Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచంద్రయ్య ఇంట్లో అంతా గంభీరంగా ఉంది. దానికి కారణం రాంచంద్రయ్యే! చెట్టంత ఎదిగిన కొడుకు మీద కేకలేశాడు! ఉద్యోగం చేయకుండా బలాదూర్‌గా తిరుగుతున్నాడని తండ్రి బాధ! ఎదురుగా నిలబడ్డాడు రాంచంద్రయ్య కొడుకు నరేష్. తండ్రి ఎన్ని కేకలేసినా ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
''ఏమిట్రా! నేనింత తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడవు?'' గరుమన్నాడు రాంచంద్రయ్య!
''ఏమి మాట్లాడాలి! అన్ని ప్రయివేటీకరిస్తున్నారు! అందుకే ప్రభుత్వ ఉద్యోగం దొరకటం లేదు!'' సమాధానం మిచ్చాడు నరేష్.
''ఏదైనా ప్రయివేటు ఉద్యోగం వెలగబెట్టలేక పోయావా?'' చిరాగ్గా అన్నాడు రాంచంద్రయ్య!
''కరోనా పేరు చెప్పి ప్రయివేటులో కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు!'' అన్నాడు విసురుగా నరేష్.
''అయితే మరేమి చేద్దామనుకుంటున్నారు దొరవారు?'' అన్నాడు రాంచంద్రయ్య.
''నాకు ఏదైనా బాధ్యత అప్పచెప్పు! అప్పుడు చూపిస్తా నా సామర్థ్యం ఏమిటో!'' అన్నాడు రమేష్.
కొడుకు మాటలకు ఆలోచనలో పడ్డాడు రాంచంద్రయ్య! వాడు చెప్పిందీ నిజమే కదా! అనుకున్నాడు. అంతలోనే ఒక విషయం గుర్తొచ్చింది!
''సరే! నీవు చెప్పినట్టే చేద్దాం! నీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తాను. అది సరిగ్గా నెరవేర్చాలి. బాగా ఆలోచించుకో!'' అన్నాడు రాంచంద్రయ్య!
''ఏ బాధ్యతైనా సరే! నెరవెరుస్తా నాన్నా! నన్ను నమ్మండి!'' అన్నాడు నరేష్ నమ్మకంగా.
''వాడంత నమ్మకంగా చెబుతున్నాడు కదా! వాడికి ఒక అవకాశం ఇవ్వండి! తనని తాను నిరూపించుకుంటాడు!'' అన్నది సీత కొడుకు మీద కొండంత నమ్మకంతో.
''సరే విను! నీమీద, మీ అమ్మకు ఉన్న నమ్మకంతో రికమండ్ చేసింది! కాబట్టి నీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెబు తున్నాను. నా ఫ్రెండ్ విజయ్‌కి కూతురి పెళ్ళికోసమని నాలుగు లక్షల రూపాయలు చేబదులు ఇచ్చాను. కూతురి పెళ్ళి చేయలేదు. నా డబ్బులు తిరిగియ్యలేదు. వాడు మన పక్కఊరిలోనే ఉంటున్నాడు. నేను వెళ్ళితే మొహం చాటేస్తున్నాడు! వాడి దగ్గరున్న ఆ నాలుగు లక్షలు తీసుకుని రావాలి. నీ చెల్లిలి పెళ్ళికి ఆ డబ్బు అవసరం! నీ బాధ్యత ఏమిటో అర్థమైందా!'' అన్నాడు రాంచంద్రయ్య.
''నాన్నా నా సామర్థ్యానికి సరిపోయే పని అప్పచెప్పావు! ఆ విజయ్ ఎక్కడున్నా సరే!'' మన డబ్బు నయాపైసలతో సహా వసూలు చేసుకొని వస్తాను! కాని తిరగటానికి నాకో బైకు కొనివ్వాలి!'' అన్నాడు నరేష్.
''కొత్తది కొనివ్వలేను గాని, నా బైకు తీసుకుని పో! ట్యాంకు ఫుల్లుగానే ఉంది! ఇదిగో రెండు వేలు ఖర్చులకు ఉంచుకో! ఇంకా అవసరమైతే మీ అమ్మనడుగు! ఆ విజయ్‌గాడు నీ మాట వినకపోతే నాలుగు తగిలించి ఆ డబ్బులు వసూలు చేసుకుని రా! ఆ ఊరి ఎస్ఐ నా క్లాస్‌మెట్! అంతా చూసుకుంటాడు!'' అన్నాడు రాంచంద్రయ్య!
బండి తాళం చేతులూ, డబ్బు అందుకున్నాడు నరేష్! తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కరించాడు.
''నన్ను దీవించండి! ఆ విజయ్గాడి మక్కెలిరగదన్ని, నా బండికి కట్టేసి తీసుకొస్తా!'' అన్నాడు.
''నా బాబే! నీవు అంత సమర్దుడివే నాన్నా వెళ్ళిరా!'' అంటూ సీత కొడుకుని దీవించి పంపింది.
రెండు రోజుల తర్వాత ఇంట్లో అందరూ కూర్చుని భోజనాలు చేసి తాపీగా మాట్లాడుకుంటున్నారు. పెరుగుతున్న ధరలు, ఖర్చులు, చేసిన అప్పుల గురించి రాంచంద్రయ్య ఆందోళన పడుతున్నాడు. అన్నింటికీ మించి కూతురు ఆమని పెళ్ళి గురించిన బెంగ ఎక్కువగా ఉంది. భర్త ఆందోళన సీతకు అర్థమైంది!
