Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో ఎక్కడైనా జనగణన (సెన్సస్) వలన కలిగే ప్రయోజనాల్లో 1850, 1860లలో అమెరికాలో జరిగిన జనగణనను శ్రేష్టమైనవిగా చెప్పవచ్చు. బానిసత్వ వ్యతిరేక ప్రచారకులు, బానిసత్వం రద్దు కావాలని వరుసగా జరిగిన జాతీయ జనగణన సంఖ్యలనుపయోగించారు. బానిసత్వ అనుకూల రాజకీయవేత్తల వాదనలకు భిన్నంగా వారు అమెరికాలో పెరుగుతున్న బానిసల సంఖ్యను చూపించారు. జనగణననుపయోగించి వ్యక్తీకరించిన ఇలాంటి సందర్భాలనేకం ఉన్నాయి.
భారతదేశంలో మొదటిసారిగా జనగణనను 1872లో వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో నిర్వహించారు. ఆ తరువాత వ్యాధులు, ప్రపంచ యుద్ధాలు, విభజనలు, అల్లర్లు, సంక్షోభాల లాంటి సందర్భాలున్నప్పటికీ 1881 నుండి 2011 వరకు ప్రతీ పది సంవత్సరాల కొకసారి భారతదేశం జనగణనను నిర్వహించింది. జనగణనను వాయిదా వేయడానికి కోవిడ్ 19ని సాకుగా చూపడం ఇప్పుడు పలచబడింది. ఎందుకంటే కరోనా మహమ్మారి భయంకరమైన రెండవ దశ మధ్యలో ఎన్నికలసభల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం ఆ మహమ్మారి నియంత్రణను మాత్రం నేరపూరితంగా నిర్వహించింది. కానీ ఒకప్పుడు తన ప్రజలను క్రమం తప్పకుండా లెక్కించిన అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడంలేదో బాధ్యత వహించి, వివరించే సాంప్రదాయం కూడా లేకుండా పోయింది. భారతదేశం తన పది సంవత్సరాల జనగణనను మినహాయించదని అధికారయుతంగా హామీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మనం ఒక జనగణనను కోల్పోయామని ప్రకటించవచ్చు.
పెద్ద శాంపుల్ సర్వేలు జనగణనతో సరిపోలవని తేలింది. సెన్సస్‌లో ప్రతీ భారతీయుడ్ని లెక్కించాలి. మొదటి సారిగా ప్రభుత్వం, 2017-18 సంవత్సరంలో వినియోగ వ్యయ పతనాన్ని నమోదు చేయకుండా వదిలివేసింది. జనగణన అంటే, ప్రభుత్వం ప్రతీ వ్యక్తికి సంబంధించింది అయినప్పుడు, ఆ డాటా నుండి దేన్నైనా దాచడం కష్టం. వయస్సు, లింగ, ఆర్థిక హౌదా, మతం, మాట్లాడే భాషలు లాంటి సమాచార సేకరణ, తరువాత క్రమానికి సంబంధించిన సమాచారాన్ని సమకూర్చుతుంది. జనగణన ద్వారా పొందిన సమాచారం సమస్యల పరిష్కారానికి, లోపాలను సరిచేసుకునే ప్రణాళికలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. 'బిగ్ డాటా' అనే పదం ఉనికిలోకి రావడానికి ముందే భారతదేశంలో జనగణన కాలక్రమేణా విశ్వసనీయమైన సంఖ్యలను అందించింది. 1961, 1971 జనగణనల మధ్య భారతదేశంలో వేగంగా క్షీణించిన లింగ నిష్పత్తి లాంటి ముఖ్యమైన కొలమానాలు బిడ్డకు జన్మనివ్వడానికి ముందు, తరువాత కాలానికి సంబంధించిన అంశాలు మగపిల్లల పక్షపాతం ఎలా ప్రతిబింబించాయో పుట్టిన, పుట్టని బాలికల హత్యలకు ఎలా దారితీసిందో భారతీయులను హెచ్చరించాయి.
