Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులన్నీ రాజ్యాంగ రక్షణ ఒక ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తున్నాయి. దేశ పురోగతికి రాజ్యాంగం అవసరమే తప్ప ఆటంకం కాదని గుర్తించాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ముందు ప్రవేశపెడుతూ రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేసే పాలకులు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించ బడుతుందన్న విషయాన్ని అందరూ గమనించారు. ''నేటి నుండి మనం వైరుధ్య భరిత జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో సమానత్వం పొందినా సామాజిక, ఆర్థిక హక్కుల విషయంలో సమానత్వం రాలేదు. ఈ వైరుధ్యాన్ని ఎంత కాలం కొనసాగించాలి? సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఎంత కాలం తిరస్కరించాలి? మనం ఎంత కాలం తిరస్కరిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యం అంత ప్రమాదంలో పడిపోతుంది. అందు వలన ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకుంటే అసమానతలతో బాధపడేవారు ఈ రాజ్యాంగ అసెంబ్లీ చాలా శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చేస్తార''ని హెచ్చరిం చారు. ఆ హెచ్చరిక నేడు వాస్తవ రూపం ధరించిందనే అవగాహన అభ్యుదయ శక్తులన్నీ వచ్చాయి.
నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేడు మన భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన దాడిని వివిధ రూపాలలో తీవ్రతరం చేస్తున్నది. పరోక్షంగాను, కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా కూడా మను ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం లోకి జొప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. నిజానికి భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న నాటి నుండే దానిపై హిందూత్వ శక్తులుదాడి ప్రారంభించాయి. ఎందుకంటే హిందూ రాజ్య స్థాపనకు భారత లౌకిక రాజ్యాంగమే అడ్డంగా ఉంటుంది కాబట్టి హిందూత్వ సిద్ధాంతానికి ప్రతిరూపమైన ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగంపై తొలి నాటి నుండే విషం కక్కడం ప్రారంభించింది. వారి సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ ''భారత రాజ్యాంగంలో భారతీయత అనేది ఏమాత్రం లేకపోవడం అత్యంత నీచమైన విషయం. వేదాల తరువాత మనుస్మృతి హిందూ జాతికి అత్యంత పూజనీయమైనది. పురాతన కాలం నుండి మన సంస్కృతీ సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆచరణ వీటన్నింటికీ మనుస్మృతే భూమిక. అందువలన మనుస్మృతే రాజ్యాంగం'' అని ప్రకటించాడు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆవిష్కరించబడితే 30వ తేదీనే ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ మన రాజ్యాంగంలో పురాతన భారతంలోని తిరుగులేని రాజ్యాంగం పరిణామ ప్రస్తావన లేదు. మనుధర్మ శాస్త్రం అత్యంత పూరాతనమైనది. అందులోని ప్రతి అంశం నేటికీ యావత్ ప్రపంచ మన్ననలను అందుకుంటున్నది. ఇప్పటి మన రాజ్యాంగం పాశ్చాత్య దేశాల రాజ్యంగాల నుండి వివిధ అధికరణలను అరువు తెచ్చి భారీగా జాతుల కలగూరగంపగా రూపొందించబడినది. ఇందులో మనది అని చెప్పకోవడానికి ఏమీ లేదని ప్రకటించారు. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ దాని కాషాయ దళాలు అవకాశం దొరికినప్పుడల్లా భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే వస్తున్నారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య, విద్యుత్ వంటి రంగాలలో నేడు నిరంకుశంగా చొరబడి చేస్తున్న చట్టాలు రాష్ట్రాల హక్కులను ఒకదాని తరువాత ఒకటి కాలరాస్తూ భారత రాజ్యాంగం ఫెడరల్ స్వభావాన్ని అంతం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. స్వాతంత్య్రోద్యమం ముందుకు తెచ్చిన లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి ఉన్నత విలువలకు చెల్లు చీటీ ఇచ్చి రాజ్యాంగాన్ని మనుధర్మశాస్త్రం ఆధారంగా నడిపించే దేశంగా మార్చనున్నారు. అయితే ఇప్పుడిది కొత్తేమీ కాదు సంఫ్‌ుపరివార్ శక్తులు అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే ప్రయత్నించాయి. 