''ఆందోళన పడకండి! మన అబ్బాయి. సమర్ధుడు. అన్ని చక్కపెడతాడు. మీరు అప్పచెప్పిన పని గ్యారంటీగా పూర్తి చేసుకుని వస్తాడు చూడండి!'' అని సీత అంటుండగానే ఇంటిముందు బండి ఆగిన శబ్దం విన్పించింది!
''అందరూ బయటకి వచ్చి చూశారు! నరేష్ తన సైకిల్ మోటార్కి వెనక ఒక పెద్ద డబ్బా కట్టుకుని వచ్చాడు.
''చూశారా! నా కొడుకు ప్రతాపం! మీకు మాటిచ్చినట్లే ఆ విజరుని మక్కెలిరగ్గొట్టి డబ్బాలో ప్యాక్ చేసి తీసుకొచ్చాడు!'' అన్నది సీత గర్వంగా.
''ఏమిట్రా నిజంగానే ఆ విజరుగాడిని కొట్టి డబ్బాలో పడేసి తీసుకొచ్చావా? నీకు అధికారం ఇచ్చాను గాని, ఇంత తొంతరగా పూర్తి చేసుకొస్తావని అనుకోలేదు! ఉండు నీకు స్వీటు తీసుకొచ్చి తినిపిస్తా!'' అంటూ రాంచంద్రయ్య స్వీటు షాపుకి వెళ్ళాడు.
''మరి ఆ నాలుగు లక్షలేవిరా?'' అడిగింది తల్లి!
బైకు వెనక కట్టుకొని వచ్చిన బాక్స్ తెరిచాడు నరేష్. వెంటనే అందులోని నాలుగు పిల్లి కూనలు బయటకు దూకాయి! వాటిని చూడగానే నరేష్ చెల్లెలు ఆమని ఎంతో ముచ్చట పడిపోయింది. వెంటనే వాటిని ఎత్తుకుంది. వాటిని ముద్దు చేస్తుంటే నరేష్ ఫొటోలు తీశాడు. సీతకు కూడా పిల్లి కూనలు ఎంతగానో నచ్చాయి! తనూ వాటిని ఎత్తుకున్నది.
''ఎక్కడివిరా ఇంత ముద్దుగా ఉన్నాయి?'' అన్నది పిల్లి కూనలను ఆడిస్తూ.
''పక్కూరిలో తెచ్చానమ్మా! మనింట్లో లేవుకదా! ముద్దుగా ఉన్నాయి కదూ!'' అన్నాడు నరేష్ ఫొటోలు తీస్తూనే...
''అవున్రా అన్నయ్యా! చాలా ముద్దుగా ఉన్నాయి. కాని అన్నీ ఒకేలా ఉన్నాయి. ఎట్లా!'' అన్నది ఆమని బెంగగా..
''అందుకే వాటికి పేర్లు పెట్టాలి! మంచిపేర్లు పెట్టండి. మీ ఇద్దరిలో ఎవరు మంచిపేర్లు పెడితే వారికో గిప్టు ఇస్తాను'' అన్నాడు నరేష్ నవ్వుతూ.
ఏదో విసిరికొట్టిన శబ్దమై అంతా తిరిగి చూశారు!
చేతిలోని స్వీట్ బాక్స్ విసిరికొట్టి కోపంతో ఊగిపోతున్న రాంచంద్రయ్య కనబడ్డారు.
''ఒరేరు నీకు సిగ్గూ శరం ఏమైనా ఉందా? ఇంటికి పెద్ద కొడుకువి. ఇంటి బాధ్యతలు చూసుకో వాల్సిన వాడివి. మన డబ్బు వసూలు చేసుకుని రమ్మని, బాధ్యత అప్పగించాను. నీవు కోరినవన్ని సమకూర్చాను! రెండు రోజులు బలాదూర్‌గా తిరిగి, రెండువేలు ఖర్చు చేసి, పెట్రోలు ట్యాంక్ ఖాళీచేసి, డబ్బు తీసుకు రాకుండా పిల్లిపిల్లలను తీసుకుని వస్తావా? పైగా వాటికి పేర్లు పెట్టమంటావా? అది తీసుకుని రావటమే దండగా అనుకుంటే వాటికి నామకరణ, దానికి గిప్టులు కూడా ఇస్తావా? ఇవ్వన్ని చేస్తే మన అప్పులు తీరుతాయా? నీ చెల్లెలి పెళ్ళి అవుతుందా? మన సంసారం బాగుబడుతుందా ఆ విజరుగాడి దగ్గర అప్పు వసూలు చేసుకుని వస్తానని బీరాలు పలికి, ఇదా నీవు చేసిన ఘనకార్యం!'' నీకు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండే అర్హత లేదు!'' అంటూ రాంచంద్రయ్య నరేష్‌ని మెడపట్టి ఇంట్లోంచి గెంటేశాడు. (ఇటీవల దేశానికి తెప్పించిన చిరుత పులులకు, ఈ పిల్లి కూనల కథకు ఏమైనా పోలిక కనిపిస్తే రచయిత బాధ్యత వహించరు.)
- ఉషాకిరణ్, సెల్: 9490403545