మతాంధత, దురభిమానాల ద్వారా వృద్ధి చెందిన నిరాధారమైన కొన్ని ఆలోచనలను జనగణనలోని ప్రజల లెక్కింపు నాశనం చేసింది. ముస్లింల పునరుత్పత్తి రేటు కారణంగానే భారతదేశ జనాభా విస్ఫోటనం దిశలో ముందుందన్న సమాచార రహితమైన వాదనను, జనగణన అందించిన సమాచారం ఒక క్రమపద్ధతిలో తొలగించింది. మొత్తం సంతానోత్పత్తి రేటు(టోటల్ ఫెర్టిలిటీ రేటు)చాలా వేగంగా తగ్గుతూ, స్థిరీకరణ మార్గంలో ఉందని జనగణన రుజువు చేస్తుంది. ముస్లింలలో మొత్తం సంతానోత్పత్తి పతనం రేటు ఇతర మతస్థుల సంతానోత్పత్తి పతనం రేటు కంటే చాలా వేగంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటులో ఉండే వ్యత్యాసాలు, ప్రాంతాలు, సామాజిక-ఆర్థిక సూచికలను బట్టి ఉంటాయి గానీ కుల, మతాలను బట్టి ఉండవు. భారతదేశంలో నగరాలు, గ్రామాల మధ్య విడాకుల రేటులో వ్యత్యాసాలు ఉంటాయనే భావనను కూడా 2011 జనగణన తొలగించింది. నగరాల్లో విడాకుల రేటు (0.89శాతం) దాదాపు గ్రామీణ ప్రాంతాల విడాకుల రేటుతో (0.82శాతం) సమానంగా ఉంది.
వివాదాస్పద సమస్యలు
కొత్తగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి కంటే ముందే, వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి, నిరసనలు వ్యక్తం చేసినప్పుడు జనగణన ఒక సంక్లిష్టమైంది. వివాదాస్పద జాతీయ పౌరుల రిజిష్టర్ రూపకల్పనలో ఎవరు ''అసలైన పౌరులో'' నిర్ణయం జరగాలంటే జనగణన తప్పనిసరి. జాతీయ జనాభా రిజిస్టర్ తయారీతో పాటుగా ఒకవేళ జనగణనను కూడా నిర్వహించి ఉంటే పౌరులైనవారు, పౌరులు కాని వారిని కూడా చేర్చుకునే సాధారణ నివాసితుల రిజిస్టర్, ''ప్రతీ సాధారణ నివాసితుని పౌరసత్వ హౌదాను పరిశీలించడం ద్వారా అకస్మాత్తుగా జాతీయ భారత పౌరుల రిజిస్టర్‌ను సృష్టించే మొదటి అడుగుగా చూడడం'' మొదలైంది. సరిగ్గా దీనినే కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26, 2014లో ఒక అధికార ప్రకటనలో తెలియజేసింది. దీనికి సంబంధించి అన్ని రకాల దస్తావేజులు, ధృవపత్రాలను సమకూర్చడంలో వారి సామర్థ్యంపై పౌరులు పెద్ద సంఖ్యలో అభద్రతను వ్యక్తం చేశారు. గతంలో ఎనాడూ అడగని ప్రశ్నలతో కూడిన జనగణనను నిర్వహించేది లేదని కొన్ని రాష్ట్ర శాసనసభలు తీర్మానాలను కూడా జారీ చేశాయి. అస్సాం రాష్ట్రంలో జాతీయ పౌరుల రిజిస్టర్ అనుభవాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీపై ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అది పూర్తైనప్పటికీ, జాతీయ పౌరుల రిజిస్టర్ జాబితా 'సరైనది' కాదని భారతీయ జనతా పార్టీ విశ్వసించింది. సరైన జాబితాకు సంబంధించిన ఆలోచన వచ్చేంతవరకు ఇదొక నమ్మదగని కసరత్తుగానే ఉంటుంది.
కులపరమైన జనగణన కోసం గట్టిగా చేస్తున్న డిమాండ్ల పట్ల భారతీయ జనతా పార్టీ చాలా అప్రమత్తంగా ఉంటూ వస్తోంది. అస్తిత్వాల ధృవీకరణకు, గుర్తింపులను రూపొందించడానికి జనగణన కీలకమైన అంశంగా ఉంటుంది. కానీ, లెక్కించబడి, అస్తిత్వాలు ప్రభుత్వమే కోరుకుంటున్న గుర్తింపుల నమోదు గురించి ఇప్పుడు అయిష్టంగా ఉంది. 1931లో భారతదేశం చివరిసారిగా కుల జనగణను నిర్వహించింది. 2011లో సాధారణ జనగణన నిర్వహించిన తరువాత సామాజిక, ఆర్థిక, కుల జనగణనను నిర్వహించారు. కానీ కుల జనగణన మినహా మిగిలిన ఇతర సమాచారాన్ని ఖరారు చేసి, ప్రచురించగా, ఏవో కొన్ని ఇతర కారణాలను సాకుగా చూపి కుల జనగణన సమాచారాన్ని మాత్రం లేకుండా మినహాయించారు. కుల సమూహాల మధ్య ఉండే తేడాలు, వారనుభవించే ప్రత్యేకమైన హక్కులు, వారి జనాభా మధ్య అసమానతలు ఉన్నాయనేది స్పష్టం. సర్దుబాటును గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ హిందూత్వకు ఈ సమస్యలు తెలుస్తాయి కాబట్టి, అది సామాజిక న్యాయమనే ప్రధాన మైన అంశాన్ని పూర్తిగా వదిలేయాలని అనుకుంటున్నది.