1998లో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకట్రామయ్య కమిషన్‌ను నియమించింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకిక, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా 2015 రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వ వాణిజ్య ప్రకటన వెలువడింది. 2019లో మోడీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగంపై మరింత తీవ్రమైన దాడి జరుగుతున్నది. పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన సవరించే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మతస్వేచ్ఛకు సంబంధించిన అధికరణ 25, మైనారిటీలకు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవడం గురించి ఉన్న అధికరణం 30 లాంటి ముఖ్యమైన వాటిని కూడా సవరించి రద్దు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశానికి అధ్యక్ష తరహా పాలన కావాలనే తన భావనను ముందుకు తీసుకొచ్చి ఇక ఇప్పుడు ఏక సమయంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలనే తన ప్రతిపాదనకు మద్దతు సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇకపోతే న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ మొదలైన రాజ్యాంగ అధికార వ్యవస్థలు కూడా హిందూత్వ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఒత్తిడికి నేడు గురవుతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రకారం పనిచేయడానికి ప్రస్తుత రాజ్యాంగం కల్పించే అవకాశాన్ని వినియోగించుకొని హిందూ రాజ్యాన్ని తీసుకురావటమే లక్ష్యంగా సంఫ్‌ుపరివార్ పనిచేస్తున్నది. సంఫ్‌ుపరివార్ మెజారిటీ వాదాన్నే ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. నాయకుడి ప్రాతిపదికన నియంతృత్వ ప్రభుత్వం ఉండాలని అది కోరుకుంటుంది. ప్రజాస్వామ్యం అనేది పాశ్చాత్య భావన అని, అది భారతదేశానికి తగినది కాదని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తుంది. బీజేపీ విధానాలను ఏమాత్రం విమర్శించినా వారిని జాతి వ్యతిరేకులు గాను, పాకిస్థాన్ అనుకూల వ్యక్తులగాను, చైనా అనుకూల శక్తులుగాను ముద్రవేస్తున్నారు. ఇప్పుడు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిపై రాజద్రోహ నేరాన్ని మోపడం సర్వసాధారణం అయిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలోను, ఢిల్లీలోని విశ్వవిద్యా లయ విద్యార్థులపైన, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపైన అణచివేత చర్యలు బీజేపీ నిరంకుశ, ప్రజాతంత్ర వ్యతిరేక స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఒక్క రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడ నియంతృత్వానికి రంగం సిద్ధం చేయబడుతున్నది. పశుమాంస భక్షణపై నిషేధం, నైతిక పోలీసింగ్, కళాకారులను, సాంస్కృతిక ఉత్పత్తులను హిందూ వ్యతిరేకమైనవని తెగనాడటం, ఉన్నత విద్యాసంస్థలపై దాడులు చేయడం, హిందూత్వ విలువలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేయడం, కళలను సెన్సార్ షిప్‌కు గురిచేయడం, కళాకారులను బెదిరించడం ఇవన్నీ కూడా నియంతృత్వ దాడులకు ఉదాహరణ లుగా ఉన్నాయి. రామ జన్మభూమి, ఆవు లాంటి చిహ్నాలను మతపరమైన సమీకరణ కోసం సంఘ పరివార్ వినియోగించుకుంటున్నది. ప్రజలను, ప్రత్యేకించి సమాజంలోని పేద ప్రజానీకంలో మూఢత్వాన్ని పెంచి మత ఘర్షణలను సష్టిస్తుంది. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు ఇవన్నీ భిన్నం. అందుకే ఒక పథకం ప్రకారం ప్రస్తుత రాజ్యాంగాన్ని నిర్వీర్యపర్చి మనుధర్మ స్పూర్తితో రాజ్యాంగం తీసుకురావడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, దాని నాయకుడు నరేంద్రమోడీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న నినాదమే పచ్చి అబద్దం. కాబట్టి ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికతత్వం సామాజికన్యాయం, ఆర్థిక స్వావలంబన వంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140