయారు. ఆ పక్కనే పశువుల కొట్టంలో ఉన్న ఓ కాపరి... 'ఆయనంటే కమ్యూనిస్టు నాయకుడు, జనం బాగు గురించి ఆలోచించే వాడు. అందుకే... దేశం గురించి అంతసేపు నెత్తీనోరు బాదుకున్నారు. మిగతా పార్టీల వాళ్లకు అదెందుకు పడుతుంది... వాళ్లంతా కాంట్రాక్టర్లు, వ్యాపారులే కదన్నా...' అనుకుంటూ బర్రెలు, గొర్రెలను అదిలించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ పశువుల కాపరి మాటలు విన్న తర్వాత... 'ప్రజలకు మనం ఏమీ తెలియదని అనుకుంటాం. కానీ వాళ్లకు అన్నీ తెలుసు. కాకపోతే సమయం, సందర్భం వచ్చినప్పుడే వాళ్లు బయటపడతారు...' అని అర్థమైంది.
-బి.వి.యన్.పద్మరాజు