అవిశ్రాంత సమాచార సేకరణ
1984లో మొదటిసారి జనగణనను నిర్వహించిన కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్, తన చరిత్రలో రెండవ జనగణనను ఈ సంవత్సరం పూర్తి చేసింది. జనగణనను బలవంతంగా కాకుండా, ప్రశాంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఒక నాగరిక రాజ్యం, ఆ రాజ్య వ్యవహారాల లక్షణం. 1990 నుండి జనగణన లేని దేశాల గురించి మాట్లాడితే కొన్ని సంపుటాలు తయారవుతాయి. దానిలో భారతదేశం చేరుతుందా? జనగణన నిర్వహించని దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ (1979), లెబనాన్ (1932), సోమాలియా (1985), ఉజ్బెకిస్తాన్ (1989), పశ్చిమ సహారా(1970)లు ఉన్నాయి. 1998లో జనగణనను నిర్వహించిన పాకిస్థాన్ మళ్ళీ జనగణనను చేపట్టేందుకు దాదాపు 20ఏండ్లు (అంటే 2017లో) సమయం తీసుకుంది. జనగణన చేపట్టని కాలం, పాకిస్థాన్ అసమర్థతను, పనిచేయనితనాన్ని గురించి తెలియచేస్తుంది.
ప్రజాధనాన్ని ఉపయోగించి బహిరంగంగా, స్వచ్ఛందంగా సామాజిక ప్రయోజనాల కోసం దేశం కోసం సేకరించిన జనగణన సమాచారం చాలా కీలకమైనది, విలువైనది. అంటే భారత ప్రభుత్వానికి ఈ సమాచారం వద్దని కాదు. ఇది భవిష్యత్తు జనగణనను ఒక ప్రభుత్వ రహస్యంగా మార్చినప్పటికీ, తన స్వంత ప్రయోజనాల కోసం తన పౌరుల సమాచారాన్ని సేకరించి ఉపయోగించుకోవడం పౌరుల సమాచారాన్ని తన ఇష్టానుసారం వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
ఇప్పుడు ఎన్నికల ఓటర్ జాబితాలతో ఆధార్‌ను అనుసంధానం చేయడానికి చట్టం అనుమతిస్తుంది. ఇది అనివార్యం కాకపోవచ్చు కానీ, పౌరుల యొక్క చాలా సున్నితమైన సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉండేలా ఇది అనుమతిస్తుంది. సమాచార సేకరణ ప్రయత్నం చాలా అవిశ్రాంతంగా కొనసాగుతూ ఉంది. రెండు హైకోర్టులు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు చేపట్టినా కూడా కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) రూల్స్, 2022ను ప్రకటించింది. వివాదాస్పదమైన ఈ నియమాలు శరీర కొలతలు తీసుకునే నిబంధనలను తెలియజేస్తాయి. (ఇది జీవసంబంధమైన నమూనాలు, రెటీనా స్కాన్, దోషులైన, అరెస్ట్ చేయబడిన లేదా నిర్బంధంలో ఉంచబడిన వ్యక్తుల లక్షణాలను, వారి బయోమెట్రిక్స్‌ను సేకరించే ఏజెన్సీలకు అధికారం కల్పిస్తుంది.) సమాచారాన్ని సేకరించాలనే బలమైన కోరిక, పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు, 2019 చుట్టూ జరిగిన సంఘటనలకు పూర్తి భిన్నంగా ఉంది. గోప్యత హక్కుని ఒక ప్రాథమిక హక్కుగా 2017లో భారత సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ దానికి పూర్తి భిన్నంగా ముసాయిదా బిల్లు ఆకస్మికంగా ఉపసంహరించబడడం వల్ల, ఆ తీర్పు ఐదవ వార్షికోత్సవం వేళ పౌరుల కోసం సమాచార రక్షణ చట్టం ఆలస్యం చేయబడ్తోంది. అదికూడా ఎన్నో గంటల చర్చలు, 81 మార్పుల కోసం చేసిన సూచనల అనంతరం. తప్పిపోయిన జనగణనకు, పౌరుల సమాచారాన్ని పోగుచేసినా ప్రజల భద్రత కోసం గాక ప్రభుత్వంతో వారి సంబంధాలు అసమానంగా ఉండేందుకే తోడ్పడతాయి.
జనగణన అనేది అనేక విషయాలకు సంబంధించిన అంశం. జన గణనకు ప్రాధాన్యతనిచ్చి, స్నేహ భావనను ధృవీకరించడానికి దానిని ఉపయోగించుకోవాలి. జనగణ నంటే గొర్రెల్ని లెక్కించడం కాదు. బాధ్యతలను నెరవేర్చడం లో వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని అనుమతించ కూడదు.
- సీమాఛిస్తీ
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451